మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కేసుల దర్యాప్తు..ఫిర్యాదుల నిర్వహణ అనేది బాధితులకు భరోసా కల్పించేలా, నేరస్తులకు శిక్షలు పడేలా ఉండాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. మంగళవారం ఆయన స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో పోలీసు అధికారులతో మచిలీపట్నం నియోజకవర్గ స్థాయిలో పలు విషయాలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ప్రస్తుత ఆధునిక యుగంలో మారుతున్న టెక్నాలజీ ని మనకు అందుబాటులొ ఉన్న అంశాలు విరివిగా వాడుకుంటూ మోడరన్ పోలీసింగ్ చేయాలని, ప్రతి ఒక్కరు వారి విధుల్లో ఉపయోగించే అన్ని సాంకేతిక వ్యవస్థలపై పూర్తి పరిజ్ఞానం కలిగియుండలిని అన్నారు. నూతన సాంకేతిక విజ్ఞానంను ఉపయోగిస్తూ నేరస్తులపై నిఘా పెంచడం,నేరాలను అదుపు, నేరపరిశోధనలో సాంకేతిక విజ్ఞానంను ఉపయోగిస్తూ త్వరిత గతిన నేరాలకు సంబంధించిన వాస్తవాలను కనిపెట్టడం,తరచూ నేరాలకు పాల్పడే నేరస్తులపై, నిఘా ఉంచాలని మంత్రి పేర్ని నాని పోలీసులకు పలు సలహాలు సూచనలు చేశారు. తీవ్ర నేరాలు జరగకుండా అప్రమత్తంగా పని చేయాలని, నిఘా కెమెరాలను ఆధునికరించాలని అన్నారు. పాత నేరస్తులు, దొంగలు, అలవాటు పడ్డ నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. మచిలీపట్నం ప్రధాన రహదారులపై పశు సంచారం విషయమై కనీసం వారం రోజులపాటు మైకులలో ప్రచారం చేసి అనంతరం రోడ్లపై విడిచిపెట్టిన ఆవులు గేదెల విషయమై ఆయా పశు యజమానులకు ఆ సమాచారం తెలియచేసి అనంతరం ఆ సమస్యను పరిష్కరించాలని మంత్రి సూచించారు. పోలీసింగ్ నిర్వహణ అనేది ప్రజలకు భరోసా కల్పించేలా ఉండాలని , ఫిర్యాదులు, కేసులు పెండింగ్ పెట్టవద్దన్నారు. కేసుల్లో నిందుతుల అరెస్ట్ వెంటనే చేయాలని తెలిపారు. టౌన్ పరిధిలో కొన్ని కళాశాలల వద్ద ఈవ్ టీజర్లు ఆడపిల్లలను అల్లరిచేస్తూ వేధిస్తున్నారని తల్లితండ్రుల నుంచి ఆరోపణలు ఇటీవల వస్తున్నాయని అటువంటివారిని కఠినంగా అదుపుచేయాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు మఫ్టీలో ఉండి జులాయులకు బుద్ధి చెప్పాలన్నారు . అలాగే కుటుంబ విషయాలకు సంబంధించిన కేసులలో సామరస్యంగా పరిష్కరించి తగాదాలు సమసిపోయేలా ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని, వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లను ఎక్కడ ఏర్పాటు చేయాలో గుర్తించాలని అలాగే వేగంగా వాహనం నడపరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. హోసింగ్ బోర్డు కాలనీ నుంచి లక్షి టాకీస్ రోడ్డు వరకు రద్దీ పెరిగిందని ఆ ప్రాంతంలో ఒక హోమ్ గార్డును విధులలో నియమించి వేగంగా వాహనాలను నడిపేవారని గుర్తించి పెనాల్టీలను విధించాలన్నారు. అలాగే ప్రధాన రహదారులపై ట్రాఫిక్ కు అవరోధంగా కొందరు వీధి విక్రేతలు మున్ముందుకు వచ్చేస్తున్నారని వారిని ప్రధాన కూడళ్లలో వేగంగా ద్విచక్ర వాహనాలను నడిపేవారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో టౌన్ డీఎస్పీ మహబూబ్ బాషా, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ధర్మేంద్ర , దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ రాజీవ్ కుమార్ , ట్రాఫిక్ డి ఎస్పీ భరత్ మాతాజీ, రాబర్ట్ సొన్ పేట సి.ఐ భీమరాజు , చిలకలపూడి సి.ఐ అంకబాబు , ఇనకుదురుపేట సి.ఐ రమేష్ బాబు, మచిలీపట్నం రురల్ సి.ఐ వీరయ్య గౌడ్ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కిషోర్ పలు పోలీస్ స్టేషన్ల ఎస్ ఐ లు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News