Breaking News

ప్రజల సంక్షేమాభివృద్దే జగన్ లక్ష్యం

-మంత్రి జోగి రమేష్

బంటుమిల్లి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజల సంక్షేమాభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని, అందుకోసం ఆయన ఎంతో శ్రమిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. ఆదివారం బంటుమిల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ చేయూత మూడో విడత పంపిణీ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమాభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. 3,648 కిలోమీటర్ల తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసిన ముఖ్యమంత్రి, నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల అవసరాలను తీరుస్తున్నారు. మానిఫెస్టోలో ఇచ్చిన హామీలు, చెప్పనివి కూడా అనుకున్న సమయానికి అన్నిటినీ ఇస్తున్నారన్నారు. పథకాల అమలులో ఎలాంటి పక్షపాతం, రాజకీయ, కులమత భేదాలు చూపకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. 45 నుంచి 60 సంత్సరాల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఏటా రూ. 18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయం ముఖ్యమంత్రి అందిస్తున్నారన్నారు. ఆ విధంగా ఈ రోజు బంటుమిల్లి మండల పరిధిలోని 2,870 మంది లబ్ధిదారులకు రూ.5,38,12,500 అందించామన్నారు. ఈ ఆర్థిక సహాయాన్ని జీవనోపాధికి ఉపయోగించుకోవడంతోపాటు కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలని మంత్రి లబ్ధిదారులకు సూచించారు.

మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని గొప్ప సంక్షేమ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోనప్పటికీ ప్రజల సంక్షేమ అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఆయన చెప్తూ, కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో వైయస్సార్ చేయూత, ఆసరా, సున్నావడ్డీ పథకాలతో పాటు జగనన్న అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా వసతి వంటి పథకాల లబ్ధిని ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేరుగా మహిళల ఖాతాలకే ముఖ్యమంత్రి అందిస్తున్నారన్నారు. మహిళలకు వైఎస్ఆర్ చేయూత నగదును అందించి దసరా పండుగను ముందుగానే తీసుకువచ్చారన్నారు.

కార్యక్రమంలో ముందుగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమం అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్ ను మంత్రి, ఎంపి లు సందర్శించి తినుబండారాలను రుచి చూసి నిర్వాహకులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో బంటుమిల్లి జెడ్పీటీసీ మలిసెట్టి వెంకట రమణ, బంటుమిల్లి ఎంపిపి వెలివెల చినబాబు, బంటుమిల్లి ఎంపిడిఓ స్వర్ణ భారతి, బంటుమిల్లి తాసిల్దారు సత్యనారాయణ, ఏఎంసి చైర్మన్ పాలడుగు బాబురావు, వివిధ గ్రామాల సర్పంచ్ లు సుజ్ఞానం కృష్ణవేణి, పామర్తి వీరవెంకటేశ్వరరావు, బండారు చంద్రశేఖర్, గొల్లా బాలస్వామి, పార్టీ మండల కన్వీనర్ రాజబాబు వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *