-చట్టసభల స్థాయి తగ్గించడం దేశానికి మంచిది కాదు
-ఇంట్లో, గుడిలో, బడిలో మాతృభాషలోనే మాట్లాడాలి
-ప్రజాస్వామ్యంలో పార్టీలు మారడం మంచి పద్ధతి కాదు
-మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు
గుంటూరు, నేటి పత్రిక ప్రజా వార్త :
చట్టసభల స్థాయి తగ్గించడం దేశానికి మంచిదికాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. చట్టసభల్లో ఉండేవారు మరింత బాధ్యతగా ఉండాలని సూచించారు. గుంటూరులో జరిగిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన ఆయన భాష హుందాతనంగా ఉండాలన్నారు. మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. మాతృభాషలో చదివిన చాలామంది అత్యున్నత స్థానాలకు ఎదిగారని గుర్తు చేశారు. పదవిలో ఉన్నవారు తమ భాష, ప్రవర్తనతో చట్టసభల స్థాయి తగ్గించడం దేశానికి మంచిది కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన వ్యవస్థలను కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉందన్నారు. శాసన, పరిపాలన, న్యాయ వ్యవస్థ పరిధులేమిటో రాజ్యాంగం స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఏం జరుగుతోందని ప్రపంచమంతా ఎదురు చూస్తోందని, అందుకే చట్టసభల్లో మాట్లాడే భాష సభ్యత, సంస్కారంతో ఉండాలని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో పార్టీలు మారడం మంచి పద్ధతి కాదు : ప్రపంచం అంతా భారత్ వైపు చూడటానికి కారణం ప్రధాని నరేంద్రమోడీ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భారత్ స్నేహం కోసం ప్రపంచదేశాలు ఎదురుచూస్తున్నాయని తెలిపారు. గుంటూరులోని విజ్ఞాన్ వర్సిటీలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ ఆత్మీయ సమావేశంలో చిరకాల మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులను కలవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన మిత్రులకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ యువత ఉత్సాహం, ఉత్తేజంతో ఉండాలి. యువతే దేశానికి అసలైన సంపద. యువత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. యువత రాజకీయాల్లోకి రావాలి. అమెరికా, రష్యా, బ్రిటన్ అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఉంది. నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో అర్థం కావడం లేదు. పార్టీలు మారడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు పోవడం, కులమతాల ఆధారంగా నాయకులను ఎన్నుకోవడం సరైన పద్ధతి కాదని వెంకయ్యనాయుడు అన్నారు.
రాజ్యాంగ పదవుల కంటే జనం మధ్యలో ఉండి పని చేయటం అంటేనే ఇష్టం. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిలో సుభాష్ చంద్రబోస్ కూడా ముఖ్యులు. ఆయనతో పాటు చాలామందికి దక్కాల్సిన గుర్తింపు రాలేదు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అలాంటి వారిని స్మరించుకోవటం గర్వకారణం. ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే ఉన్నత స్థాయికి వస్తారనే అభిప్రాయం తప్పని, మాతృభాషలో చదివిన చాలా మంది దేశంలో అత్యున్నత స్థానాలకు ఎదిగారు.ఇంట్లో, గుడిలో, బడిలో మాతృభాషలోనే మాట్లాడాలని, పరిపాలన కూడా తెలుగులో జరగాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, కామినేని శ్రీనివాస్, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌లు పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందినవారు, నగర ప్రముఖులు పలువురు వెంకయ్యను కలిశారు.
Prajavartha Online Telugu News