-132 నమూనాల సేకరణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రతా ప్రమాణాలను పటిష్టంగా అమలు చేయడంలో భాగంగా బెల్లం, తేనె విక్రయాలు, నిల్వలపై గురువారం రాష్ట్ర ఆహార భద్రతా అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ఆహార సంస్థలు, ఆహార విక్రయ కేంద్రాలను ఫుడ్ సేఫ్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బెల్లం మరియు తేనె నాణ్యత, ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా అనే అంశాలను పరిశీలించారు.
ఈ ప్రత్యేక డ్రైవ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 132 బెల్లం మరియు తేనె నమూనాలను సేకరించి, విశ్లేషణ నిమిత్తం సంబంధిత ప్రయోగశాలలకు పంపించారు. ఈ సందర్భంగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ (ఫుడ్ సేఫ్టీ) అరుణ్ బాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహార పదార్థాలు అందేలా ఆహార భద్రతా విభాగం తనిఖీలు నిర్వహిస్తోందని తెలిపారు.
63 కిలోల నిషేధిత ఇంగువ స్వాధీనం
ఇదేవిధంగా గడిచిన రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇంగువపై ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో FSSAI నిషేధించిన LG, Everest బ్రాండ్ల ఇంగువ నిల్వలను అధికారులు తనిఖీ చేశారు. మొత్తం 173 ఇంగువ నమూనాలను సేకరించి సంబంధిత ప్రయోగశాలలకు విశ్లేషణ కోసం పంపించారు. 63 కిలోల ఇంగువను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఇంగువ విలువ రూ.1,11,219/-గా ఉంది.
Prajavartha Online Telugu News