-మల్లాది వేంకటసుబ్బారావు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వాటర్ ట్యాంకర్ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవి దృష్ట్యా ప్రజల అవసరాల నిమిత్తం మల్లాది వేంకటసుబ్బారావు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి ట్యాంకర్ ను ప్రారంభించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు తెలిపారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనము వద్ద 20వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంకర్ ను నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డిరెడ్డి, వైసీపీ కార్పొరేటర్లతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. దివంగత మహానేత వైఎస్సార్ స్ఫూర్తితో 2013 నుంచి ప్రారంభమైన ట్రస్ట్ ప్రతి ఏటా సేవా కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. తండ్రి జ్ఞాపకార్ధం ‘మల్లాది వేంకటసుబ్బారావు’ పేరుతో సేవా కార్యక్రమాలు కొనసాగించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించారు. చిన్నచిన్న అడుగులతో ప్రారంభమైన ట్రస్ట్.. నేడు రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరించిందని పేర్కొన్నారు. ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు ఉచిత రక్తదాన శిబిరాలు, పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ ల పంపిణీ, హెల్త్ క్యాంపులు, కుట్టు మిషన్లు, ప్లాట్ ఫామ్ రిక్షాలు, తోపుడు బండ్లు, ఇస్త్రీ పెట్టెలు, క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్ల పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించినట్లు వెల్లడించారు. కరోనా సమయంలోనూ ట్రస్ట్ ద్వారా పేదలకు ఉచితంగా ఆహారం, మందులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం మంచినీరు సదుపాయం కావలసిన వారు టోల్ ఫ్రీ నెంబర్ 9949778499 కి ఫోన్ చేయవలసిందిగా పేర్కొన్నారు. రానున్న రోజుల్లోనూ ఈ సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని మల్లాది విష్ణు స్పష్టం చేశారు.
ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదు
ఆంధ్ర రాష్ట్రాన్ని శ్రీలంకతో పోల్చి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తెలుగుదేశం నాయకులు దెబ్బతీస్తున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్, మలేషియా అని, లేనప్పుడు శ్రీలంక అంటూ రెండు నాలుకలతో మాట్లాడటం టీడీపీ నాయకులకే చెల్లిందన్నారు. చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు 600 లకు పైగా హామీలు ఇచ్చి.. చివరకు ఏ ఒక్కటీ కూడా పూర్తిగా నెరవేర్చకుండా మోసం చేశారని గుర్తుచేశారు. కానీ కరోనా వంటి కష్టకాలంలోనూ పేదల సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం విస్మరించలేదని తెలిపారు. మూడేళ్ల వైఎస్ఆర్ సీపీ పాలనలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం ద్వారా లబ్ది చేకూరిందని మల్లాది విష్ణు అన్నారు. ఆ వివరాలను బుక్ లెట్ ల ద్వారా గడప గడపకూ తిరిగి వివరిస్తామన్నారు. ఆంధ్రుల మనోభావాలు దెబ్బతీసేలా ఇకపై ఎవరైనా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోయేది లేదని హెచ్చరించారు.
నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. దాదాపు దశాబ్దకాలంగా మల్లాది వేంకట సుబ్బారావు ట్రస్ట్ పేదలకు అందిస్తోన్న సేవలు నిరుపమానమన్నారు. ఇతరులకు సహాయ పడటం, పరుల కోసం జీవించడం ప్రతిఒక్కరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే చేతులమీదుగా మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు అలంపూరు విజయలక్ష్మి, ఉమ్మడి రమాదేవి, ఇసరపు దేవి, జానారెడ్డి, నాయకులు అలంపూరు విజయ్, ఇసరపు రాజారమేష్, ఉమ్మడి వెంకట్రావు, కగ్గా పాండురంగారావు, పోలుకొండ శ్రీనివాసరావు, వెన్నం రత్నారావు, సౌమ్య బాబు, వీరబాబు, ప్రసాద్, తోపుల వరలక్ష్మి, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.