మహిళల్లో ఆర్థిక చైతన్యం కోసమే సున్నావడ్డీ వారోత్సవాలు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలలో ఆర్థిక చైతన్యం తీసుకువచ్చేందుకుగాను సున్నావడ్డీ వారోత్సవాలను ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. అజిత్ సింగ్ నగర్లోని షాదీఖానా నందు బుధవారం జరిగిన వైఎస్సార్ సున్నావడ్డీ వారోత్సవాలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజా రెడ్డి, వైసీపీ కార్పొరేటర్లు ఎండి షాహినా సుల్తానా, ఇసరపు దేవీలతో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు మాట్లాడుతూ.. మహిళలందరూ సగర్వంగా సొంత కాళ్లపై నిలబడేలా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తోందని వెల్లడించారు. జగనన్న అందిస్తున్న సాయాన్ని పెట్టుబడిగా చేసుకుని మహిళలందరూ లాభాలు గడించేలా వ్యాపారవేత్తలుగా మారాలని ఆకాంక్షించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం డ్వాక్రా సమావేశాలను పూర్తిగా రాజకీయ ఉపన్యాసాలకు వేదికలుగా మార్చిందని మండిపడ్డారు. కానీ ఈ ప్రభుత్వం పొదుపు సంఘాలలోని అక్కచెల్లెమ్మలందరూ ఆర్థిక పరిపుష్టి సాధించే దిశగా అవగాహన కల్పిస్తూ సమావేశాలు, వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

దేశంలోనే సంక్షేమ కార్యక్రమాలను శాచ్యురేషన్ విధానంలో గడప గడపకు చేరవేస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. మహిళ సంక్షేమం కోసం ప్రత్యేకంగా 7 పథకాలను ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేస్తున్నామన్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 31,100 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 56 కోట్ల 35 లక్షలు., సున్నావడ్డీ పథకం ద్వారా 4,276 మందికి రూ. 17 కోట్ల 26 లక్షలు., వైఎస్సార్ చేయూత ద్వారా 6,232 మందికి రూ. 12 కోట్ల 48 లక్షలు., అమ్మఒడి పథకం ద్వారా 28,834 మంది తల్లులకు రూ. 84 కోట్ల 45 లక్షలు., వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 1,958 మందికి రూ. 3 కోట్ల 22 లక్షలు., ఈబీసీ నేస్తం ద్వారా 1,947 మందికి రూ. 2 కోట్ల 92 లక్షలు నేరుగా ఆడపడుచుల ఖాతాలలో జమ చేసినట్లు వివరించారు. మొత్తంగా మూడేళ్లలో 74,347 మందికి రూ. 176.70 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు వివరించారు. రాష్ట్రంలో పేదరికాన్ని అంతం చేయాలనే దృఢ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంటే.. పేదలందరూ పేదలుగా ఉండిపోవాలన్న దురుద్దేశంతో పచ్చ మీడియాతో ప్రభుత్వ పథకాలపై దుష్ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు.

సున్నా వడ్డీ పథకం మూడో విడతకు సంబంధించి సెంట్రల్ నియోజకవర్గంలో 4,437 గ్రూపులకు గానూ రూ. 6.55 కోట్ల నగదు ఆడబిడ్డల బ్యాంకు ఖాతాలలో జమ చేసినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. తొలి విడతలో 4,276 గ్రూపులకు గాను రూ. 5.40 కోట్ల నగదు వారి వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. రెండో విడతకు సంబంధించి 4,032 గ్రూపులకు గాను రూ. 5.31 కోట్లు అందజేసినట్లు వివరించారు. మొత్తంగా మూడు విడతలు కలిపి 4,576 గ్రూపులలో రూ. 17.26 కోట్లను సున్నావడ్డీ ద్వారా లబ్ధిచేకూర్చినట్లు వివరించారు. ఒక్కో గ్రూపుకు సగటున రూ. 25 నుంచి 30 వేల వరకు లబ్ధి చేకూరిందన్నారు. అలాగే 57 వ డివిజన్ లో 207 గ్రూపులకు గానూ రూ. 24.79 లక్షలు., 58వ డివిజన్ లో 147 గ్రూపులకు రూ.24.02 లక్షలు., 59 వ డివిజన్ లో 355 గ్రూపులకు గానూ రూ. 52.22 లక్షలు, 60 వ డివిజన్ లో 232 గ్రూపులకు గానూ రూ. 32.91 లక్షలు అక్కచెల్లెమ్మలకు లబ్ధి చేకూర్చినట్లు వివరించారు.

