-ఏ ముఖం పెట్టుకుని విజయవాడలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు..?
-రాష్ట్రానికి కేంద్రం తీరని అన్యాయం చేస్తుంటే.. చోద్యం చూస్తున్న రాష్ట్ర బీజేపీ నాయకులు
-కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై మీ వైఖరి ఏమిటో సమాధానం చెప్పాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు, విడిపోయిన రాష్ట్రానికి నిధుల మంజూరు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సహా అనేక అంశాలలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తోందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు అన్నారు. ఇటువంటి సమయంలో అధిష్టానంపై ఒత్తిడి పెంచకుండా రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదన్నట్లు రాష్ట్ర బీజీపీ నాయకత్వం వ్యవహరించడం బాధాకరమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వంత పాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ నగరంలో సభ నిర్వహించే ముందు రాష్ట్ర ప్రజలు అడిగే ఈ ప్రశ్నలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
1. గత తెలుగుదేశం ప్రభుత్వంతో కలిసి ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కుచ్చు టోపీ పెట్టారు. పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ స్పష్టమైన ప్రకటన చేసిన నాడు బీజేపీ ఎంపీలు సైతం ఆ నిర్ణయాన్ని స్వాగతించలేదా..? ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలని మాట్లాడలేదా..? తిరుపతి సభలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చడం లేదో..? సమాధానం చెప్పాలి.
2. విభజన చట్టంలో పోలవరాన్ని కేంద్రమే పూర్తిచేస్తుందని, అన్ని అనుమతులు ఇచ్చి పునరావాసం పరిహారం సహా అన్నింటినీ నెరవేరుస్తామన్నారు. ఇప్పుడు చేయకపోవడం వంచించడం కాదా..?
3. విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణపై బీజేపీ వైఖరి ఏమిటో రేపు జరగబోయే సభలో స్పష్టమైన ప్రకటన చేయగలరా..?
4. ఎన్నికల ముందు విశాఖ రైల్వే జోన్ ఇస్తామని హామీ ఇచ్చారని అది ఎక్కడ ఉందో చెప్పాలని ప్రశ్నించారు.
5. రాష్ట్రంపై ఇటీవల కురిసిన భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి కేంద్రం ఏం చర్యలు తీసుకుందో రాష్ట్ర బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి.
6. తెలంగాణ నుంచి రావాల్సిన రూ.6,112 కోట్ల విద్యుత్ బకాయిల గూర్చి అనేకమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా.. ఎందుకు స్పందించడం లేదు..?
7. ఏపీలో పౌరసరఫరాలకు ఇవ్వాల్సిన రూ.1,700 కోట్లు ఎందుకు విడుదల చేయడం లేదు..?
8. రాష్ట్ర విభజన, గత ప్రభుత్వం చేసిన అప్పులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది. రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై లేదా..?
9. మరోవైపు దేశంలో కరోనా నాలుగో వేవ్ ఉధృతి కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో కోవిద్ నిబంధనలు అతిక్రమణ చేయవద్దని కేంద్ర హోం శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ మార్గదర్శకాలను అనుసరించి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా దేశంలోని పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నాయి. ఇటువంటి సమయంలో పెద్దఎత్తున జనాలను సమీకరించేలా సభలు నిర్వహించడం దేనికి సంకేతం..?
రాష్ట్రానికి ఇలా పదేపదే ద్రోహం చేస్తూ.. మరలా ఏ ముఖం పెట్టుకొని బహిరంగ సభలు నిర్వహిస్తున్నారో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని మల్లాది విష్ణు గారు డిమాండ్ చేశారు. విభజన చట్టం అమలు పదేళ్ల కాలంలో ఇప్పటికి ఎనిమిదేళ్లు ముగిసిందని.. ఇంకా చాలా హామీలు నెరవేర్చవలసి ఉందని గుర్తుచేశారు. విభజన హామీల అమలుకు గడువు రెండేళ్లే ఉన్నందున ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, పెట్రోకారిడార్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, వెనకబడిన జిల్లాల గ్రాంటు ఇలా పలు అంశాల్లో రాష్ట్రం పట్ల కేంద్రం సుముఖత వ్యక్తం చేసేలా.. రాష్ట్ర బీజేపీ నాయకత్వం చొరవ చూపాలని కోరారు. అంతేగానీ బాధ్యతల నుంచి వైదొలగుతూ.. మభ్యపెట్టే సభలు నిర్వహించాలనుకుంటే విజ్ఞులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు.
మరోవైపు దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే అప్పులు చేస్తున్నట్లు టీడీపీ నేత జీవీ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మల్లాది విష్ణు గారు అన్నారు. గత టీడీపీ పాలనలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థను అథోగతిపాలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. తరువాత వచ్చే ప్రభుత్వానికి అప్పులు కూడా దొరకకూడదని చట్ట పరిధి దాటి చంద్రబాబు అప్పులు చేశారని దుయ్యబట్టారు. చివరకు సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధిపొందాలనే కుట్రతో ఖజానాను సైతం ఖాళీ చేశారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏటా సంక్షేమానికి రూ.60వేల కోట్లు చంద్రబాబు ఎక్కడ ఖర్చుపెట్టారో జీవీ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెచ్చిన అప్పు మొత్తాన్ని హారతి కర్పూరంలా చేసిన మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నిధులు సమకూర్చి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు అమలు చేస్తున్నారని మల్లాది విష్ణు గారు అన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో మిగతా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ పరిమితికి లోబడే అప్పులు చేసిందన్నారు. ఈ విషయం కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) ప్రాథమిక అకౌంట్ల పరిశీలనలో వెల్లడైందని గుర్తుచేశారు. ఇకనైనా తెలుగుదేశం నేతలు దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.
Prajavartha Online Telugu News