-కాకినాడ జె.ఎన్.టి.యూ. ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐ.ఐ.ఎఫ్.టి. క్యాంపస్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి
-ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్
-వచ్చే 25 ఏళ్ళ అమృత కాలంలో ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదగగలదని విశ్వాసం
-స్థానిక ఉత్పత్తులకు, వృత్తి కళాకారులు ప్రోత్సాహం అందించటం అత్యంత ఆవశ్యకం
కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమ్మిళిత ఆర్థిక వృద్ధి, సమష్టి కృషితో భవిష్యత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదగగలదని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, టెక్స్ టైల్స్ శాఖల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కాకినాడ జేఎన్‌టీయూ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐ.ఐ.ఎఫ్.టి క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం జేఎన్‌టీయూ అల్యుమినీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక శ్రద్ధ, చొరవ కారణంగానే కాకినాడలో ఐ.ఐ.ఎప్.టి. క్యాంపస్ ఏర్పాటు సుసాధ్యమైందన్న పీయూష్ గోయల్, ఈ క్యాంపస్ ఏర్పాటు సరికొత్త అధ్యాయానికి నాంది పలికిందని తెలిపారు. భారతీయ వాణిజ్యానికి భవిష్యత్తులో మరింతగా అంతర్జాతీయ గుర్తింపు రావాలంటే నిపుణులైన మేనేజ్‌మెంట్ మానవ వనరులు అవసరమని పేర్కొన్నారు. ఈ మానవ వనరులు ఐఐఎఫ్‌టీల ద్వారా అందుబాటులోకి రానున్నాయని.. భాగస్వామ్య పూర్తితో అడుగేస్తే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, రాజకీయ సుస్థిరత, అత్యున్నత పోటీతత్వం, సమష్టి కృషికి నెలవైన భారత్ గౌరవ ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి సీతారామన్ వంటి సమర్థవంతమైన వారి నేతృత్వంలో ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు.
ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ 3.5 ట్రిలియన్ అమెరికా డాలర్లుగా ఉందని.. వచ్చే 25 ఏళ్ల అమృత్ కాలంలో ఈ ఆర్థిక వ్యవస్థను పది రెట్లు పెంచేలా కృషిచేస్తే వందేళ్ల స్వాతంత్ర్య భారత్ ఆవిష్కృతం కానున్న 2047 నాటికి 30 ట్రిలియన్ అమెరికా డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దాలనే దార్శనిక లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేమీ కాదన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ప్రత్యేక బడ్జెట్‌లు దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం, సుసంపన్నం చేశాయని, సమ్మిళిత ఆర్థిక వృద్ధి, సమష్టి కృషితో అభివృద్ధి చెందుతున్న దేశాన్ని అభివృద్ధి చెందిన దేశం స్థాయికి తీసుకెళ్లొచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం, మత్స్య తదితర రంగాల్లో ఎంతో వృద్ధి సాధిస్తోందని.. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఉన్నాయన్నారు. నిపుణులైన మానవ వనరులను అందుబాటులోకి తేవడం ద్వారా మరింత అభివృద్ధిని సాధించొచ్చన్నారు. స్థానిక ఉత్పత్తులను, హస్త కళాకారులను, వృత్తి నైపుణ్యమున్న చేనేత కార్మికులు వంటి వారిని ప్రోత్సహించాలని.. వారికి అన్ని విధాలా మద్దతుగా నిలబడటం ముఖ్యమని మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు బి. రాజేంద్ర నాథ్ రెడ్డి, కె. వెంకట నాగేశ్వర రావు, సి.హెచ్. వేణుగోపాల కృష్ణ, డి. రాజా, పార్లమెంట్ సభ్యులు వంగ గీత, జి.వి.ఎల్. నరసింహా రావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎం. భరత్ రామ్ సహా పలువురు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.