ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా అడుగులు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-అభివృద్ధిలో దూసుకెళుతోన్న జగనన్న ప్రభుత్వం
-వీఎంసీ కమిషనర్ తో కలిసి క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2019 కి ముందు విజ‌య‌వాడ న‌గ‌రానికి.. ప్రస్తుత న‌గ‌రానికి అభివృద్ధిలో ఎంతో వ్యత్యాసం ఉంద‌ని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మ‌ల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తో కలిసి 30, 36, 63 వ డివిజన్ లలో ఆయ‌న విస్తృతంగా ప‌ర్యటించారు. వైసీపీ కార్పొరేట‌ర్లు, వీఎంసీ అధికారులతో కలిసి ప‌లు కాల‌నీల‌లో అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. పారిశుద్ధ్యంపై ప్రధానంగా దృష్టి సారించాలని ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు. సైడ్ డ్రెయిన్లలో ఎప్పటిప్పుడు పూడిక తీయాలని.. కూలిన డ్రెయిన్లకు తక్షణమే మరమ్మతులను చేపట్టాలని ఆదేశించారు. రాజీవ్ నగర్ కరకట్ట వెంబడి ఉన్న ఔట్ ఫాల్ డ్రెయిన్ ను త్వరితగతిన పూర్తిచేసి స్థానికులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అనంతరం ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు, వార్డు సచివాలయాల ద్వారా అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అర్హులందరికీ పథకాలు అందుతున్నదీ లేనిదీ ఆరా తీశారు.

అనంత‌రం మ‌ల్లాది విష్ణు  మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాసమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా వీఎంసీ అధికారులు, వైసీపీ కార్పొరేట‌ర్లతో క‌ల‌సి క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందన్నారు. ఈ పర్యటనలో ఎంతో కాలంగా అప‌రిష్కృతంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను వీఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించారన్నారు. హ‌నుమాన్ పేట పార్క్ అభివృద్ధికి రూ. 20 ల‌క్షలను కేటాయించినట్లు న‌గ‌ర క‌మిష‌న‌ర్ వెల్లడించిన‌ట్లుగా మల్లాది విష్ణు  చెప్పారు. ఈ నిధుల‌తో పార్కులో వాకింగ్ ట్రాక్, విద్యుత్ దీపాలు, ప్రహరీ గోడ స‌హా సుంద‌రీక‌ర‌ణ‌కు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. మ‌రోవైపు తాగునీటి పైపు లైన్ ఏర్పాటు చేయడంలో భాగంగా రామ‌కృష్ణపురం – దేవీనగర్ ప్రధాన ర‌హ‌దారి ప‌నుల‌లో కొంత జాప్యం జ‌రిగిందని.. త్వర‌లోనే ప‌నులను పూర్తిచేస్తామన్నారు. దేవీనగర్ 8వ రోడ్డు (ట్రెండ్ సెట్) నుంచి జీవీఆర్ నగర్, వినాయక్ నగర్ వెళ్లేందుకు రైల్వే ట్రాక్ వెంబడి రహదారి నిర్మాణానికి నగర క‌మిష‌న‌ర్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. అదేవిధంగా దేవీన‌గ‌ర్ నుంచి ఉల‌వ‌చారు కంపెనీ వ‌ర‌కు ర‌హ‌దారి నిర్మాణానికి టెండ‌ర్లు ప్రక్రియ పూర్తి అయిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. రోడ్డు విస్తర‌ణ‌లో ఇళ్లు కోల్పోయే వారికి టీడీఆర్ బాండ్లను త్వరిత‌గ‌తిన అంద‌జేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

క్లీన్ ఆంధ్రప్రదేశ్ – స్వచ్ఛ విజయవాడలో భాగంగా 60 వ డివిజ‌న్ నుంచి 64 వ డివిజ‌న్ వ‌ర‌కు ఆయా కాలనీలలో మెరుగైన పారిశుద్ధ్యానికి చర్యలు చేపట్టనున్నట్లు మల్లాది విష్ణు  వెల్లడించారు. నగర సుందరీకరణలో భాగంగా సుంద‌రయ్యన‌గ‌ర్ మసీదు ఎదురు సందులోని వీఎంసీ స్థలాన్ని పార్కు కింద అభివృద్ధి ప‌రిచేందుకు 15 వ ఆర్థిక సంఘం నిధులు మంజూరైన‌ట్లు తెలిపారు. దీనికి సంబంధించి త్వర‌లోనే టెండ‌ర్లను ఆహ్వానిస్తామ‌న్నారు. రాజీవ్ నగర్ కరకట్ట వద్ద కార్పొరేషన్ స్థలంలో క‌మ్యూనిటీ హాల్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా వ‌డ్డెర కాల‌నీలో కళ్యాణ మండ‌పం నిర్మాణ ప‌నులు తుది ద‌శ‌కు చేరుకున్నాయని.. దీంతో పాటుగా మ‌ధురాన‌గ‌ర్ లో వంగ‌వీటి మోహ‌న రంగా  పేరిట నిర్మిస్తున్న క‌ర్మల భ‌వ‌న్ నిర్మాణ ప‌నులు కూడా చివ‌రి ద‌శ‌లో ఉన్నట్లు వెల్లడించారు. జిల్లా ఇంఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి  చేతుల మీదుగా వీటి ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. మరోవైపు ఎల్బీఎస్ న‌గ‌ర్ లో రూ. కోటి నిధులతో కాపు క‌ళ్యాణ మండ‌పం నిర్మాణానికి జీవో వ‌చ్చిన్నట్లు మ‌ల్లాది విష్ణు తెలిపారు.

పొత్తులు లేకుండా ఎన్నికలను వెళ్లే సత్తా టీడీపీకి లేదు…
పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేద‌ని మల్లాది విష్ణు విమ‌ర్శించారు. 2024 లో జ‌ర‌గ‌బోయే సార్వత్రిక ఎన్నిక‌లు అభివృద్ధికి, ఆక్రోశానికి మ‌ధ్య జ‌ర‌గ‌బోతున్నట్లు తెలిపారు. రాష్ట్ర చ‌రిత్రలో టీడీపీ ఒంటరిగా ఎన్నికలలో గెలిచిన దాఖలాలు లేవని.. ఇటీవ‌ల కాలంలో జ‌రిగిన‌ ఎన్నికలే ఇందుకు నిదర్శనమ‌న్నారు. రాష్ట్రంలోని విప‌క్షాల‌న్నీ ఏక‌మైనా.. ప్రజాక్షేత్రంలో వైఎస్సార్ సీపీని ఎదుర్కొని నిలబడలేవని మల్లాది విష్ణు  స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు మోదుగుల గణేష్, సీహెచ్ రవి, పసుపులేటి యేసు, లొడగాని నాగు, ఉద్ధంటి శీను, పి.కృష్ణ, టి.శివ, అశోక్, లక్ష్మణరావు, రాము, నాబాని, ఆర్కే, డి.దుర్గారావు, ఎస్.దుర్గారావు, కృష్ణ, రామకృష్ణ, వీఎంసీ అధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *