-ఈ అభ్యర్థిత్వంపై CM సానుకూలంగా స్పందించారు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థకు త్వరలో జరగనున్న మేయర్ ఎన్నికల నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు, యువ నాయకులు బొండా సిద్ధార్థ గురువారం అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి మేయర్ అభ్యర్థిత్వానికి సంబంధించిన బయోడేటాను అందజేశారు.
ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా యువతను తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షించేలా అనేక కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించామని తెలిపారు. పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ యువతను పార్టీతో అనుసంధానం చేసేందుకు కృషి చేశానని పేర్కొన్నారు. యువతను ప్రోత్సహించడంలో మంత్రి నారా లోకేష్ గారి ఆలోచనలు, నాయకత్వం తనకు స్ఫూర్తిగా నిలిచాయని తెలిపారు. విజయవాడ నగర సమగ్ర అభివృద్ధిపై తనకు స్పష్టమైన ప్రణాళిక, వైఖరి ఉందని బొండా సిద్ధార్థ తెలిపారు. కూటమి భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జనసేనతో పాటు వివిధ వర్గాల నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నానని పేర్కొన్నారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో NRI టీడీపీ విభాగంతో కలిసి అనేక సెమినార్లు, కార్యక్రమాలు నిర్వహించి పార్టీ విజయానికి తన వంతు కృషి చేశానని తెలిపారు.
బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, సామాజికంగా, విద్యాపరంగా అన్ని అర్హతలు కలిగిన యువ నాయకుడు బొండా సిద్ధార్థ అని తెలిపారు. తమ కుటుంబం గత 20 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజాసేవలోనే ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా బొండా సిద్ధార్థ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానసపుత్రికగా భావించే P4 కార్యక్రమం స్ఫూర్తితో పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంతో పాటు నగరవ్యాప్తంగా విద్యార్థులకు స్కూల్, కాలేజ్ ఫీజుల కోసం సహాయం చేయడం, నిరుపేదలకు జీవనోపాధి కోసం తోపుడు బండ్లు అందించడం, స్వయం ఉపాధి కోసం కుట్టుమిషన్లు పంపిణీ చేయడం వంటి అనేక సేవా కార్యక్రమాలను బొండా సిద్ధార్థ చేపట్టారని బొండా ఉమా తెలిపారు. యువతకు సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న ఆదర్శప్రాయమైన యువ నాయకుడిగా సిద్ధార్థ ఎదిగారని పేర్కొన్నారు.
విజయవాడ నగరవ్యాప్తంగా ఉన్న యువత బొండా సిద్ధార్థకు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో పాటు కార్యాలయానికి వచ్చి తమ మద్దతును తెలియజేస్తున్నారని బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానించడంతో ఆయనను కలిసి బొండా సిద్ధార్థ మేయర్ అభ్యర్థిత్వానికి సంబంధించిన బయోడేటాను అందజేశామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దగ్గర నుండి సానుకూల ప్రతిస్పందన వచ్చిందని కృతజ్ఞతలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News