-పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 7 వ తేదీ నుండి ఆంద్రప్రదేశ్ శాసన మండలి మరియు శాసన సభా సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో గతంలో సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలను సమావేశాలు పూర్తి అయ్యే లోపు అందజేయాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు మరియు ఆంధ్రప్రదేశ్ శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ కోరారు. సమావేశాలు ప్రశాంతా వాతావరణంలో జరిగే విధంగా పటిష్టమైన బందో బస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అదికారులకు వారు సూచించారు. శనివారం ఆంధ్రప్రదేశ్ శాసన సభ కమిటీ హాల్ లో పలు శాఖల కార్యదర్శులు మరియు పోలీస్ అధికారులతో వేరు వేరుగా జరిగిన సమావేశాల్లో వారిరువురూ పాల్గొని సభ్యు ప్రశ్నలకు సరైన సమాదానాలను అందజేయడం మరియు పోలీస్ బందో బస్తు ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు మాట్లాడుతూ శాసన మండలి సభ్యులు అడిగే ప్రశ్నలకు సకాలంలో సరైన సమాధానాలను అందజేస్తూ వారి గౌరవాన్ని కాపాడాల్సి భాద్యత అధికారులపై ఉందన్నారు. అటు వంటి సత్సాంప్రదాయం కొనసాగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలని ఆయన కోరారు. గత సమావేశాల్లో గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలలో పలు ప్రశ్నలకు సమాదానాలు అందజేయాల్సి ఉందన్నారు. వీటిలో పాఠశాల విద్య, ఆర్థిక శాఖకు సంబందించిన ప్రశ్నలు ఎక్కుగా పెండింగ్ లోనున్నాయన్నారు. విద్యా వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దేందుకు పలు వినూత్న సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని, వాటిని సుస్పష్టంగా వివరిస్తూ సరైన సమాదానాలను గౌర సభ్యులకు అందజేయాలని పాఠశాల విద్యా శాఖ కార్యదర్శికి ఆయన సూచించారు. మాజీ ఎం.ఎల్.సి.ల మెడికల్ బిల్లుల చెల్లింపుపై ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడే మాజీ ఎం.ఎల్.సి.లకు అందజేసే ఔషధాలను వారు నివశించే ప్రాంతాల్లోనే అందజేసే అంశాన్ని పరిశీలించాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు ఆయన సూచించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు అందజేసేందుకు ప్రతి శాఖ ఒక లైజనింగ్ అధికారిని నియమించాలని ఆయన సూచించారు.
అనంతరం పోలీస్ అధికారులతో శాంతి, భద్రతల అంశాన్ని సమీక్షిస్తూ ప్రశాంత వాతావరణంలో సమావేశాలు కొనసాగేలా పటిష్టమైన బందో బస్తు ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర డి.జి.పి. కె.రాజేంద్రనాద్ రెడ్డిని ఆయన కోరారు. సభ్యులు బస చేసే ప్రాంతాలు మొదలు సమావేశాలకు వారు హాజరు అయ్యేంత వరకూ పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, వారి రాకపోకలకు ఎటు వంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ ప్రజల యావత్ దృష్టి ఈ నెల 7 నుండి జరుగబోవు శాసన సభా సమావేశాలపై ఉంటుందని, వాటికి ఎంతో ప్రత్యేక ఉందనే విషయాన్ని అధికారులు అందరూ గుర్తించాలన్నారు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ సమావేశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారన్నారు. ఈ నేపథ్యంలో సభ్యులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం అందజేయాల్సిన భాద్యత అధికారులపై ఉందన్నారు. సభ్యుల గౌరవాన్ని కాపాడటంలోనే మన గౌరవం ముడిపడిఉందనే అంశాన్ని అధికారులు అందరూ గుర్తించాలన్నారు. గత సమావేశాల్లో గౌరవ శాసన సభ్యులు అడిగిన ప్రశ్నల్లో పలు ప్రశ్నలకు సమాధానాలను అందజేయాల్సి ఉందని, వాటన్నింటినీ సోమవారం నుండి జరుగబోవు సమావేశాలు ముగిసే లోపు తప్పక అందజేయాలని అన్నిశాఖల కార్యదర్శలను ఆయన కోరారు. వీటిలో పురపాలక,ఆర్థిక, వ్యవసాయ, సివిల్ సప్లైస్, హోమ్ తదితర శాఖలకు చెందిన ప్రశ్నలు ఎక్కువగా పెండింగ్ లో ఉన్నాయని, వాటికి సమాధానాలను సత్వరమే అందజేసే అంశంపై ఆయా శాఖల కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు.
అనంతరం పోలీస్ అధికారులతో శాంతి, భద్రతల అంశంపై ఆయన చర్చిస్తూ ఈ సమావేశాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. అటు వంటి పరిస్థితుల్లో ఎంతో పటిష్టమైన పోలిస్ బందో బస్తు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర డి.జి.పి. కె.రాజేంద్రనాద్ రెడ్డిని ఆయన కోరారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడ గ్యాప్లు అయితే ఉన్నాయే వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. సచివాలయం చుట్టూ ఖాళీ ప్రాంతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నాలుగు వైపులా పటిష్టమైన పోలీస్ బందో బస్తుతో పాటు అధునాతన సమాచార, సాంకేతిక వ్యవస్థతో పటిష్టమై నిఘా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎటు వంటి ఏమరపాటులేకుండా ఎంతో అప్రమత్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది బందో బస్తు విధులను నిర్వహించాలన ఆయన సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర డి.జి.పి. కె.రాజేంద్రనాద్ రెడ్డి, శాసన సభ సెక్రటరీ పి.బాలకృష్ణమాచార్యలు, శాసన మండలి ఓ.ఎస్.డి. కె.సత్యనారాయణరావు తదితరులతో పాటు పలు శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీలు, ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.