-టీడీపీ ప్రభుత్వం మోసం చేసిన లబ్ధిదారులకు.. జగనన్న ప్రభుత్వంలో న్యాయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత చంద్రబాబు ప్రభుత్వం మోసగించిన టిడ్కో లబ్ధిదారులకు.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పూర్తి న్యాయం జరిగిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి 897 మంది లబ్ధిదారుల ఖాతాలలో రూ. 3 కోట్ల 6 లక్షల 12 వేల 5 వందల నిధులు జమ చేసినట్లు శనివారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. నగర వ్యాప్తంగా 3,315 మంది ఖాతాలలో రూ. 10 కోట్ల 3 లక్షల 4 వేలు జమ అయినట్లు వివరించారు. పేదల సొంతింటి కలను ఆసరాగా తీసుకుని గత పాలకులు, జన్మభూమి కమిటీలు పేదలను నిలువునా మోసగించాయని మల్లాది విష్ణు అన్నారు. కనీసం స్థలాలు కూడా లేకుండా టిడ్కో ఇళ్ల పేరిట పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నారు. కేవలం కాగితాలకే ఇళ్లను చూపి.. ఒక్కో లబ్ధిదారుని వద్ద రూ. 50 నుంచి రూ. లక్ష వరకు అప్లికేషన్ల రూపంలో దోచుకున్నారన్నారు. ఇందుకోసం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో మేళా కూడా నిర్వహించారని గుర్తుచేశారు. జూలై 03, 2018 నుంచి మార్చి 21, 2019 వరకు టిడ్కో లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన డబ్బులకు నేటికీ వారంతా వడ్డీలు చెల్లిస్తున్నారని మల్లాది విష్ణు విమర్శించారు. చివరకు ఎన్నికలు సమీపిస్తున్నాయన్న భయంతో జనవరి 17, 2019 న నామమాత్రంగా ఆర్డర్ కాపీలను అందచేసి మరోసారి మోసగించారన్నారు. ఇందులో 6,576 ఇళ్లు కనీసం 50 శాతం పూర్తికాలేదని.. 5,341 మందికి కనీసం స్థలం కూడా చూపలేదన్నారు. అయినా కూడా నగరంలో 11,917 మందికి ఆర్డర్ కాపీలను ఇచ్చారని దుయ్యబట్టారు. ఫలితంగా డబ్బులు చెల్లించిన కుటుంబాలు రోడ్డునపడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు, తెలుగుదేశం పాలకుల పాపాలకు బలైన లబ్ధిదారులను ఆదుకునే పూర్తి బాధ్యత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారని మల్లాది విష్ణు అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పారదర్శకంగా వారందరి వివరాలు సేకరించి డబ్బులు తిరిగి ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. గత ప్రభుత్వం పేదలపై భారం వేయాలని చూస్తే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు అందిస్తున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కట్టకుండా వదిలేసిన టిడ్కో ఇళ్లను రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, వీధి దీపాలు వంటి అన్ని హంగులతో పూర్తి చేసి డిసెంబర్ 21 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజున పేదలకు అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. మిగతా వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడమే కాకుండా.. ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం నుంచి రూ. 1.80 లక్షలు, బ్యాంకుల నుంచి మరో రూ. 35 వేలు రుణంగా మంజూరు చేస్తామని తెలియజేశారు. మరోవైపు టిడ్కో ఇళ్లకు సంబంధించి మధ్యవర్తులకు నమ్మి మోసపోయిన బాధితులు.. పూర్తి వివరాలతో ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తే తగిన న్యాయం చేస్తామని హామీనిచ్చారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక టీఎన్టీయూసీ నాయకునికి టిడ్కో ఇంటి కోసం రూ. 1.20 లక్షలు చెల్లించి మోసపోయిన నలుగురు మహిళలు ఇటీవల అజిత్ సింగ్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.