-జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక దృష్టి పెట్టి మెరుగైన వైద్య సహాయం అందించి మాతా శిశు మరణాలను పూర్తిగా నివారించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు వైద్యాధికారులను సిబ్బందిని ఆదేశించారు. మాతా శిశు మరణాల నివారణపై శుక్రవారం కలెక్టర్ కార్యాయంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరం నందు కలెక్టర్ డిల్లీరావు జిల్లాకు చెందిన వైద్యాధికారులు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల బూచవరం పిహెచ్సి కె. మాధవి విజయవాడ సీతన్నపేట అర్భన్ హెల్త్ సెంటర్ పరిధిలో ఎస్ శాంతి అనే మహిళలు ప్రసవ సమయంలో మరణించడం జరిగిందని అలాగే విజయవాడ క్రీస్తురాజుపురం అర్భన్ హెల్త్ సెంటర్లో వెంకమ్మ, బూచవరం పిహెచ్సిలో వి సరిత, కె. లావణ్య, వెలగలేరు పిహెచ్సి పరిధిలో తెనాలి అదిలక్ష్మిలకు ప్రసవ సమయంలో వారికి జన్మించిన బిడ్డలు మరణించడానికి గల కారణాలను సంబంధిత వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాలలో గర్భిణీ స్త్రీలను గుర్తించి వారికి ఎప్పటికప్పడు ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి అవసరమైన వారికి మెరుగైన వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆశా వర్కులు, అంగన్వాడీ కార్యక్రర్తలు గర్భిందాల్చిన స్త్రీలను తొలి మాసాలలోనే గుర్తించి వారికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించి ఎటువంటి రుగ్మతులను గురి కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే తల్లి ఆరోగ్యంతో పాటు పుట్టబోయే శిశువు ఆరోగ్య ఎదుగుదలకు దోహదపడుతుందన్నారు. ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేసి అత్యాధునిక వైద్య పరికరాలు నాణ్యత ప్రమాణాలతో కూడిన మందులను సరఫరా చేస్తుందని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు అర్భన్ హెల్త్ సెంటర్లలో సేవలందిస్తున్న వైద్యులు గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ద చూపాలని ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. రెడ్డిగూడెం మండలం రెడ్డికుంట గ్రామానికి చెందిన గొల్లపల్లి లక్ష్మి ప్రసవించిన నాలుగు రోజుల అనంతరం అనారోగ్యంతో మరణించడంతో ఆమె భర్త గొల్లపల్లి వెంకటేశ్వరరావుకు ఆర్థిక సహాయం కింద రెండు లక్షల రూపాలయలను మంజూరు చేసేందుకు జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆమోదం తెలిపారు. రెండు లక్షల రూపాయలను పిల్లల పేరున 18 సంవత్సరాల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పత్రాలను అందజేశామని జిల్లా కలెక్టర్ డిల్లీరావు గొల్లపల్లి వెంకటేశ్వరరావుకు వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, డియంహెచ్‌వో డా.యం సుహాసిని, డిప్యూటి డియంహెచ్‌వో డా. నళినిదేవి, ఐసిడిఎస్ పిడి జి. ఉమాదేవి, డిఐవో అమృతం, పిహెచ్సి వైద్యులు డా. ఎన్ అనీల్, డా. ఇబ్రహీం, డా. ఎస్ రమేష్‌బాబు, డా. సిహెచ్ సందీప్, డా. పద్మావతి, డా. సూర్యశ్రీ, డా పి హిమబిందు, డా. కె. ఇందిరా, డా. ఉషశ్రీ, పిహెచ్సిల సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News