విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయ రంగాన్ని ప్రాధాన్యతా రంగంగా గుర్తించి వెంటనే బ్యాంకర్లు స్పందించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. స్థానిక రైతు శిక్షణా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ వ్యవసాయ, పేదల గృహనిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయరంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించినప్పటికీ, జిల్లాలో బ్యాంకర్లు మాత్రం వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, రైతులకు పంట రుణాలు అందించడంలో నిర్దేశించిన లక్ష్యాల సాదించకపోవడంపై కలెక్టర్ బ్యాంకర్లపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసారు. వ్యవసాయం, పేదల గృహ నిర్మాణం వంటి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పధకాల అమలులో సానుకూల స్పందన లేకపోవడం వంటి బ్యాంకర్ల తీరుపై జిల్లా కలెక్టర్ జె. నివాస్ అసహనం వ్యక్తం చేశారు. జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి నిర్దేశించిన 16 వేల 527 కోట్ల రూపాయలు పంట రుణాలు, టర్మ్ రుణాల మంజూరు లక్ష్యానికి గాను ఇంత వరకు కేవలం 9 వేల 623 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేసారని, ఆర్ధిక సంవత్సరం మరికొద్ది నెలల్లో పూర్తయ్యే తరుణంలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయని, వాటికి చేయూత ఇవ్వవలసిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరినప్పటికీ 7500 కోట్ల రూపాయలు రుణాలు మంజూరుకు గాను ఇప్పటివరకు కేవలం 2 వేల 132 కోట్ల రూపాయలే అందించారన్నారు. ఇప్పటికైనా బ్యాంకర్లు స్పందించి వార్షిక రుణాల ప్రణాళిక లక్ష్యాలను నూరు శాతం సాధించే దిశగా కృషి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఆర్ధిక అక్షరాస్యత పై జిల్లాలో 10 బ్లాకులను గుర్తించడం జరిగిందన్నారు. ఆర్ధిక అక్షరాస్యత కార్యక్రమంపై విస్తృతంగా అవగాహన కలిగించాలన్నారు. , గ్రామీణ ప్రాంతాలలోని వారికి డిజిటల్ లావాదేవీలు తెలియజేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
పేదల గృహాల నిర్మాణానికి చొరవ చూపండి. : బ్యాంకర్లకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ విజ్ఞప్తి
జిల్లాలో 19 వేల 376 టిడ్కో గృహాలకు 679 కోట్ల రూపాయలు రుణాల మంజూరు చేయవలసి ఉండగా ఇంత వరకు కేవలం 15. 74 కోట్ల రూపాయలు మాత్రమే అందించారన్నారు. మిగిలిన లబ్దిదారులకు కూడా రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను కోరారు. పేదలకు స్వంత గృహాలు అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి బ్యాంకర్లు సానుకూలంగా స్పందించాలన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో 5424 మంది పేదలకు టి డ్ కో గృహాలకు మంజూరు కాగా,కేవలం 416 మందికి మాత్రమే 6.88 కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. రుణాల మంజూరు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలనీ కోరారు. పేదల గృహ నిర్మాణాల రుణాలు మంజూరు వేగవంతం కాకపోతే జిల్లా ప్రగతి కుంటుపడుతుందన్నారు. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ , జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, నూజివీడు, ఉయ్యురు, గుడివాడ, మచిలీపట్నం పట్టణ పరిధిలో పేదలు నిర్మించుకుంటున్న ఇళ్లకు రుణాల మంజూరు ను వేగవంతం చేయాలనీ కలెక్టర్ బ్యాంకర్లను కోరారు. ఇందుకు పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా బ్యాంకు అధికారులు సానుకూలంగా స్పందించారు. జిల్లాలోని మచిలీపట్టణం, ఆత్కూరు లలో 338 మంది యువత నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ పొందారని, వారికి స్వయం ఉపాధి కింద యూనిట్లు స్థాపించుకునేందుకు అవసరమైన రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఇంత ముఖ్యమైన సమావేశానికి హాజరు కావలసిందిగా ముందుగా సమాచారం ఇచ్చినప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకుల కంట్రోలర్స్ స్థానంలో వారి కింది స్థాయి సిబ్బందిని పంపడంపై బ్యాంకర్ల తీరుపై జిల్లా కలెక్టర్ జె. నివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
విజయవాడ మునిసిపల్ కమీషనర్ వి. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ విజయవాడ మునిసిపల్ పరిధిలో టి డ్ కో గృహాలకు రుణాలకు గాను దరఖాస్తులు అందించడం జరిగిందని, వాటిని పరిశీలించి, ఏమైనా పొరపాట్లు ఉంటె తెలియజేస్తే తమ సిబ్బంది సరిచేసి దరఖాస్తులు అందింస్తారన్నారు.
విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల గృహ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదని , విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో టి డ్ కో గృహాలకు రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలనీ బ్యాంకర్లను కోరారు
సమావేశంలో శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, జాయింట్ కలెక్టర్ (ఆసరా ) కె. మోహన్ కుమార్, ఆర్ బి ఐ అధికారి రాజేంద్ర ప్రసాద్, నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ టి. విజయ్, ప్రభృతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News