– ఆర్థికంగా ఎంతో వెసులుబాటు
-లేట్ పేమెంట్ సర్చార్జీ స్కిం (ఎల్పీఎస్) లో భాగంగా నెలవారీ రుణాల చెల్లింపులకు డిస్కాములకు అవకాశం
-రూ 17060 కోట్ల బకాయిలను 12 వాయిదాల్లో విద్యుత్ ఉత్పత్తిదారులకు చెల్లించనున్న డిస్కాములు
-మొదటి వాయిదా కింద రూ 1422 కోట్లు ఆగస్టు 6న చెల్లింపు
-శ్రీ దామోదర సంజీవయ్య థర్మల్ స్టేషన్ (1×800 MW ) కృష్ణపట్నం 2వ దశ కమర్షియల్ ఆపరేషన్ ను అక్టోబర్-2022 లో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి
-నవరత్నాల ద్వారా విద్యుత్ రంగంలో వినియోగదారుల సంక్షేమానికి పెద్ద పీట
-విద్యుత్ సంస్థల్లో ప్రజా ధనం ఆదాకు చర్యలు
-బొగ్గు కొనుగోళ్లలో రూ 118. 5 కోట్లు, పోలవరం రివర్స్ టెండరింగ్ లో రూ 405. 3 కోట్లు ఆదా చేసిన ఏపీజెన్కో
-సింగరేణి నుంచి బొగ్గు కొనుగోళ్లలో రూ. 204 కోట్లు .. రివర్స్ టెండరింగ్ లో రూ 390 కోట్లు ఆదా
-డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ ప్లాంట్ (1×800 MW ) 5వ దశ కమర్షియల్ ఆపరేషన్ ఫిబ్రవరి-2023 లో ప్రారంభం
-ఏపీఎస్పీడీసిఎల్లో 8.10 శాతానికి, ఈ పీ డీ సి ఎల్ లో 6.6 శాతానికి ,సి పీ డీ సి ఎల్ లో 8.05 సాతంకి తగ్గిన విద్యుత్ పంపిణి నష్టాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ సంస్థల రుణ భారాలు తగ్గించి వాటిని ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన లేట్ పేమెంట్ సర్చార్జీ పథకంలో ఆంధ్ర ప్రదేశ్ డిస్కాములు చేరినట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ప్రకటించారు. దీనివల్ల ఏపీజెన్కోకు డిస్కాములు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు ఒక ఏడాది కాలంలో చెల్లించనున్నందున ఏపీజెన్కో ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఉంది.
76 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం విద్యుత్ సౌధలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. డిస్కాములు విద్యుత్ ఉత్పత్తిదారులకు చెల్లించవలసిన రూ. 17060 కోట్ల బకాయిలను 12 నెలలలో వాయిదాలలో చెల్లించనున్నట్లు తెలిపారు. మొదటి వాయిదా కింద రూ 1422 కోట్లను ఆగష్టు 6 న చెల్లించినట్లు తెలిపారు. దీనివల్ల క్రమంగా విద్యుత్ సంస్థలు అప్పులను తగ్గించుకోవడమే గాక ఎంతో ఆర్థిక వెసులుబాటు కూడా లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు విద్యుత్ సంస్ధలను బలోపేతం చేస్తూనే విద్యుత్ శాఖలో పెధ్ద ఎత్తున సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు విజయానంద్ తెలిపారు .
రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పథకం అమలులో ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. దీని కింద ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడమే కాకుండా వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతతో పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందించబడుతోంది. మరో వైపు రైతులకు మరో 30 ఏళ్ళ పాటు విద్యుత్ కొనసాగించేందుకు వీలుగా వ్యవసాయం కోసం ప్రత్యేకంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అఫ్ ఇండియా (సెకి) తో 7000 మెగవాట్ల విద్యుత్ కొనుగోలు కు ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.
ఏపీట్రాన్స్కో సిఎండి బి శ్రీధర్, జెఎండిలు బి.మల్లారెడ్డి, ఐ పృధ్వి తేజ్, డైరెక్టర్లు భాస్కర్, మురళీ, చంద్రశేఖరరాజు తదితరులతో కలిసి ఈ వేడుకల్లో ముఖ్య అతిధి గా పాల్గొన్న కె విజయానంద్ , అనేక అంశాలను వెల్లడిస్తూ.. విద్యుత్ సంస్థల్లో ప్రజాధనాన్ని ఆదా చేయడంలో భాగంగా అనేక చర్యలు తీసుకోవడం ద్వారా రూపాయలను ఆదా చేసినట్లు తెలిపారు. ఏ పీ జెన్కో బొగ్గు కొనుగోళ్లలో రూ 118.5 కోట్ల , పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ 405.23 కోట్లు ఆదా జరిగినట్లు తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీడీసిఎల్ ) రివర్స్ టెండరింగ్ ద్వారా రూ 390 కోట్లు , సింగరేణి కోల్ కొల్లేరీస్ నుంచి బొగ్గు కొనుగోళ్లలో రూ 204 కోట్లు ఆదా చేయటం జరిగిందన్నారు. అలాగే రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ దృష్టిలో ఉంచుకొని.. భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ 2వ దశ (1x 800 మెగావాట్ ) కృష్ణపట్నం ప్రాజెక్టు అక్టోబర్-2022 నెలలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి , ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కలిసి ప్రాజెక్ట్ కమర్షియల్ ఆపరేషన్ ను ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ 5వ దశ (1 x 800 MW ) కమర్షియల్ ఆపరేషన్ ను 2023 ఫిబ్రవరిలో ప్రారంభం అయేందుకు అవాకాశం ఉంది.
అలాగే దిగువ సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టులలో 115 మెగావాట్ల రెండు యూనిట్లను నిర్మించేందుకు రూ 510 కోట్లు మంజూరు కు ప్రభుత్వం అనుమతిచ్చిందని ఆయన వెల్లడించారు. ఎగువ సీలేరు లోను 150 మెగావాట్ల సామర్థ్యం గల 9 యూనిట్లు నిర్మించే అంశం ప్రభుత్వ పరిశీలన లో ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి తోడు విద్యుత్ సంస్థలు అంతర్గత సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తుందని విజయానంద్ పేర్కొన్నారు .
విద్యుత్ పంపిణి నష్టాలను తగ్గించుకునేందుకు గత కొన్నాళ్లుగా చేస్తున్న కృషి ఫలితంగా ఏపీఎస్పీడీసిఎల్ 8. 10 శాతానికి , ఈపీడీసిఎల్ పరిధి లో 6. 6 శాతానికి , సిపీడీసిఎల్లో 8. 05 శాతానికి 2021-22నకు పంపిణి నష్టాలు తగ్గినట్లు తెలిపారు. అలాగే సాంకేతిక , వాణిజ్య ( ఏ టీ & సి )నష్టాలు ఎస్పీడీసిఎల్ పరిధిలో 15.45 శాతానికి , ఈపీడీసిఎల్లో 7.81 శాతానికి , సిపీడీసిఎల్లో 8.05 శాతానికి తగ్గాయి. యావరేజ్ రెవిన్యూ రిక్వైర్మెంట్ – ఏవరేజ్ కాస్ట్ ఆఫ్ సర్వీస్ ( ఏఆర్ఆర్ – ఏసిఎస్) గ్యాప్, ఏపీసిపీడీసిఎల్లో యూనిట్ కు రూ 0.49 పైసలు , ఏపీఈపీడీసిఎల్లో రూ 0.16 పైసలు తగ్గడం ఆహ్వానించ దగ్గ పరినామం అని పేర్కొన్నారు.
“డిస్కాములు ఆర్దికంగా అనేక క్లిష్ట పరిస్థితులని ఎదుర్కుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకొని డిస్కాములకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. గత మూడేళ్ళ కాలంలో డిస్కమ్లను ఆదుకునేందుకు ప్రభుత్వం దాదాపు రూ 40,000 కోట్ల ఆర్థిక సహకారం అందించింది. విద్యుత్ సంస్థలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పటానికి ఇదే నిదర్శనం” అని ఆయన తెలిపారు.
విద్యుత్ సంస్థల బలోపేతానికి విద్యుత్ సంస్థల ఉద్యోగులు , వినియోగదారులు అందిస్తున్న సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమావేశంలో ఏపీట్రాన్స్కో చీఫ్ ఇంజినీర్లు మీరాకుమార్, వెంకట వీరయ్య, పి సూర్యచంద్రం, జెన్కో డైరెక్టర్లు, ఇతర విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులు, తదితర సీనియర్ అధికారులు , ఉద్యోగులు పాల్గొన్నారు.