-స్సామ్నా రాష్ట్ర ప్రధమమహాసభలో ఐజేయూ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శాంతి కపోతాలుగా ఉన్న చిన్న పత్రికలను చంపొద్దని ఐజేయూ అధ్యక్షులు కె. శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికి హితవుపలికారు. స్సామ్నా రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు అధ్యక్షతన విజయవాడలో ఆదివారం జరిగిన రాష్ట్ర మహాసభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో ఎన్నో రకాల పక్షులు ఉంటాయని వాటిలో శాంతి కపోతాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందన్నారు. అలాగే స్థానిక పత్రికలు అనేవి శాంతి కపోతాలు వంటివే అని చెప్పారు. కేవలం నిబంధనల పేరుతో వారిని అష్ట కష్టాలపాల్చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో రాజులు పావురాల ద్వారానే వర్తమాన సమాచారాన్ని పంపేవారన్నారు. సమాజంలో జరిగే సమాచారాన్ని కూడా పావురాల మాదిరిగానే జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సమాచారాన్ని అందజేస్తున్నాయన్నారు. అలాంటి పత్రికలను కేవలం ఆంక్షల కత్తితో చంపొద్దని సూచించారు. అక్రిడిటేషన్లు అనేవి జర్నలిస్టులకు ఉన్న హక్కుఅని ప్రభుత్వం ఆ హక్కును కాలరాసే విధంగా ప్రవర్తించడం సహేతుకం కాదన్నారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసు (ఐఐఎస్) అధికారి అయిన సమాచార మరియు పౌర సంబంధాలశాఖ అధికారి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ రాకుండా జీఎస్టీ పేరుతో, సర్కులేషన్ నిబంధనలతో అడ్డుకోవడం ఆయన అహంకారానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రభుత్వాన్ని , ఈ తరహా సమాచార అధికారిని నేనెప్పుడూ చూడలేదన్నారు. ప్రభుత్వ సలహాదారులు ఎంతోమంది ఉన్నప్పటికీ ఇలాంటి సున్నితమైన విషయాలను సీఎం దృష్టికి ఎందుకు తీసుకువెళ్లడంలేదో అర్ధం కావడం లేదన్నారు. అసలు సమాచార శాఖ అధికారులు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారో లేక ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్చేసే విధంగా కృషి చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. మిగతా రాష్ట్రాలలో కరోనా బారిన పడి చనిపోయిన జర్నలిస్టులకు ఐదు నుంచి ఇరవై లక్షల రూపాయల వరకూ ఆర్థిక సాయం చేసి వారి కుటుంబాలను ఆదుకుంటే దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం జీవో ప్రకటించి కూడా దాన్ని అమలు చేయకపోవడం శోచనీయమని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. డీఏవీపీ, ఆర్ ఎన్ ఐ రూల్స్ ప్రకారం ప్రతి 500 కాపీలు ముద్రించిన పత్రికకు అక్రిడిటేషన్లు, ఎన్ ప్యానల్ ఇచ్చి తద్వారా ప్రకటనలు ఇవ్వాలనే నిబంధనలు ఉన్నాయని తెలిపారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాలను కూడా ఈ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదని ఆయన ఆక్రోశం వెలిబుచ్చారు. పత్రికలలో చిన్న, పెద్ద పత్రికలు అనే తేడాలు లేవని కేవలం బడా బాబుల వ్యాపారంగా మార్చడం ద్వారా ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. పెద్ద పత్రికలలో వచ్చే వార్తల కంటే స్థానిక వార్తలకే సమాజంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని అందువల్లే పెద్ద పత్రికలు కూడా స్థానికతను అధారంగా చేసుకుని టాబ్లాయిడ్ పేజీలను తీసుకొచ్చారని ఆయన గుర్తు చేశారు. అందువల్ల స్థానికత ఆధారంగా వీలైతే స్సామ్నా అనే పేరును స్థానికత వచ్చేవిధంగా మార్చితే బాగుంటుందని ఆయన మహాసభలో సూచించారు.అమెరికా వంటి దేశాలలో ఇలాంటి పత్రికలను కౌంటీలని పిలుస్తారన్నారు. చిన్న పత్రికలు చెప్పే సత్యం చిన సత్యం గానూ, పెద్ద పత్రికలు రాసే సత్యాలు పెద్ద సత్యంగానూ పిలవరన్నారు. ఎవరు రాసినా సత్యం ఒకే విధంగా ఉంటుందని దానిలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. ఎందులో రాసిన వార్త ప్రమాణికతే ముఖ్యమన్నారు. సత్యం అనేది ఎవరు రాస్తున్నారు, ఎందుకు రాస్తున్నారనే విషయాన్ని ప్రజలు గమనిస్తారని తెలిపారు. సత్యాన్ని గౌరవిస్తూ సత్యం రాసేందుకే ప్రతి ఒక్క పత్రిక ప్రయత్నించాలన్నారు. పెద సత్యాలు సత్యాలు కావని చిన సత్యాలు అసత్యాలు కావని దేనికైనా ప్రమాణికమే ముఖ్యమని ఆయన తెలిపారు. ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా స్సామ్నా రాష్ట్ర మహాసభకు 200 మంది ప్రతినిధులు రావడం ఎంతో అభినందనీయమన్నారు. మున్ముందు స్సామ్నా మరింత బలోపేతం చేసేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం చిన్న పత్రికలపై చిన్నచూపు తగదని, వాటిని ఆదుకునేందుకు అక్రిడిటేషన్లు, ప్రకటనలు ఎలాంటి షరతులు, నిబంధనలు విధించకుండా సహకరించాలని ఆయన కోరారు. స్సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి కార్యదర్శిని వేదికను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక పత్రికల మనుగడ కోసం స్సామ్నా ఏర్పాటుకు ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు ఎంతో కృషిచేశారని అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మహాసభలో ఐజేయూ కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్, డి. సోమసుందర్ , ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు, ఫోటో జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సాంబశివరావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్, శ్రీరామమూర్తి, రామసుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు పసుపులేటి రాము, విజయవాడ అర్బన్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, స్సామ్నా నగర అధ్యక్షులు ఎంవీ సుబ్బారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
అధ్యక్షులు నల్లిధర్మారావు (శ్రీకాకుళం)
కార్యనిర్వాహక అధ్యక్షులు సి వెంకటరెడ్డి (కడప)
ఉపాధ్యక్షులు
1పి బాలకోటయ్య (ప్రకాశం)
2 జె. రమేష్ రాజా (తూ.గో. జిల్లా)
3 పి విజయకుమార్ (నెల్లూరు)
ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి (కృష్ణా అర్బన్)
కార్యదర్శులు
బీవీవీ రామారావు (ప.గో.జిల్లా)
కె చక్రవర్తి (విశాఖ)
ఎం సునీల్ కుమార్ ( కర్నూలు)
వి అశోక్ కుమార్ (విజయనగరం)
కోశాధికారి
వి నర్సరాజు (గుంటూరు)
మరుయు 13 మంది కార్యవర్గ సభ్యులతో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
తీర్మానాలు
1. ఐఅండ్ పీఆర్ కమిషనర్ ను వెంటనే బదిలీచేయాలి
2. చిన్నపత్రికలను జీఎస్డీ నుంచి మినహాయించాలి
3. డీఏవీపీ నిబంధనల ప్రకారం చిన్న పత్రికల వారికి అక్రిడిటేషన్లు మంజూరు చేయాలి.
4. జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్ విద్యా సంస్థలలో ఇస్తున్న 50 శాతం రాయితీ మెమోగా కాకుండా జీవో రూపంలో ఇవ్వాలి.
5. ప్రభుత్వ ప్రకటనలను చిన్నపత్రికలకు ఇచ్చి ఆదుకోవాలి