Breaking News

పొరపాట్లకు తావు లేకుండా రీ సర్వే చేయాలి

-జనవరి 20 నుంచి రీ సర్వే ప్రారంభం
-రీ సర్వే ప్రక్రియపై కృష్ణా యూనివర్సిటీలో కార్యశాల నిర్వహించిన జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పొరపాట్లకు తావు లేకుండా నిబంధనల ప్రకారం రీ సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జిల్లా సర్వే భూమి రికార్డుల శాఖ ఆధ్వర్యంలో రీ సర్వే ప్రక్రియపై కృష్ణా యూనివర్సిటీలోని ఆర్ట్స్ ఆండ్ సైన్స్ కళాశాల భవనం ఆడిటోరియంలో గురువారం రెవెన్యూ అధికారులు, సిబ్బందికి కార్యశాల నిర్వహించారు. ఉదయం బందరు డివిజన్ పరిధిలోని వారికి, మధ్యాహ్నం ఉయ్యూరు డివిజన్ పరిధిలోని రెవెన్యూ అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఇరువురు రీ సర్వే ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వంద సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ రీ సర్వే రాబోయే సంవత్సరాలలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పక్కా ప్రణాళికతో పకడ్బందీగా చేపట్టాలన్నారు. జనవరి 20వ తేదీ నుంచి జిల్లాలో రీ సర్వే ప్రారంభమవుతుందన్నారు. తహసీల్దార్లు, వీఆర్వోలు, గ్రామ, మండల సర్వేయర్లు రీ సర్వే ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తారని, సమన్వయం చేసుకుంటూ పకడ్బందీగా నాణ్యమైన రీ సర్వే చేయాలన్నారు.

సమస్యలు గల భూముల విషయంలో జాగ్రత్త వహించాలని, అనుభవదారులు హక్కుదారులు, ప్రైవేటు ప్రభుత్వ భూములు, భూ సేకరణ భూములు గుర్తించి నమోదు చేయడంలో క్షుణ్ణంగా పరిశీలించాలాన్నారు. రికార్డుల ప్రకారం సక్రమంగా ఉంటూ భూ యజమానులు లేదా రైతులకు సంబంధించిన భూ విస్తీర్ణం, భూ సరిహద్దులు వంటి వివాదాలను ఇరువురికి సమ్మతంగా ఉంటే సాధ్యమైనంతవరకు క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని సూచించారు. రీ సర్వే సమయంలో భూమికి సంబంధించిన వ్యక్తులు స్వగ్రామంలో కాకుండా రాష్ట్రంలో లేదా ఇతర ప్రాంతాలలో ఉంటున్నట్లయితే వారికి తప్పనిసరిగా సమాచారం అందించి పిలిపించాలని, ఇతర దేశాలలో నివసిస్తున్న వారి విషయంలో వారు సూచించిన వ్యక్తుల సమక్షంలో రీ సర్వే చేయాలన్నారు. భూమి నిజనిర్ధారణ (గ్రౌండ్ ట్రూతింగ్), భూమి ధ్రువీకరణ (గ్రౌండ్ వాలిడేషన్) ప్రక్రియలు సక్రమంగా జరిగితే రీ సర్వేలో నాణ్యమైన ఫలితాలు పొందవచ్చని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. రీ సర్వేకు సంబంధించిన హ్యాండ్ బుక్ ను సమగ్రంగా చదివి అవగాహన ఏర్పరచుకోవాలన్నారు.

జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే ప్రక్రియ ప్రారంభించేముందు అందుకు సంబంధించిన వివరాలతో ఆయా గ్రామాలలో గ్రామసభతో పాటు ర్యాలీలు నిర్వహించి ప్రజలకు తప్పనిసరిగా తెలియజేయాలన్నారు. రీ సర్వే ప్రక్రియకు సంబంధించిన అధికారులు, సిబ్బందితో పాటు ఆయా గ్రామాలలోని భూ యజమానులు రైతులతో కూడిన ఫోన్ నెంబర్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఏ రోజున ఏ సర్వే నంబర్లు రీ సర్వే చేస్తున్నదీ సమాచారం అందించాలని సూచించారు.

అనంతరం వారు రీ సర్వే ప్రక్రియపై రెవెన్యూ అధికారులు, సిబ్బందికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర్ రావు, కే ఆర్ ఆర్ సీ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, మచిలీపట్నం, ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ల అధికారులు కే స్వాతి, బీఎస్ హేలా షారోన్, తహసీల్దార్లు, వీఆర్వోలు, గ్రామ, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *