-మాది అక్కచెల్లెమ్మలకు మంచి చేసే ప్రభుత్వం
-జనహిత సదనములో పండుగలా అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళా సాధికారత అనేది నినాదం కాదని.. తమ ప్రభుత్వ విధానమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే మల్లాది విష్ణు అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ అక్కచెల్లెమ్మలకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలను గౌరవించటం మన సంప్రదాయమని.. కుటుంబంలో ప్రేమ బాంధవ్యాలు పెంపొందించటంలో, మెరుగైన సమాజం సృష్టించటంలో మహిళల సేవ ఎనలేనిదని ఈ సందర్బంగా ఆయన కొనియాడారు. స్త్రీలు మగవారి కంటే అన్ని విషయాలలో ఒక అడుగు ముందే ఉంటారని.. వారంతా పూర్తి సామర్ధ్యాలు వినియోగించుకుంటే దేశం ఎంతో పురోభివృద్ధి సాధిస్తుందన్నారు. అనంతరం మహిళా సాధికారికత, రాజకీయాలలో మహిళల పాత్ర గురించి చక్కగా వివరించారు.
రాష్ట్ర ప్రగతికి మహిళలే మూల స్తంభాలని మల్లాది విష్ణు కొనియాడారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలా కాకుండా అన్ని రంగాల్లోనూ మహిళా సాధికారతను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపిన దార్శనికత వల్లే చట్ట సభల్లో మహిళల ప్రాధాన్యత పెరిగిందన్నారు. గతంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహిళను హోంమంత్రిని చేస్తే.. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళిత మహిళకు ఆ శాఖను అప్పగించడం మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనమన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చి నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు వెల్లడించారు. నగరపాలకలు, మునిసిపాలిటీలు, పంచాయతీల చైర్మన్లు, మేయర్ పదవులు, వ్యవసాయ మార్కెట్ కమిటీలలో సగభాగానికి పైగా అతివలకే ఇచ్చినట్లు తెలిపారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తున్న 2.65 లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లలో 1.33 లక్షల మంది మహిళలే ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇటువంటి విప్లవాత్మక చర్యలతో మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధిస్తున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. కనుకనే వరుస ఎన్నికల్లో మహిళలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించి సీఎం జగన్మోహన్ రెడ్డికి అడుగడుగునా అండగా నిలుస్తున్నారన్నారు. రాబోవు రోజులలో రెండు, మూడు డివిజన్ లు ఒక యూనిట్ గా మహిళా సదస్సులు నిర్వహించి.. వారి ఆర్థిక అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు.
మహిళల తలరాతను మార్చే పథకాలు అమలు చేస్తోన్న జగనన్న
అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన, సాధికారతే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేసిందని మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకంలోనూ మహిళలనే ప్రధాన లబ్దిదారులుగా ఎంపిక చేస్తున్నట్లు వివరించారు. అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, అక్కచెల్లెమ్మల పేరిట ఇళ్ల పట్టాలు వంటి సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల ద్వారా వారి కాళ్ల మీద వారిని నిలబెడుతున్నారన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల ద్వారా గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు పిల్లలందరికీ పౌష్టికాహారాన్ని అందించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వీటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన సంక్షేమ బుక్ లెట్ల సాయంతో ప్రజలకు వివరించాలని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు సూచించారు. ఇవేకాకుండా మహిళల భద్రత కోసం దిశ యాప్.. గ్రామ/ వార్డు సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లను నియమించామన్నారు. గత తెలుగుదేశం హయాంలో డ్వాక్రా రుణాలను మాఫీ చేయకపోవడంతో పొదుపు సంఘాల వ్యవస్థ కుప్పకూలిపోయిందని మల్లాది విష్ణు గుర్తుచేశారు. ఫలితంగా ఏ, బీ గ్రేడ్ ల్లోని సంఘాలు సీ, డీ గ్రేడ్‌లోకి పడిపోయాయని వ్యాఖ్యానించారు. కానీ ఈ ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు నిధుల విడుదలతో పొదుపు సంఘాలన్నీ మళ్లీ జీవం పోసుకున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహంతో మహిళలు పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెంది దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. అనంతరం పలువురు వక్తలు మహిళా సాధికారత, మహిళల గొప్పతనం గురించి కొనియాడారు.
డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగనన్న పాలనలో ప్రతిరోజు అక్కచెల్లెమ్మలకు మహిళ దినోత్సవమేనని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వెల్లువలా అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో మహిళలు దేశంలో ఎక్కడాలేని విధంగా తమ కాళ్ల మీద తామే ధైర్యంగా నిలబడగలుగుతున్నారని పేర్కొన్నారు. గత తెలుగుదేశం పాలకులు నమ్మించి మోసం చేస్తే.. నేటి పాలకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో మహిళా సాధికారత సాకారమవుతోందని తెలిపారు.
వైసీపీ కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానా మాట్లాడుతూ.. సీఎం జగనన్న అందిస్తోన్న తోడ్పాటుతో అనేక రంగాలలో మహిళలు ఎంతో అభివృద్ధి చెందుతున్నారని పేర్కొన్నారు. అయినా ఇంకా చేయవలసింది ఎంతో మిగిలి ఉందని వ్యాఖ్యానించారు.
వైసీపీ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి మాట్లాడుతూ.. జగనన్న లాంటి మహిళా పక్షపాతి దేశంలోనే ఎవరూ ఉండరని తెలిపారు. మహిళలను అన్ని రంగాలలోనూ ప్రోత్సహిస్తున్న జగనన్నకు మహిళలు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలిపారు.
కార్యక్రమంలో వైసీపీ నగర మహిళ అధ్యక్షురాలు పిల్లి కృష్ణవేణి, కార్పొరేటర్లు అలంపూర్ విజయలక్ష్మి, కుక్కల అనిత, ఇసరపు దేవి, ఎండీ షాహినా సుల్తానా, యర్రగొర్ల తిరుపతమ్మ, మోదుగుల తిరుపతమ్మ, ఉమ్మడి రమాదేవి, కొండాయిగుంట మల్లేశ్వరి, ఉద్ధంటి సునీత, బంకా శకుంతలాదేవి, బాలి గోవింద్, కొంగితల లక్ష్మీపతి, జానారెడ్డి, శర్వాణి మూర్తి, డివిజన్ ఇంఛార్జిలు గుండె సుందర్ పాల్, అంగిరేకుల నాగేశ్వరరావు గొల్లభామ, వివిధ కార్పొరేషన్ల డైరక్టర్లు, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.