-ఎమ్మెల్యే పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం వంటి ఎన్నో సుగుణాలను మనం తల్లి నుంచే నేర్చుకుంటామని, ఒక మనిషి ఎదుగుదలకు మాతృమూర్తి పాత్ర ఎంతో కీలకమని, అటువంటి మహిళలు, మాతృమూర్తుల సంక్షేమం కోసం జగనన్న ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ మంత్రివర్యులు, జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) వక్కాణించారు. ఆదివారం ఆయన మచిలీపట్నం మార్కెట్ యార్డులో నిర్వహించిన వైయస్ఆర్ చేయూత వారోత్సవాలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.వైఎస్ఆర్ చేయూత పధకం క్రింద మచిలీపట్నం నగరపాలక పరిధిలో అర్హులైన 6,900 మంది అక్కచెల్లెమ్మలకు 12 కోట్ల 94 లక్షల రూపాయల విలువైన చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్ని నాని వేలాదిమంది మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ, అమ్మ.. మన పుట్టుకకు చిరునామా అని… మన బతుకుకు వీలునామా అన్నారు. అమ్మ గొప్పతనం, ఆమె త్యాగం అజరామరం. ఆమె సహనం అనంతం అన్నారు.అమ్మ ఉంటే మనకో భద్రత, భరోసా. అమ్మ ఒడికన్న ప్రశాంతమైన ప్రదేశం బహుశా ఎక్కడా ఉండదేమోని మాతృమూర్తి త్యాగాన్ని కొనియాడారు. తమ భర్తలు చనిపోతే, పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలకోర్చి వారిని చదివించి ప్రయోజకులను ఎందరో చేశారన్నారు. మహిళలకు కుటుంబం పట్ల ఉన్న ప్రేమాభిమానాలు, బిడ్డల అభ్యున్నతి కోసం వారి త్యాగనిరతి, కష్టపడే తత్వం ఆసామాన్యమన్నారు పేద అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన, సాధికారతే లక్ష్యంగా వరుసగా మూడో ఏడాది వైయస్ఆర్ చేయూత కింద సాయాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు తోబుట్టువుగా ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయం చేయడం ద్వారా చిన్న మధ్య తరహా వ్యాపారాలకు ఉపయోగించుకొని తమ జీవనోపాధిని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో వైయస్సార్ చేయూత పథకం ద్వారా ఈ మూడు సంవత్సరాల్లో 20,695 మంది లబ్ధిదారులకు రూ.38.8 కోట్ల రూపాయల పంపిణీ చేయబడిందని తెలిపారు.
అనంతరం మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ డివిజన్లకు చెందిన సప్పా అరుణ, పిట్టల రేవతి, బంటుమిల్లి పద్మావతి, మద్దాల రాజకుమారి, కేశన రంగమణి, ఘంటసాల వెంకటేశ్వరమ్మ, జమ్మల విజయా సీతారత్నం, షేక్ నాగుల్ మీరా,పేరూరు శ్యామల, కుంభా వరలక్ష్మి, యర్రా లక్ష్మీ సరస్వతి, దొంతు మరియమ్మ, విశ్వనాథపల్లి నిర్మల కుమారి, గోనెల రత్నకుమారి, చింతా భవాని, జోగి జ్యోతి, ఆకురాతి పద్మ, కుమ్మరి సీతాదేవి, దాసరి విజయ రాణలు మూడో విడత వైయస్సార్ చేయూత సహాయంతో తాము ఏ విధంగా ఆర్థిక స్వావలంబన చెందేమో తమ వ్యాపార అనుభవాలను సభాముఖంగా అందరితో పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు లంకా సూరిబాబు, తంటిపూడి కవిత నోబెల్ థామస్, ముడా చైర్మన్ బొర్రా నాగ దుర్గ భవాని విఠల్, మచిలీపట్నం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా, మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ జి. చంద్రయ్య, వివిధ శాఖల అధికారులు, పలు డివిజన్ల కార్పొరేటర్లు , వివిధ డివిజన్ల సచివాలయ ఉద్యోగులు, వార్డు వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News