-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు తమ సమస్యలు సచివాలయ వ్యవస్థ ద్వారా పరిష్కారం అవుతాయని ఎంతో నమ్మకంతో సచివాలయాలకు వచ్చి ఆర్జీలను సమర్పిస్తున్నారని వాటిని పరిష్కరించి మెరుగైన సేవలందించడం ద్వారా సచివాలయ వ్యవస్థకు మరింత వన్నె తెచ్చేలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. విజయవాడ కృష్ణలంక రాణిగారి తోట 18వ డివిజన్ సిమెంట్ గౌడౌన్ సమీపంలోగల 82,83 వార్డు సచివాలయాలను బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలను వుంచాలని లక్ష్యంతో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థపై ప్రజలు ఎంతో నమ్మకం వుంచారన్నారు. వారి నమ్మకాన్ని మరింత పెంచేలా సిబ్బంది పనితీరు ఉండాలన్నారు. ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు సచివాలయ సెక్రటరీలు చర్యలు తీసుకోవాలన్నారు. 82వ వార్డు సచివాలయం పరిధిలో 405 మంది లబ్దిదారులకు అమ్మఒడి పథకం మంజూరు కాగా వీరిలో ఇంకను 76 మందికి అమ్మఒడి నగదు జమ చేయకపోవడం సరికాదన్నారు. నగదు జమ చేయకపోవడానికి గల కారణాలతో తక్షణమే నివేధిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయాల పరిధిలో చిరువ్యాపారస్తుల పేర్లను సేకరించి జాబితాను సిద్దం చేయాలన్నారు. చిరువ్యాపారస్థులకు సమీపంలోని బ్యాంకుల ద్వారా జగనన్న తోడు పథకం కింద రుణాలు మంజూరు చేసేలా కృషి చేయాలన్నారు. సచివాలయ పరిధిలోగల వాలంటీర్లతో సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు. ప్రజలకు సరైన సమాచారం సచివాలయ సేవలందించడంలో అలసత్వం వహించే వాలంటీర్లను తొలగించేందుకు వెనకాడబోమన్నారు. సచివాలయ భవనం ముందు వరద నీరు చేరడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ గ్రావిల్‌తో మెరక చేయాలని పరిసర ప్రాంతంలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. సచివాలయాల తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట సెంట్రల్ తహాశీల్థార్ వెన్నెల శ్రీను సచివాలయ సిబ్బంది ఉన్నారు.