తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ముఖ్య పర్వదినాల్లో నిర్వహించే కల్యాణోత్సవాన్ని వర్చువల్ సేవగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది.
భక్తులు ఆన్‌లైన్ ద్వారా కల్యాణోత్సవం సేవా టికెట్లు పొందాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 5న వసంత పంచమి సందర్భంగా వర్చువల్ కల్యాణోత్సవం సేవ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 12న ఏకాదశి, ఏప్రిల్ 2న ఉగాది, ఏప్రిల్ 16న చైత్ర పౌర్ణిమ, మే 21న శ్రవణా నక్షత్రం సందర్భంగా ఈ సేవ నిర్వహిస్తారు. అలాగే, జూన్ 11న ద్వాదశి, జూన్ 18న శ్రవణా నక్షత్రం, జూన్ 25న ద్వాదశి, ఆగస్టు 20న రోహిణీ నక్షత్రం, సెప్టెంబరు 10న పౌర్ణమి, అక్టోబరు 22న, నవంబరు 5న ద్వాదశి సందర్భంగా వర్చువల్ కల్యాణోత్సవం సేవ నిర్వహిస్తారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కల్యాణోత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ సేవా టికెట్ ధర రూ.500/-. భక్తులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని తమ ఇళ్ల నుండి వర్చువల్ పద్ధతిలో పాల్గొనాల్సి ఉంటుంది. సేవలో పాల్గొన్న మూడు నెలలలోపు స్వామివారి దర్శనానికి ఇద్దరిని ఉచితంగా అనుమతిస్తారు. దీంతో పాటు ఉత్తరీయం, రవిక, అక్షింతలు బహుమానంగా అందిస్తారు.