విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్దసంఖ్యలో నాయకులు, శ్రేణులు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 36 వ డివిజన్ లోని బావాజీ పేట డీ మార్ట్ వద్ద గోల్డెన్ ఆటో స్టాండ్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ కు చెందిన 70 కుటుంబాలు మరియు చిరు వ్యాపారుల కుటుంబాలు మల్లాది విష్ణు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి శాసనసభ్యులు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుల, మత, ప్రాంతాలకతీతంగా రాష్ట్రంలోని అన్ని వర్గాలు, ప్రాంతాల శ్రేయస్సు కోరుకునే ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ అని అన్నారు. కనుకనే జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తికరంగా ఉన్నారని తెలియజేశారు. మరోవైపు కరోనా మహమ్మారి విజృంభణతో ఉపాధి లేక ఆర్థికంగా చితికిపోయిన వీధి వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులకు చేయూతనందించేందుకు ‘జగనన్న తోడు’ పథకం ఎంతగానో దోహదపడిందని చెప్పుకొచ్చారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 3,300 మందికి పథకం వర్తించినట్లు వివరించారు. అదేవిధంగా నిత్యం వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా వాహన మిత్ర పథకానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. కనుకనే పార్టీలకతీతంగా పేద ప్రజలకు సంక్షేమాన్ని అందజేస్తున్న ఈ ప్రభుత్వం పట్ల ఆకర్షితులై అనేక మంది పార్టీలో చేరుతున్నారని చెప్పారు. రాబోయే మరో 30 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ కు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని మల్లాది విష్ణు అన్నారు. శాసనసభ్యులు మల్లాది విష్ణు సారధ్యంలో పనిచేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు వెల్లడించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. పార్టీకి మంచి పేరు తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం శాసనసభ్యులు పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు బాలి గోవింద్, కొండాయిగుంట మల్లీశ్వరి, శర్వాణీ మూర్తి, నాయకులు బంకా భాస్కర్, ఉద్ధంటి సురేష్, బొప్పన గాంధీ, కొల్లూరు రామకృష్ణ, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …