మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ త్రివర్ణపతాక నిర్మాత, స్వాతంత్య్ర యోధుడు, వ్యవసాయ శాస్త్రవేత్త, సాహితీవేత్త, జియాలజిస్ట్, బహుభాషా నిష్టాతుడైన పింగళ వెంకయ్య తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుని జీవితం అందరికి స్ఫూర్తిదాయమని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా కీర్తించారు.
జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా పింగళి వెంకయ్య జన్మస్థలమైన కృష్ణాజిల్లా మొవ్వ మండలం ‘భట్ల పెనుమర్రు’ గ్రామంలో నిర్వహించే కార్యక్రమానికి మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరుయ్యారు. తొలుత ఆయన భట్ల పెనుమర్రు కూడలిలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పింగళి వెంకయ్య స్మారక భవనంలో కృష్ణాజిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర పోరాటం మహనీయుల అరుదైన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించిన అనంతరం ఆయన సభలో మాట్లాడుతూ, దాదాపు 30 దేశాల పతాకాలను పరిశీలించి, జాతీయ పతాకం పై ఒక గ్రంధాన్ని రచించి 1921 లోనే బారతదేశానికి మహోన్నతమైన జాతీయ పతాకాన్ని రూపొందించిన గొప్ప వ్యక్తి జన్మించిన పవిత్ర స్ధలాన్ని సందర్శించిన తాను వ్యక్తిగతంగా ఎంతో గర్వపడుతున్నట్లు తెలిపారు. 19 ఏళ్ళ వయస్సులో సైన్యంలో చేరడం దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడ బానిసత్వంలో జరుగుతున్న యుద్ధంలో పాల్గోవడం అక్కడ గాంధీజీని కలవడం తిరిగి భారతదేశానికి వచ్చి స్వతంత్ర పోరాటంలో పూర్తి బాగస్వామ్యుడు కావడం, వివిధ రంగాలలో పరిపూర్ణుడై రాణించడం అత్యంత అరుదైన విషయమన్నారు, 1906 నుంచి 1922 మధ్య కాలంలో వందేమాతరం, హోమ్ రూల్ వంటి అనేక కీలక ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్న నేపధ్యం ఆయన స్వంతం అన్నారు.
అనంతరం, పామర్రు శాసనసభ్యులు కైలె అనిల్ ప్రసంగిస్తూ, దేశం కోసం అనునిత్యం తపించిన మహానుభావుడు పింగళి వెంకయ్య అని కొనియాడారు. మనకు ఒక స్వంత జాతీయ పతాకం, చిహ్నం ఉండాలని పరితపించి ,అమితమైన నిస్వార్ధ దేశభక్తితో గాంధీజీను ఆనాడే ఆకర్షించి జాతీయ జెండా రూపకల్పనకు ప్రేరేపితుడు కావడం సామాన్య విషయం కాదన్నారు. విభిన్న ఆందోళనలలో భాగస్వామ్యుడై, నిస్వార్ధ సేవానురక్తుడై, దేశ స్వతంత్రానుక్తుడై, నిబద్ధతతో జీవనం సాగించి, మంచి ఉపన్యాసకుడిగా, వ్యవసాయ క్షేత్రాభివృద్ధికి తోడ్పడిన వ్యక్తిగా జన బాహుల్యానికి పరిచయమైన వ్యక్తిగా చరిత్రలో పింగళి వెంకయ్య మిగిలిపోయారన్నారు.
తర్వాత జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారికా మాట్లాడుతూ, రాజకీయ నాయకుల నిస్వార్ధతతకు, జీవితంలో భౌతికపరమైన లాభాల పునరుద్ధరణకు తోడ్పడేలా కుంకుమ రంగు సూచిస్తుందని; తెలుపు జ్ఞానోదయానికి, ప్రవర్తనకు సత్య మార్గాన్ని వెలిగించేందుకు దోహదపడుతుందని ఆకుపచ్చ నేలతో మనకున్న అనుబంధాన్ని వెల్లడిస్తుందని తెలిపారు. జాతీయ పతాకం మధ్యలోని అశోక చక్రం న్యాయానికి, ధర్మానికి సూచికగా ఉంటుందని ఆమె వివరించారు.
భట్లపెనుమర్రు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థినీ విద్యార్థులు 500 మీటర్ల పొడవైన జాతీయ పతాకం చేతబూని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కొందరు చిన్నారులు పింగళి వెంకయ్య, బాబాసాహెబ్ అంబే , అల్లూరి సీతారామరాజు తదితర దేశభక్తుల వేషధారణలో పలువురిని ఆకర్షించారు. శ్రీ మేధ కూచిపూడి విద్యార్థినులు వందేమాతరం పాటకు ఎంతో లయబద్దంగా నృత్యం చేశారు. స్థానిక జడ్పి హైస్కూల్ విద్యార్థులు హమ్ భారత్ వాసి అనే పాటకు అద్భుతమైన ప్రదర్శన చేసి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల, పింగళి వెంకయ్య సోదరుని పుత్రుడు గోపాలకృష్ణయ్య, ఉయ్యూరు ఆర్డిఓ విజయ్ కుమార్, మొవ్వ ఎండిఓ ప్రవీణ్, మొవ్వ తాహిసిల్దార్ వీరాంజనేయ ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారిణి ఏ.డి. జ్యోతి, భట్లపెనుమర్రు సర్పంచ్ మట్టా ఇందిరా సతీష్, మొవ్వ ఎంపిపి కొండేటి ఇందిరా చందు, జెడ్పిటీసి రాజులపాటి శివ పార్వతి, భట్ల పెనుమర్రు గ్రామ కార్యదర్శి డేగల ఝాన్సీ లక్ష్మి , సచివాలయ ఉద్యోగులు, వాలింటర్లు, ఆరోగ్య సిబ్బంది, స్థానిక ప్రముఖులు పలువురు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అసౌకర్యం కల్పించిన వారి పై చట్ట రీత్యా కఠిన చర్యలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం రాజమహేంద్రవరం జిల్లా రవాణా అధికారి వారి కార్యాలయంలో …