-జగనన్న పాలనలో విద్యాదీవెన ఓ మైలురాయి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యా దీవెన పథకం ఓ మైలురాయి అని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా (అక్టోబర్-డిసెంబర్, 2021 త్రైమాసికానికి) సెంట్రల్ నియోజకవర్గంలోని 5,285 మంది విద్యార్థులకు సంబంధించి 4,748 తల్లుల ఖాతాలలో రూ. 4 కోట్ల 11 లక్షల 94 వేల 837 రూపాయలను బుధవారం జమ చేసినట్లు వెల్లడించారు. సుధీర్ఘ పాదయాత్రలో విద్యార్థుల తల్లిదండ్రుల కష్టాలను స్వయంగా తెలుసుకున్న జగనన్న.. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకై విద్యా దీవెన పథకాన్ని ప్రవేశపెట్టారని తెలియజేశారు. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సదుద్దేశంతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టగా.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్ని కొనసాగిస్తున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. చదువుకు పేదరికం అడ్డంకి కాకూడదని, డ్రాప్ అవుట్ లను తగ్గించాలనే ఉద్దేశంతో.. విద్యార్థుల చదువులను ముఖ్యమంత్రివర్యులు బాధ్యతగా తీసుకున్నారని పేర్కొన్నారు. ఏ ఏడాది ఫీజు రియింబర్స్ మెంట్‌ను అదే ఏడాదిలో చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అరకొర ఫీజులు చెల్లించి విద్యార్థుల జీవితాలతో ఆడుకుందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాగానే.. చంద్రబాబు ప్రభుత్వం చెల్లించని రూ. 1,778 కోట్ల బకాయిలను సైతం క్లియర్ చేయడం జరిగిందన్నారు. విద్యార్థుల భవిష్యత్ పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని కొనియాడారు. విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని నమ్మి ముందుకు సాగుతున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని మల్లాది విష్ణు మరోసారి స్పష్టం చేశారు.