-వ్యాధి నియంత్రణకు చేస్తున్న కృషి అపూర్వమని ప్రశంస
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
రోజురోజుకు పెరుగుతున్న మధుమేహ వ్యాధిగ్రస్తులకు అవగాహన కల్పించడంతో పాటు వ్యాధి నియంత్రణకు ప్రముఖ డయాబెటిస్ వైద్య నిపుణులు కె.వేణుగోపాల రెడ్డి(వీజీఆర్) చేస్తున్న సేవలను మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారి ప్రశంసించారు. మొగల్రాజపురంలోని డాక్టర్ వీజీఆర్ డయాబెటిస్ స్పెషాలిటీస్ హాస్పటల్ అధినేత డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి శనివారం మహారాష్ట్ర గవర్నర్‌ను ముంబయ్‌లోని రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సామాజిక బాధ్యతగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు అవగాహన, వైద్య శిబిరాల ద్వారా చైతన్యం కల్పించడం కోసం వీజీఆర్ చేస్తున్న కృషిని గవర్నర్ అభినందించారు. వ్యాసరచన పోటీలు నిర్వహించి పాఠశాల స్థాయి నుంచే 10లక్షల మంది విద్యార్థులకు మధుమేహ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం, 4 వేల వైద్య శిబిరాల నిర్వహణ ద్వారా లక్షలాది మంది ప్రజలకు మధుమేహ వ్యాధి బారిన పడకుండా చైతన్యపరచడం ద్వారా వేలాది మంది ఉపశమనం పొందడం ముదావహమని మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారి పేర్కొన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం 40వేల మొక్కలను డాక్టర్ వీజీఆర్ పంపిణీ చేయడాన్ని గవర్నర్ అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ వీజీఆర్ రూపొందించిన డయాబెటిస్ అట్లాస్ బుక్ పలువురు ప్రముఖుల ద్వారా దేశం నలుమూలలకు చేరి ప్రజలందరికీ ఎంతో ప్రయోజనకరంగా ఉందని పేర్కొంటూ డాక్టర్ వీజీఆర్‌కి మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వేణుగోపాల రెడ్డి మాట్లాడుతూ.. నానాటికీ పెరుగుతున్న మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపశమనం కలిగించడంతో పాటు వ్యాధి నియంత్రణకు తన శాయశక్తులా కృషి చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రజా డైరీ మ్యాగ్జిన్ ఎడిటర్ వి.సురేష్, తదితరులు పాల్గొన్నారు.