-ఈహెచ్‌ఎస్ కింద మరో రూ.23 కోట్లు చెల్లింపునకు సిద్ధం
-ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.1,657 కోట్లు చెల్లింపులు
-మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అనుబంధ ప్రైవేట్ ఆస్పత్రులకు చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కిందటి ఆగస్టు నెలలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ప్రైవేటు ఆస్పత్రులకు రూ.130 కోట్లు, బిల్ డిస్కౌంట్ స్కీం కింద రూ.80 కోట్లు కలిపి మొత్తం రూ.210 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) కింద మరో రూ.23 కోట్లు సీఎఫ్‌ఎంఎస్ వద్ద చెల్లింపునకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులకు రూ.233 కోట్ల మేర చెల్లిoపులు జరుగుతున్నట్లు అవుతుందని చెప్పారు
2026–27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు బిల్ డిస్కౌంట్ స్కీం కింద చేసిన చెల్లింపులతో సహా వివిధ ఆరోగ్య పథకాల కింద ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.1,657 కోట్లు చెల్లించినట్లు మంత్రి తెలిపారు.
ప్రజలకు నిరంతరాయంగా వైద్య సేవలు అందించడంలో ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రులు కీలక భాగస్వాములని, వాటికి సంబంధించిన అర్హత కలిగిన బిల్లులకు నిబంధనల ప్రకారం చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
Prajavartha Online Telugu News