ఇష్టపడిన దానికోసం కష్టపడండి

-భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
-నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి : విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య
-మూడు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఘనత ఆయనదే : విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులు ఇష్టపడిన దానికోసం కష్టపడితే నష్టపడేది లేదని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ‘‘ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ లీడర్‌షిప్‌ క్వాలిటీస్‌’’ అనే అంశంపై విద్యార్థులకు ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రస్తతం ఏ రంగంలోనైనా ప్రపంచ దేశాలన్నీ మనదేశం వైపే చూస్తున్నాయన్నారు. మంచి నాయకులుగా ఎదగాలనుకునే విద్యార్థులు క్రమశిక్షణ, గుణం, సామర్థ్యం, ప్రవర్తన, క్యాలిబర్‌ వంటి లక్షణాలను అలవర్చుకోవాలన్నారు. విద్యార్థులందరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్నారు. విద్యార్థులు ఎంచుకునే ఏ రంగమైనా ( డాక్టర్, యాక్టర్, ఇంజినీర్, సైంటిస్ట్, రైతు) కష్టపడటంతో పాటు మంచి అభిరుచితో ప్రయత్నిస్తే తప్పకుండా అభివృద్ధిలోకి వస్తారన్నారు. గొప్ప గొప్ప నాయకుల కృషి వలనే నేడు మనం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. విద్యార్థులందరూ కలలు కని వాటిని సాకారం చేసుకునే స్థాయికి ఎదగాలన్నారు. మన దేశంలోని యువత వద్ద ఆలోచనలకు కొదవలేదని, వాటన్నింటిని ఆచరణలోనికి తీసుకువస్తే దేశం అభివృద్ధి పథంలోకి నడుస్తుందన్నారు. విద్యార్థులందరూ బాగా కష్టపడి చదివి, ఉన్నత స్థానాలను అధిరోహించి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. విద్యార్థులందరూ ఇండిపెండెంట్, పాజిటివ్, కాన్ఫిడెంట్, కన్‌స్ట్రక్టివ్‌గా ఉండాలన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులను, పెద్దలను బాగా చూసుకోవాలన్నారు. నన్ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అనే పిలిపించుకునే బదులు ముప్పవరపు వెంకయ్యనాయుడు అని పిలిస్తేనే ఎక్కువ సంతోషపడుతాన న్నారు.

నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి : విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య
విద్యార్థులందరూ నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య అన్నారు. విద్యార్థులందరూ అవరోధాలు లెక్కచేయకుండా ముందుకు వెళ్లాలన్నారు. విద్యార్థులు ఎవరైనా మేము పేదవాళ్లం.. ఏమీ చేయలేము అనే నిరాశావాదం వద్దని, కేవలం ఉద్యోగాలకే పరిమితం అవ్వకుండా నాయకులుగా ఎదగాలన్నారు. అందరూ బాగుండాలని కోరుకునే మనసున్న వ్యక్తి, పరిపూర్ణ వ్యక్తిత్వంతో ఎదిగిన గొప్ప నాయకుడు మన వెంకయ్యనాయుడని విద్యార్థులకు తెలియజేసారు.

మూడు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఘనత ఆయనదే : విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు
మూడు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఘనత ఒక్క వెంకయ్యనాయుడుకే దక్కుతుందని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. జై ఆంధ్ర ఉద్యమంలో ఆయన ఎంతో కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఆయన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారని… విద్యార్థి నాయకుడి నుంచి భారత ఉపరాష్ట్రతిగా ఆయన ఎదిగిన తీరు విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.

అనంతరం అమెజాన్‌లో నెలకు రూ.80 వేల ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విజ్ఞాన్‌ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వెంకయ్యనాయుడు సన్మానించారు. ఆ తర్వాత ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *