Breaking News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. 275 మిలియన్‌ యూనిట్లకు పైగా పెరిగిన వినియోగం

-నిరంతర విద్యుత్ సరఫరాకు ప్లాంట్లను సిద్ధం చేయాలి
-థర్మల్‌, హైడల్‌ కేంద్రాల్లో సాంకేతిక లోపాలు లేకుండా అప్రమత్తంగా ఉండాలి
-ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా 15 రోజుల బొగ్గు నిల్వలు తప్పనిసరి
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా… ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో విద్యుత్‌శాఖ అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో ప్రస్తుత డిమాండ్‌, ఉత్పత్తి సామర్థ్యం, ప్లాంట్ల పనితీరు, భవిష్యత్తు అవసరాలపై మంత్రి చర్చించారు. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం, ఫలితంగా గృహ, వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో విద్యుత్‌ వినియోగం పెరుగుతున్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. గతంలో రోజుకు సగటున 218 మిలియన్‌ యూనిట్లుగా ఉన్న విద్యుత్‌ వినియోగం ప్రస్తుతం 275 మిలియన్‌ యూనిట్లకు పైగా చేరిన నేపథ్యంలో, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి ప్లాంట్లు సిద్ధంగా ఉంచాలని ఆయన అధికారులకు సూచించారు. ఎల్‌నినో ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో విద్యుత్‌ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. అన్ని రంగాల విద్యుత్‌ అవసరాలను పరిగణనలోకి తీసుకుని సరఫరా ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. అంతరాయాలకు అవకాశం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. డిమాండ్‌ పెరిగే సమయాల్లో ఎక్కడా సరఫరా సమస్యలు తలెత్తకుండా ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థలను సమన్వయంతో నిర్వహించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో సాంకేతిక లోపాలకు తావివ్వొద్దు

థర్మల్‌, హైడల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి గొట్టిపాటి అధికారులకు స్పష్టం చేశారు. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా తగినంత విద్యుత్ అందుబాటులో ఉండాలంటే ఉత్పత్తి ప్లాంట్లలో సాంకేతిక లోపాలు తలెత్తకుండా ముందస్తు నిర్వహణ చేపట్టాలని ఆయన సూచించారు. అవసరమైన మరమ్మతులు, నిర్వహణ పనులను సకాలంలో పూర్తి చేసి ఉత్పత్తి కేంద్రాల కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచాలని అధికారులకు స్పష్టం చేశారు. అదే విధంగా థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఉత్పత్తి ప్లాంట్‌లో కనీసం 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. బొగ్గు సరఫరా, నిల్వలు, వినియోగంపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలన్నారు.

భవిష్యత్తు అవసరాలకు పునరుత్పాదక విద్యుత్‌

ప్రస్తుత డిమాండ్‌ను తీర్చడంతో పాటు రాష్ట్ర భవిష్యత్తు విద్యుత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తిని మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి అధికారులకు సూచించారు. సౌర, ఇతర పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా పీఎం సూర్యఘర్ పథకాన్ని మరింత ఎక్కువ మంది వినియోగించుకునేలా చూడాలన్నారు. ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితుల ప్రభావంతో డిమాండ్‌లో ఆకస్మిక పెరుగుదల వచ్చినా విద్యుత్‌ వ్యవస్థపై ఒత్తిడి పడకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని చెప్పారు. ఉత్పత్తి, కేంద్రాల సామర్థ్యం, బొగ్గు నిల్వలు, సరఫరా వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో జెన్ కో ఎండీ ఎస్.నాగలక్ష్మి, ట్రాన్స్ కో జేఎండీ సూర్య సాయి ప్రవీణ్ చంద్, పలువురు ఇంధన శాఖ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *