-రూ.100 కోట్లతో 100 పడకలతో సంస్థ ఏర్పాటు
-రూ.9.94 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రాథమిక పనులు త్వరలో ప్రారంభం
-మంత్రి సత్యకుమార్ వెల్లడి
-మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, దీర్ఘకాలిక నొప్పులు, శ్వాసకోశ, మానసిక ఒత్తిడి, నిద్ర, ఇతర సమస్యలకు యోగా, నేచురోపతి విధానాల్లో చికిత్స
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర సమీపంలోని ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో కేంద్ర యోగా–ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ (CRIYN) ఏర్పాటు పనులు వేగం పుంజుకున్నాయి. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ నేచురోపతి (CCRYN) ద్వారా 100 పడకల ఆసుపత్రితో ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నారు.
సంస్థ ఏర్పాటుపై కేంద్రం నుంచి అధికారిక సమాచారం వచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు
ఇoదుకు తగ్గట్లు సంస్థ ఏర్పాటుకు అవసరమైన భూమి, రహదారి, డ్రెయినేజీ, స్థల సమతలీకరణ తదితర ప్రాథమిక పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.9.94 కోట్లను మంజూరు చేసినoదున తదుపరి పనుల్లో మరిoత పెరుగుతుందని చెప్పారు. ప్రతిపాదిత స్థలంలో చేపట్టాల్సిన పనులపై రాష్ట్ర, జిల్లా అధికారులు, CCRYN, కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో ఆగస్టు 4న సంయుక్తoగా పరిశీలించారు. స్థల అనుకూలత, మౌలిక వసతులను పరిశీలించిన అనంతరం పలు నిర్ణయాలు తీసుకున్నారు. అంగీకరించిన పనులను మూడు నెలల్లో పూర్తి చేసి భూమిని CCRYNకు అప్పగించేలా చర్యలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రూ.9.94 కోట్లతో ప్రాథమిక పనులు
మంజూరైన రూ.9.94 కోట్లలో రూ.6.74 కోట్లు భూసంబంధిత అవసరాలకు, రూ.3.20 కోట్లు స్థల నింపుదల, సమతలీకరణకు కేటాయించారు. ప్రాంగణంలోని కొన్ని ప్రాంతాలు ఎన్‌హెచ్–16 స్థాయి కంటే 2–3 మీటర్ల మేర దిగువన ఉండటంతో అవసరమైన మేరకు నాణ్యమైన మట్టితో నింపి నిర్దేశిత స్థాయికి తీసుకురానున్నారు. వర్షపు నీటి సహజ ప్రవాహానికి ఆటoకo లేకుండా చర్యలు తీసుకోనున్నారు. సంస్థకు నేరుగా చేరుకునేలా జాతీయ రహదారి–16 నుంచి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమి మీదుగా 40 అడుగుల వెడల్పుతో అప్రోచ్ రోడ్డు నిర్మించనున్నారు.
కేంద్రం నుంచి రూ.100 కోట్ల గ్రాంట్
CRIYN ఏర్పాటుకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ రూ.100 కోట్ల గ్రాంట్ అందించనుంది. సంస్థకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉండటంతో, ప్రస్తుతం సంస్థ ఏర్పాటు కోసం అవసరమైన ప్రాథమిక పనులను చేపడుతోంది.
ఆగస్టు 24న సంయుక్త తనిఖీలో తీసుకున్న నిర్ణయాలకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆగస్టు 25 న కేంద్రం రాష్ట్ర ఆయుష్ శాఖ డైరెక్టర్‌కు రాసిన లేఖలో నడింపాలెంలో 100 పడకల ఆసుపత్రితో CRIYN ఏర్పాటుకు భూమిని స్వీకరించి తదుపరి చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. అంగీకరించిన పనులన్నీ మూడు నెలల్లో పూర్తిచేయాలని కోరింది. గుంటూరు నగరానికి సమీపంలో, ఎన్‌హెచ్–16కు ఆనుకుని సంస్థ ఏర్పాటు కానుండటంతో రాకపోకలు సులభతరం కానున్నాయి. అప్రోచ్ రోడ్డు, బస్‌స్టాప్ వంటి సదుపాయాలతో ప్రజలకు అందుబాటు మెరుగుపడనుంది. ప్రాథమిక పనులు పూర్తయిన అనంతరం భూమిని CCRYNకు అప్పగించే ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత సంస్థ నిర్మాణానికి సంబంధించిన తదుపరి చర్యలు ప్రారంభమవుతాయి. నిర్మాణం పూర్తయితే 2028 నాటికి CRIYN కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయుష్ కమీషనర్ గోపాలకృష్ణ తెలిపారు.
ప్రత్యేక చికిత్సలు
100 పడకల ఇన్‌పేషెంట్ ఆస్పత్రి, బహుళ విభాగాల పరిశోధనా కేంద్రంగా దీనిని అభివృద్ధి చేయనున్నారు. పురుషులు, మహిళలకు ప్రత్యేక సాధారణ, ప్రత్యేక వార్డులు ఉంటాయి. *ఔట్ పేషెంట్ విభాగం (OPD)*లో వైద్య సంప్రదింపులు, ఆరోగ్య పరీక్షలు, జీవనశైలి, ఆహార సలహాలు, ఫాలోఅప్, నివారణాత్మక ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. అవసరాన్ని బట్టి రోగులను ఇన్‌పేషెంట్‌గా చేర్చి చికిత్స అందించడం, ల్యాబ్ పరీక్షలు లేదా అవసరమైన ఇతర వైద్య సంస్థలకు రిఫర్ చేయడం జరుగుతుంది.
మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్, కీళ్ల వ్యాధులు, దీర్ఘకాలిక నొప్పులు, జీర్ణ–శ్వాసకోశ సమస్యలు, ఒత్తిడి, ఆందోళన, నిద్ర సమస్యలు, మహిళల ఆరోగ్య సమస్యలు, నాడీ సంబంధిత పునరావాస పరిస్థితులకు చికిత్స అందిస్తారు.
పురుషులు, మహిళలకు వేర్వేరు నేచురోపతి చికిత్సా విభాగాల్లో హైడ్రోథెరపీ, మసాజ్, మడ్ థెరపీ, మడ్ బాత్, స్టీమ్–సౌనా, హిప్, స్పైనల్ బాత్‌లు, ప్యాక్స్, కంప్రెస్‌లు తదితర చికిత్సలు ఉంటాయి. ఫిజియోథెరపీ, ఆక్యుపంక్చర్, యోగా సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. పురుషులు, మహిళలకు ప్రత్యేక యోగా హాళ్లలో ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, యోగా నిద్ర, యోగిక్ క్రియాలు నిర్వహిస్తారు.
రోగుల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక నేచురోపతి డైట్ కిచెన్ ద్వారా చికిత్సా ఆహారం అందిస్తారు. సుమారు 300 మంది సామర్థ్యంతో కాన్ఫరెన్స్ హాల్, వాకింగ్ ట్రాక్‌లు, ఔషధ మొక్కలు, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ఏర్పాటు చేయనున్నారు.
పరిశోధన, ఉపాధికి ప్రాధాన్యం
హెమటాలజీ, బయోకెమిస్ట్రీ, న్యూరో–సైకోఫిజియాలజీ, మాలిక్యులర్ బయాలజీ ప్రయోగశాలలతో యోగా–నేచురోపతిపై శాస్త్రీయ పరిశోధనలు, క్లినికల్ అధ్యయనాలు చేపడతారు. సుమారు 100–120 మందికి ప్రత్యక్ష ఉపాధి, 15–20 మంది బీఎన్‌వైఎస్ వైద్యులు సహా వివిధ నిపుణులకు అవకాశాలు లభించనున్నాయి. ఆరోగ్య శిబిరాలు, యోగా, ప్రజా అవగాహన కార్యక్రమాలతో గుంటూరుతోపాటు రాష్ట్ర ప్రజలకు సమగ్ర యోగా–నేచురోపతి సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Prajavartha Online Telugu News