– పేర్ని కిట్టు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బాల బాలికల ఉన్నత భవిష్యత్తుకు విద్యతోపాటు క్రీడలు కూడా ముఖ్యమేనన్న విషయాన్ని గుర్తించి తమలోని క్రీడా నైపుణ్యాన్ని హైస్కూల్ స్థాయిలోనే పెంపొందించుకోవాలని వైస్సార్సిపి పార్టీ యువ నేత పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) పేర్కొన్నారు. మంగళవారం ఆయన స్థానిక బందరుకోట, గిలకలదిండి మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూళ్లలో క్రీడా పరికరాలు, క్రికెట్ కిట్లను అందచేశారు. అనంతరం మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ, విద్యార్థినీ విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణించి శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పొందాలని ఆశిస్తూ వారిని ప్రోత్సహించేందుకు పలు ఆట వస్తువులు, క్రికెట్ కిట్టును అందచేస్తున్నట్లు ఆమె తెలిపారు. తర్వాత ప్రసంగించిన మచిలీపట్నం మాజీ మునిసిపల్ ఛైర్మెన్ షేక్ సలార్ దాదా మాట్లాడుతూ, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో మన మచిలీపట్నం క్రీడాకారులు పాల్గొని పతకాలను సాధించేందుకు కృషి చేసి నగర కీర్తిని పెంపొందించాలని పిలుపునిచ్చారు. క్రీడాకారులకు, క్రీడాభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్సార్ సీపీ అధికార ప్రతినిధి మాదివాడ రాము, కార్పొరేటర్లు శేషయ్య, తిరుమలశెట్టి ప్రసాద్, బందర్ కోట గిలకలదిండి హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులు తోట రఘుకాంత్ ( చిన్నా), జి పి ఆర్ ప్రభ, ప్రైమరీ స్కూల్స్ సూపెర్వైజర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.