విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాజ్‌పేయి ఔన్నత్యాన్ని ఏ నాయకుడితోనూ పోల్చలేమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. వాజ్‌పేయి గొప్ప వక్త, కవి గానేకాక దేశంలోని సామాన్య ప్రజల హక్కుల కోసం పోరాడిన నాయకుడని గవర్నర్ అన్నారు. మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి 97వ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ‘సుపరిపాలన దినోత్సవం’గా జరుపుకుంటున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. శనివారం రాజ్‌భవన్ దర్బార్ హాలులో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ హరిచందన్ అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాజ్‌పేయి జన్‌సంఘ్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో పనిచేసే అదృష్టం తనకు లభించిందని గవర్నర్ గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఒడిశా యూనిట్ అధ్యక్షుడిగా తనను నామినేట్ చేశారని గవర్నర్ అన్నారు. దివంగత వాజ్‌పేయి అభివృద్ధి కోసం ఎంతో శ్రమించారని, ఈ దేశంలోని మరే ఇతర ప్రధానమంత్రి ఆయనలా ఆలోచించలేదన్నారు. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజనతో గ్రామాలను మంచి అనుసంధాన రహదారులు, మంచి కమ్యూనికేషన్‌తో వంటి పనులు ఆయన హయాంలోనే జరిగాయన్నారు. తద్వారా వాణిజ్యం, వ్యాపారం తదితర అన్ని రంగాలలో అభివృద్ధి సాధ్యమైందన్నారు. దేశంలోని నాలుగు పెద్ద నగరాలను కలుపుతూ స్వర్ణ చతుర్భుజి పేరిట జాతీయ రహదారులను అభివృద్ది చేసింది కూడా అటల్ ప్రభుత్వమేనని గౌరవ హరిచందన్ కొనియాడారు. వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పోఖ్రాన్‌లో నిర్వహించిన అణు పరీక్షలతో బడా శక్తుల బెదిరింపులకు తాను చలించలేదని స్పష్టం చేశారన్నారు. భారతదేశం అణుశక్తిగా మారిందని ప్రపంచానికి సగర్వంగా ప్రకటిస్తూ ముందడుగు వేసారని వివరించారు. ఫలితంగానే భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మాత్రమే కాకుండా, అణుశక్తి సహిత దేశంగా విశ్వవ్యాప్త గౌరవాన్ని పొందిందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, ఉప కార్యదర్శి సన్యాసి రావు, రాజ్‌భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
యన్.టి.ఆర్ క్రీడాప్రాంగణం సంక్రాంతి సంబరాల పోటీల రిజిస్ట్రేషన్ కు శనివారం సాయంత్రం వరకు గడువు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ, ఈ సందర్భంగా నగర పాలక …