టీడీపీ ఉన్మాదుల కీచక పర్వాలన్నీ ముద్రిస్తే లైబ్రరీలు సరిపోవు
మహిళల రక్షణకు దిశ యాప్ ను ప్రవేశపెట్టి దాదాపు 900 మహిళలను రక్షించిన ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమని మల్లాది విష్ణు అన్నారు. మహిళ భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలనే నానా యాగీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ఆడబిడ్డలపై పెచ్చుమీరిన పచ్చ నేతల కీచక పర్వాలన్నింటినీ ముద్రిస్తే.. లైబ్రరీలు సరిపోవన్నారు. ఆనాడు బాధిత కుటుంబాలకు న్యాయం చేయవలసిందిపోయి.. ఒక్కో మహిళకు ఒక్కో పోలీస్ ను పెట్టలేమని అవహేళనగా మాటాడింది మర్చిపోయారా..? అని ప్రతిపక్షనేతను సూటిగా ప్రశ్నించారు. చివరకు ప్రతిపక్షంలోనూ పచ్చ నేతల ఆగడాలు ఆగలేదని.. నగరంలో టీడీపీ నాయకుడు వినోద్ జైన్ వేధింపులకు బలైన చిన్నారి ఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. చివరకు మహిళ కమిషన్ చైర్ పర్సన్, సోదరి వాసిరెడ్డి పద్మపై మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా దురుసుగా ప్రవర్తించడం.. మహిళల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధికి అద్దం పడుతోందన్నారు.

గేటెడ్ కమ్యూనిటీ తరహాలో జగనన్న కాలనీలు
విజయవాడ నగరంలో 95 వేల మంది పేదల సొంతింటి కల సాకారానికి జగనన్న ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. అర్హులైన వారందరికీ ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించడమే కాకుండా.. ఇంటి నిర్మాణానికి రూ. 1 లక్ష 80వేల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతోందన్నారు. దీంతోపాటుగా లబ్ధిదారుని అవసరాన్ని బట్టి మరో రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు బ్యాంకర్లతో మాట్లాడి.. రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. అలాగే సొంత స్థలం ఉన్న వారు కూడా ఇళ్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాయం అందించడం జరుగుతుందన్నారు. ప్రతి లేఅవుట్ లోనూ విశాలవంతమైన రోడ్లు, రవాణా సదుపాయం, డ్రైనేజీ, నీటిసరఫరా, విద్యుత్, అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టం, కమ్యునిటీ హాళ్లు, హెల్త్ సెంటర్లు వంటి సకల సదుపాయాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇళ్లను గేటెడ్ కమ్యూనిటీ తరహాలో మినీ నగరాలుగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఆయా ప్రాంతాలకు సులభతర రవాణా సదుపాయం కోసం అజిత్ సింగ్ నగర్లో ఒక మినీ బస్టాండ్ ను నిర్మించబోతున్నట్లు వెల్లడించారు.

డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. మహిళలంటే తెలుగుదేశం నాయకులకు చులకనభావమని.. గతంలో బోండా ఉమా ఎమ్మెల్యేగా ఉండగా సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించిన సందర్భాలను గుర్తుచేశారు. కానీ తమది మహిళ పక్షపాతి అని చెప్పుకొచ్చారు. నగరంలో అత్యధిక కార్పొరేటర్ స్థానాలు మహిళలకు కేటాయించడమే కాకుండా.. మేయర్, రెండు డిప్యూటీ మేయర్లను చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మహిళ కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానా మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలనను పక్క రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాజు, నాయకులు బెవర నారాయణ, హఫీజుల్లా, ఇసరపు రాజా రమేష్, బత్తుల దుర్గారావు, అఫ్రోజ్, నేరెళ్ల శివ, సురేష్, డ్వాక్రా సీవోలు, ఆర్పీలు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *