-శ్రీవారిని భక్తులకు దూరం చేసేలా టిటిడి నిర్ణయాలు… : నారా చంద్రబాబు నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తుల పడిన కష్టాల పై టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది భక్తులు గంటల తరబడి పసిబిడ్డలతో మండుటెండలో అవస్థలు పడుతుంటే టీటీడీ ఏమి చేస్తుందని ప్రశ్నించారు. ఆడవాళ్లు, పిల్లలు,వృద్దులు క్యూలైన్లలో పడుతున్న అవస్థలు టిటిడికి పట్టవా అని చంద్రబాబు మండిపడ్డారు. భక్తుల రాక, రద్దీ గురించి కనీసం అవగాహన లేకుండా టిటిడి వ్యవహరించిందని చంద్రబాబు అన్నారు. సర్వదర్శనం టోకెన్ల కోసం క్యూలైన్ లో తీవ్ర తొక్కిసలాట జరగడం, పలువురు భక్తులు గాయపడడం పై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వేలాది మంది భక్తులు వస్తుంటే…వారికి తాగునీటి సదుపాయం, క్యూ లైన్లలో నీడ కూడా కల్పించకపోవడం దారుణం అన్నారు. శ్రీవారి భక్తులపై ఇంతటి నిర్లక్ష్యమా అని టిటిడిని చంద్రబాబు ప్రశ్నించారు. మొదటి నుంచి టీటీడీ నిర్ణయాలు శ్రీవారి ని భక్తుల కు దూరం చేసేలా ఉన్నాయని చంద్రబాబు అన్నారు. సామాన్య భక్తుల దర్శనాలు, వసతి వంటి అంశాల్లో మొదటి నుంచి ఇదే తరహా అలసత్వం టీటీడీలో కనిపిస్తుందన్నారు. తిరుమల లాంటి ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆదాయ వనరు కోణం లోనే టీటీడి చూస్తుందని….కొండపైకి వెళ్ళడానికి కూడా ఆంక్షలు విధించడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే అని చంద్రబాబు అన్నారు. జరిగిన ఘటనపై శ్రీవారి భక్తులకు టీటీడీ క్షమాపణలు చెప్పి…ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని టిడిపి అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.