Breaking News

రాష్ట్ర అభివృద్ధి, రైతు సంక్షేమమే ముఖ్య మంత్రి చంద్రబాబు లక్ష్యం

-రైతుల కష్టాలు జగన్‌కు పబ్లిసిటీ ఈవెంట్లు లాగా అనిపిస్తాయి.
-అసత్య ట్వీట్లతో ప్రజలను మభ్యపెట్టలేరంటూ జగన్ పై దేవినేని ఉమా ఫైర్
-ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా మార్చడమే లక్ష్యం.. 48 ఏళ్ల అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న సీఎం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతుల కష్టాలు, సాగునీటి సమస్యలు గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పబ్లిసిటీ ఈవెంట్లలా కనిపిస్తాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు మాత్రం రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గొల్లపూడి కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. నీటిని రాజకీయానికి వాడుకున్నది జగన్‌ అయితే, నీటిని రైతు పొలాలకు మళ్లిస్తున్నది చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి మంచి జరుగుతుంటే ఓర్వలేక పోలవరం, అమరావతిపై జగన్‌ విషప్రచారం చేస్తున్నారని అసత్య ట్వీట్లతో ప్రజలను మభ్యపెట్టలేరని, జగన్‌ ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని దేవినేని ఉమ విమర్శించారు.

48 ఏళ్ల రాజకీయ, పరిపాలనా అనుభవంతో విపత్కర పరిస్థితుల్లోనూ చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని ఉమ అన్నారు. ఎల్‌నినో పరిస్థితుల్లో సైతం నీటిని అన్ని ప్రాంతాలకు తీసుకెళ్లి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించారని తెలిపారు. పట్టిసీమ ద్వారా 33 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు అందించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. పట్టిసీమ దండగ అన్న జగన్‌.. తాడేపల్లి ప్యాలెస్‌లో నువ్వు వాడుకున్న నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. ప్రాజెక్టులు, సాగునీటి వ్యవస్థపై కనీస అవగాహన లేని జగన్‌.. నేడు నీటిపారుదల ప్రాజెక్టుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. వెలుగొండ ప్రాజెక్టును తానే పూర్తి చేశానని అంటున్న జగన్‌.. ఐదేళ్లు అధికారంలో ఉండి రైతులకు నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోయారని ఉమ ప్రశ్నించారు. పురుషోత్తమపట్నం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎన్‌జీటీ, కోర్టుల్లో కేసులు వేయించి కుట్రలు చేశారని ఆరోపించారు. సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటిని మళ్లించి రాష్ట్రాన్ని కాపాడాలని చంద్రబాబు ప్రయత్నిస్తుంటే.. జగన్‌ మాత్రం వాటిని పబ్లిసిటీ ఈవెంట్లుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. పట్టిసీమ, పురుషోత్తమపట్నం ప్రాజెక్టులను నాలుగేళ్లు అడ్డుకున్న జగన్‌.. ఐదో ఏడాది వాటిని ఆన్‌ చేయాల్సి రావడం ‘దేవుడి స్క్రిప్ట్‌’ అని వ్యాఖ్యానించారు.

కేసుల భయంతో 2023 మార్చిలో పోలవరం ఎత్తు 41.15 మీటర్లు (135 అడుగులు) ఉండేలా ప్రతిపాదన పంపించిన జగన్‌.. ఇప్పుడు పోలవరం ఎత్తుపై మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఐదేళ్ల వైసీపీ విధ్వంసాన్ని సరిదిద్ది పోలవరాన్ని గాడిలో పెడుతున్నది చంద్రబాబు ప్రభుత్వమేనన్నారు. పోలవరంలో 135 అడుగులకు నీళ్లు నిలబెట్టేది చంద్రబాబేనని, భవిష్యత్తులో 150 అడుగులకు నీళ్లు నిలబెట్టేది కూడా చంద్రబాబేనని స్పష్టం చేశారు. నేరేడు బ్యారేజీ పూర్తయితే సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటిని పంట పొలాలకు మళ్లించవచ్చని ఉమ తెలిపారు. తద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా తీర్చిదిద్దడమే చంద్రబాబు లక్ష్యమని చెప్పారు. ప్రాంతాల పేరుతో వైసీపీ నేతలతో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని జగన్‌ చూస్తున్నారని ఆరోపించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతే వాటిని తిరిగి ఏర్పాటు చేయడం చేతకాని జగన్‌.. ఇప్పుడు ప్రాజెక్టుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పులివెందులకు రూ.3,500 కోట్లతో నీళ్లు అందించింది చంద్రబాబు ప్రభుత్వమేనని గుర్తుచేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *