-62వ డివిజన్ లో రూ. 15 లక్షలతో ఆధునికీకరించిన రెండు పార్కుల పున:ప్రారంభం
-చిన్నారులతో కలసి ఊయల ఊగుతూ సందడి చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పార్కుల సుందరీకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 62 వ డివిజన్ లో రూ. 7 లక్షలతో ఆధునికీకరించిన ప్రకాష్ నగర్ పార్క్, AVS రెడ్డి రోడ్డులో రూ. 8 లక్షలతో అభివృద్ధి పరచిన వీర్ల బాలరాజు పార్కులను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మిలతో కలిసి ఆయన పున: ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్కులో చిన్నారులకు ఆటవిడుపు కోసం ఏర్పాటు చేసిన జారుడుబల్ల, ఉయ్యాలతో పాటు వాకింట్ ట్రాక్ లను పరిశీలించారు. అనంతరం చిన్నారులతో కలసి ఊయల ఊగుతూ సరదాగా గడిపారు. నగర ప్రజలకు ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచే విధంగా నియోజకవర్గంలోని పార్కులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా రూ. 15 లక్షలతో డివిజన్ లోని రెండు పార్కులను ఆహ్లాదకర వాతావరణంలో తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. చిన్నారులను ఉల్లాస పరిచేందుకు అవసరమైన ఆట వస్తువులతో పాటు విశాలమైన వాకింగ్ ట్రాక్ లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో స్థానికులు సరదాగా గడపడానికి దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఈ పార్కులు దోహదపడతాయన్నారు. గత తెలుగుదేశం హయాంలో నిర్లక్ష్యానికి గురై అభివృద్ధికి నోచుకోని పార్కులన్నీ కూడా నేడు పచ్చదనం పరుచుకుంటున్నాయని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. ఈ పార్కుల సంరక్షణ బాధ్యతలను అధికారులతో పాటు స్థానికులు సైతం స్వీకరించాలని సూచించారు. మరోవైపు 63వ డివిజన్ లోని వడ్డెర కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని.. త్వరలోనే జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉడా కాలనీలో నిర్మిస్తోన్న విద్యుత్ సబ్ స్టేషన్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని.. త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అదేవిధంగా రూ. 2.50 కోట్ల నిధులతో చేపట్టిన విజయవాడ – నూజివీడు ప్రధాన రహదారి (పైపుల రోడ్డు సెంటర్ నుంచి నున్న బైపాస్ జంక్షన్ వరకు) పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడించారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మల్లాది విష్ణు నాయకత్వంలో సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు. నగర పాలక సంస్థ కల్పిస్తున్న సదుపాయాలను ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు మోదుగుల తిరుపతమ్మ, యర్రగొర్ల తిరుపతమ్మ, కొంగితల లక్ష్మీపతి, జానారెడ్డి, కొండాయిగుంట మల్లీశ్వరి, నాయకులు వీరబాబు, రామిరెడ్డి, మస్తాన్, హైమావతి, వీఎంసీ అధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.