-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్
-రాజ్ భవన్ లో టిబి సేల్ సీల్ క్యాంపెయిన్ ప్రారంభించిన గవర్నర్
-టిబి నివారణలో ప్రతిభ చూసిన వారిని సన్మానించిన హరిచందన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాని పిలుపు మేరకు క్షయ వ్యాధి నివారణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. క్షయ రహిత సమాజమే మన ముందున్న ధ్యేయమని, లక్ష్య సాధన కోసం ప్రభుత్వంతో స్వచ్ఛంధ సంస్ధలు కలిసి రావాలని పిలుపు నిచ్చారు. విజయవాడ రాజ్ భవన్ దర్బార్ హాలు వేదికగా గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ క్షయ సంఘం ఆధ్వర్యంలో 73వ టిబి సీల్ సేల్ క్యాంపెయిన్ ను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిచందన్ మాట్లాడుతూ టిబి సీల్ విక్రయాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. సంఘం గౌరవ కార్యదర్శి డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం చేసే కృషికి అదనంగా టిబి ఆసోషియేషన్ తన వంతు సహకారం అందిస్తుందని వివరించారు. టిబి సీల్స్ ద్వారా సమకూరే వనరులను రోగుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రధానంగా వ్యయం చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మెరుగైన పనితీరు కనబరిచిన సభ్యులను గవర్నర్ సత్కరించారు. అత్యధికంగా సభ్యుల నమోదు సహకరించిన డాక్టర్ పి జయకర్ బాబు, గణనీయమైన మొత్తంతో ప్యాట్రన్ సభ్యునిగా చేరిన డాక్టర్ పిఎస్ శర్మ, మెరుగైన పనితీరును ప్రదర్శిస్తున్న సంస్ధగా ఎఎంజి ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్ లకు గవర్నర్ మెమొంటో అందించారు. వ్యక్తిగత అవార్డులు అందుకున్న వారిలో డాక్టర్ ఎస్ ఎన్ మూర్తి, డాక్టర్ మసిలమణి, సునీత్, రవి విక్టర్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, రాజ్ భవణ్ సంయిక్త కార్యదర్శి సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.