-ప్రధాన చారిత్రాత్మక స్థలాలు, సాంస్కృతిక వారసత్వ స్థలాలు మరియు యాత్రస్థలాల మీదుగా
ఇతివృత్త ఆధారిత ప్రత్యేక రైళ్లను ప్రయివేట్ సంస్థలు నడిపించే అవకాశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైల్వే మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే ‘‘భారత్ గౌరవ్’’ పేరిట ఇతివృత్త ఆధారిత పర్యాటక సర్క్యుట్ రైళ్లను ప్రవేశపెట్టడానికి ప్రతిపాదించింది. ఈ రైళ్లను నడిపించే అవకాశాన్ని ప్రయివేట్ సంస్థలకు రైల్వే కల్పిస్తుంది. భారత దేశ సాంస్కృతిక మరియు వారసత్వ, ప్రముఖ చారిత్రాత్మక ప్రదేశాలు మరియు ముఖ్యమైన యాత్ర స్థలాల విశేషాలను దేశ ప్రజలకు, ప్రపంచానికి తెలియచేయాలనే లక్ష్యంతో ఈ రైళ్లను ప్రవేశపెడుతున్నారు. దీనితో రైలు ప్రయాణికులు నిరాటంకంగా పర్యటించే అవకాశాలే కాకుండా దేశ పర్యాటక రంగం అభివృద్ధికి కూడా ఎంతో తోడ్పడుతుంది.
వ్యక్తిగతంగా, భాగస్వామ్య సంస్థగా, కంపెనీగా, వ్యాపార సంస్థలు ఇందులో పాల్గొనవచ్చు. భారత్ గౌరవ్ రైళ్ల నిర్వహణలో ప్రయవేట్ సంస్థలకు ఇతివృత్త పర్యాటక, మార్గాల ఎంపిక, దర్శనీయ స్థలాలు, చార్జీలు మరియు దీనికి సంబంధించిన ఇతర ఈ అంశాలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఇవ్వబడుతుంది.
ఆసక్తిగలవారు ఆన్‌లైన్ ద్వారా www.indianrailways.gov.inలో నమోదు చేసుకోవాలి. 10 పని దినాలలో ఈ ప్రక్రియ ప్రారంభించబడుతుంది. నమోదు చేసుకున్న సర్వీసు ప్రొవైడర్లు వారికి కావాల్సిన విధంగా రేక్ కూర్పు (కనీసంగా 14 కోచులు మరియు గరిష్టంగా 20 కోచులు) ఎంపిక చేసుకునే అవకాశముంది. రైల్వే వారి మౌలిక సదుపాయాలను మరియు రోలింగ్ స్టాక్‌ను వినియోగించుకునేందుకు నిబంధనల ప్రకారం ‘రైట్ టు యూజ్’ చార్జీలు, ఫిక్స్‌డ్, వేరియబుల్ హాలేజ్ చార్జీలు, స్టాబ్లింగ్ చార్జీలు వంటి చార్జీలు సర్వీసు ప్రొవైడర్లకు విధించబడుతాయి. ఈ రైళ్లను మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సమానంగా పరిగణిస్తారు.
అంతేకాక సర్వీసు ప్రొవైడర్లు వారి వ్యాపార రీత్యా కోచుల లోపల మరియు వెలుపల ఆయా రైళ్ల బ్రాండ్ ప్రకటనలు లేదా మూడవ పార్టీ వ్యాపార ప్రకటనలను వేసుకునే స్వేచ్ఛ వారికుంది. భద్రతా నిబంధనలు అనుసరించి కోచుల లోపలి భాగాలలో పరిమితులకు అనుగుణంగా ఆధునీకరణ పనులు నిర్వహించుకునేందుకు అనుమతిస్తారు. ఆసక్తి గల సర్వీసు ప్రొవైడర్లు దీనికి సంబంధించి ఇతర వివరాల కోసం రైల్ నిలయం కార్యాలయంలో దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ (ప్రయాణికుల సేవలు) ఆర్.సుదర్శన్ ని లేదా bharatgauravtrainsscr@gmail.com మెయిల్‌లో సంప్రదించవచ్చు.
వీలైనంతా త్వరగా ప్రారంభానికై సర్వీసు ప్రొవైడర్లచే వచ్చే ఏవేని అభ్యర్థనలను నెరవేర్చే ప్రక్రియను నిర్ణీత కాలంలో పూర్తిచేస్తారు. కోచుల కేటాయింపు, కోచుల నిర్వహణ వంటి అంశాలను సమయానుకూలంగా పూర్తి చేసేలా దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం స్థాయిలో కస్టమర్ సపోర్టు యూనిట్‌ను ప్రారంభించారు. ఇది వినియోగదారులకు కావాల్సిన అవసరాలను నెరవేర్చడంలో తోడ్పడుతూ వారి సహాయకారిగా ఉంటుంది.
ఇతివృత్త ఆధారంగా ప్రవేశ పెడుతున్న ‘‘భారత్ గౌరవ్’ పర్యాటక సర్క్యూట్ రైళ్ల అవకాశాన్ని సర్వీసు ప్రొవైడర్లు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య పిలుపునిచ్చారు. ఇది రైల్వే వారితో పాటు ప్రయివేట్ సంస్థలకు కూడా ప్రయోజనకరమైనది అని ఆయన అన్నారు. చారిత్రక వారసత్వ సంపద, ప్రముఖ చారిత్రక స్థలాలు మరియు ప్రధాన యాత్ర స్థలాలు దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్ పరిధిలో ఎన్నో ఉన్నాయని, వీటిని ‘భారత్ గౌరవ్’ రైళ్లతో అనుసంధానిస్తే ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అన్నారు.