-స్వాతంత్ర్యసమర యోధులకు సన్మానం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు ఘన నివాళి, యువత చేనేత అంశంపై గోడపత్రిక ఆవిష్కరణ
-రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలతో ఆప్కో షోరూమ్ లలో జాతీయతా స్పూర్తి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర్య ఉద్యమంలో చేనేత వస్త్రాలకు ఉన్న ప్రాధన్యత వెలకట్టలేనిదని, అనాడు ప్రతి ఒక్క నాయకుడు చేనేత వస్త్రాలనే ధరించి తమ జాతీయ భావాలను వెలిబుచ్చారని రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ సంచాలకులు బ్రిగేడియర్ వి. వెంకట రెడ్డి అన్నారు. నేటి తరం నాయకులు సైతం చేనేత వస్త్రాలను ధరించి యువతకు ప్రేరణగా నిలవాలని ఆకాంక్షించారు. అజాదీకా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేపధ్యంలో గణతంత్రదినోత్సవ కార్యక్రమాలను పురస్కరించుకుని విజయవాడ ఆప్కో మెగా షోరూమ్ లో విభిన్నఅంశాల మేళవింపుగా వేడుకలు నిర్వహించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర్య సమర యోధులను ఘనంగా సన్మానించారు. సాయిధ దళాల సిబ్బందికి ప్రత్యేక రాయితీ పధకాన్ని ప్రవేశ పెట్టారు. యువత చేనేతను ప్రోత్సహించేలా రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రిగేడియర్ వెంకట రెడ్డి మాట్లాడుతూ జాతీయతకు చేనేత ఒక చిహ్నం వంటిదన్నారు. చేనేత వస్త్రాలను ఆదరించటం ద్వారా వ్యవసాయం తరువాత అత్యధికంగా అధార పడిన రంగానికి చేయూత అందించగలుగుతామన్నారు. యువత జాతీయతను పెంపొందించుకోవాలని, చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని సూచించారు.
ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు మాట్లాడుతూ నేత కార్మికుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో చేస్తుందని, గణతంత్ర దినోత్సవ వేడుకలకు, నేత వస్త్రాలకు ఉన్న అవినాభావ సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. గణతంత్ర వేడుకల నేపధ్యంలో యువతను ఆకర్షించేలా చేనేత వస్త్రాలపై రూపొందించిన గోడ పత్రికను చిల్లపల్లి ఆవిష్కరించారు. చేనేత జౌళి శాఖ సంచాలకురాలు, ఆప్కో ఎండి చదలవాడ నాగరాణి మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం పోరుబాట పట్టిన యోధులను ఆప్కో తరుపున సన్మానించుకోగలగటం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. నాటి ఉద్యమ స్పూర్తితో నేటి యువత కూడా చేనేతను ప్రోత్సహించాలని , వారి అభిరుచులకు అవసరమైన వెరైటీలు ఆప్కో వద్ద సిద్దంగా ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో భాగంగా సాయిధ దళాలు, పదవీ విరమణ చేసిన సాయిధ దళాల కుటుంబాలకు నిర్ధేశించిన ప్రత్యేక రాయితీ పధకాన్ని రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ సంచాలకులు బ్రిగేడియర్ వి. వెంకట రెడ్డి ఆవిష్కరించారు. ఆప్కో ప్రస్తుతం తన వస్త్ర శ్రేణిపై 30 శాతం రాయితీని అందిస్తుండగా, ఈ నెలాఖరు వరకు వీరికి అదనంగా పది శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
భారత దేశాన్ని దాశ్య శృంఖలాల నుండి విముక్తి చేసేందుకు పోరాటం చేసి జైలు జీవితాన్ని అనుభవించిన స్వాతంత్ర్య సమర యోధులు రాంపిళ్ల నరసాయమ్మ, లగడపాటి చెంచయ్య , ఏలూరు రాములు, బండారు విమలమ్మలను ఆప్కో తరుపున ఘనంగా సన్మానించారు. కూచిపూడి నాట్యంలో జాతీయ అవార్డు గ్రహీత దీపల కావేరి ప్రదర్శించిన నృత్యం ఆహుతులను విశేషంగా అకర్షించింది. ఇండియన్ ఆర్మీ నియామక సంచాలకులు (గుంటూరు) షేహజాద కోహ్లి ప్రత్యేక అతిధిగా హాజరుకాగా, అనుపమ కోహ్లి, చేనేత, జౌళి శాఖ సంయిక్త సంచాలకులు కన్నబాబు, నాగేశ్వరరావు, సహాయ సంచాలకులు మురళీ కృష్ణ, ఆప్కో సీనియర్ మార్కెటింగ్ అధికారులు రమేష్ బాబు, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమాలను కేవలం విజయవాడ కేంద్ర కార్యాలయానికే పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆప్కో మెగా షోరూమ్ లు అన్నింటిలోనూ నిర్వహించి స్వాతంత్ర్య సమర యోధులను సన్మానించి , జిల్లా స్దాయి సైనిక సంక్షేమ అధికారులు, ఉన్నత స్దాయి పోలీసు అధికారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.