-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాకు మంజూరైన ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలు స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
మైలవరం నియోజకవర్గానికి మంజూరైన ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలపై గొల్లపూడిలోని శాసనసభ్యుని కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు స్థానిక శాసన సభ్యులు వసంత కృష్ణప్రసాద్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలోని మైలవరం నియోజకవర్గానికి గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ల భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. వారంలోగా నియోజకవర్గ పరిధిలో ఇంకనూ ప్రారంభం కాని భవన నిర్మాణాలను ప్రారంభించాలని, ప్రారంభమై బిలో బేస్మెంట్ స్థాయిలో ఉన్న నిర్మాణాలను బేస్మెంట్ స్థాయికి తీసుకురావాలని అధికారులు, ఏజెన్సీలను కలెక్టర్ డిల్లీరావు ఆదేశించారు. మైలవరం నియోజకవర్గానికి మంజూరైన భవనాలలో ఇంకనూ ప్రారంభం కానివి, ప్రారంభమై బిలో బేస్మెంట్ స్థాయిలో ఉన్నవి మొత్తంగా 63 భవనాలు ఉన్నాయని వీటిలో ఇంకనూ ప్రారంభం కాని 25 భవనాలను, బిలో బేస్మెంట్ స్థాయిలో ఉన్న 38 భవన నిర్మాణాలను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణ దశలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను సంబంధిత మండల అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చి సమన్వయంతో పరిష్కరించు కోవాలన్నారు. భవన నిర్మాణాలకు అవసరమైన స్థల సేకరణలో ఎదురయ్యే ఇబ్బందులను రెవెన్యూ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నిర్మాణాల ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. నిర్మాణాలకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు మంజూరు చేస్తుందన్నారు. వారం రోజులలో ప్రారంభం కాని భవనాలను ప్రారంభింపచేసేలా అధికారులు, ఏజెన్సీలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిల్లీరావు ఆదేశించారు. అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను కలెక్టర్ డిల్లీరావు తెలుసుకున్నారు
శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి పనుల్లో మైలవరం నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉందన్నారు. నియోజకవర్గంలో ఇంకను చేపట్టవలసిన పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. అభివృద్ధి పనులు చేస్తున్న వారికి అధికారులు పరిపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు. ఏసమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని ప్రజా ప్రతినిధులకు శాసనసభ్యులు సూచించారు. పెండిరగులో ఉన్న అన్ని భవన నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ అన్నారు.
సమావేశంలో హౌసింగ్ పిడి శ్రీదేవి, డ్వామా పిడి జె సునీత, పంచాయతీ రాజ్ ఇఇ అక్కినేని వెంకటేశ్వరరావు, హౌసింగ్ ఇఇ రవికాంత్, నియోజకవర్గ మండల పరిధిలోని తహాశీల్థార్లు, యంపిడివోలు, స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు ఉన్నారు.