-తల్లి పాల వారోత్సవాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పోషక విలువలున్న ఆహారంతో చక్కని ఆరోగ్యం సిద్ధిస్తుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఐ.సి.డి.ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన తల్లిపాల వారోత్సవాలను మధురానగర్లోని అంగన్వాడీ కేంద్రం నందు శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతితో కలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార పదార్ధాల ప్రదర్శనను, కార్యకర్తలు తయారు చేసిన వంటకాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారోత్సవాల ఆవశ్యకతను గర్భిణులు, బాలింతలకు వివరించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి వారం రోజుల పాటు తల్లిపాల వారోత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని మల్లాది విష్ణు తెలిపారు. తల్లిపాలతోనే చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందని వివరించారు. బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు తల్లిపాలలోనే లభిస్తాయని.. వ్యాధి నిరోధకశక్తి పెరిగి శిశువుకు రోగాలు దరి చేరవన్నారు. వీటన్నింటిపై తల్లుల్లో అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో ఈ వారోత్సవాలను నిర్వహించుకుంటున్నట్లు తెలియజేశారు. ఇందులో భాగంగా రోజుకో అంశం చొప్పున 7 రోజులు 7 అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లోని గర్బిణీలు, బాలింతలలో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించడానికి వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను జగనన్న ప్రభుత్వం అమలు చేస్తోందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఈ సేవలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు.. వైఎస్సార్ సంపూర్ణ పోషణ యాప్ సహా పలు యాప్ లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. పోషకాహారంతో పాటు గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య సూత్రాలను తెలియపరిచేవిధంగా అంగన్వాడీ సూపర్ వైజర్లు సలహాలు, సూచనలు అందించాలని మల్లాది విష్ణు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే చేతులమీదుగా వైఎస్సార్ సంపూర్ణ పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ విజయవాడ-2 సిడిపీఓ జి.మంగమ్మ, సూపర్ వైజర్ రాజ్యలక్ష్మి, మెడికల్ ఆఫీసర్లు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.