-మండల టీమ్ లు ఉత్సాహంగా పనిచేయాలి…
-అధికారుల మధ్య సమన్వయం ఉండాలి…
-మహిళా పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి…
-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా పాల సేకరణ పెంచే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ యస్. డిల్లీ రావు సంబంధిత అధి కారులను ఆదేశించారు.
నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జగనన్న పాలవెల్లువపై ఎంపీడీవోలు, తహాసిల్దార్లు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, సహకార శాఖ రూట్ ఇన్చార్జులు, ఎపిఎం లకు అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ జగనన్న పాల వెల్లువ లో భాగంగా పాడి పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. డైరీ అభివృద్ధి కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ వారి సహకారంతో పాడి రైతులకు గిట్టుబాటు ధరతో ఆర్థిక భరోసా కల్పిస్తోందని అన్నారు. పాల సేకరణ మరింత పెరగాలన్నారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో ఆశించిన స్థాయిలో పాల సేకరణ జరగటం లేదని గుర్తించడం జరిగిందన్నారు దీనిపై మండల స్థాయి టీములు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో 5,449 మంది పాల ఉత్పత్తిదారులు ఉన్నారని వీరు రోజుకి కనీసం రెండు లీటర్లు పాలను సేకరించినా నెలకు మూడు లక్షల లీటర్లతో 9 నెలలలో 27 లక్షలు లీటర్ల పాల సేకరణ జరగవలసి ఉండగా నేటి వరకు పది లక్షల లీటర్ల పాలను మాత్రమే సేకరించడం జరిగిందని, మధ్య వ్యత్యాసంపై దృష్టి పెట్టాలన్నారు. డివిజన్ స్థాయిలో పశుసంవర్ధ శాఖ, డైరీ డెవలప్మెంట్ అధికారులు వారంలో ఒకరోజు సమీక్షించాలన్నారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, తహాసిల్దార్లు, పశుసంవర్ధక శాఖ సెక్రటరీలు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని, అందరి మధ్య సహకారం ఉండాలన్నారు. ప్రస్తుత శీతాకాలం సీజన్లో పాలు పుష్పలంగా ఉంటాయని పూర్తిస్థాయిలో ఆ పాలను సేకరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అధిక పాలన ఇచ్చే పశు జాతులు ఉన్నప్పటికీ పాల సేకరణ ఆశించిన స్థాయిలో లేకపోవడంపై అధికారులు సమీక్షించుకోవాలన్నారు. జిల్లాలో తిరువూరు, గంపలగూడెం, ఏ కొండూరు, విస్సన్నపేట, మైలవరం, రెడ్డిగూడెం, జి కొండూరు మండలాల్లోని 96 ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్ల (ఏఎంసియుల) ద్వారా పాల సేకరణ జరుగుతుందని, అయితే కొన్ని ఏఎంసీయుల పరిధిలోని సొసైటీల పాల సేకరణ పనితీరు ఆశించిన స్థాయిలో లేదన్నారు. జగనన్న పాలవెల్లువ పథకం ద్వారా పాలకు గిట్టుబాటు ధర, మహిళా పాడి రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న పాల వెల్లువ పథకాన్ని తీసుకువచ్చారని, ఈ పథకాన్ని అధికారులు సహకారంతో సమర్వంతంగా నిర్వహించి జిల్లాను జగనన్న పాల వెల్లువ పథకంలో అగ్రగామగా నిలపాలని కలెక్టర్ ఢిల్లీ రావు అధికారులను కోరారు.
జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ మాట్లాడుతూ మహిళా పాడి రైతులకు గిట్టుబాటు ధరతో సుస్థిర ఆర్థికాభివృద్ధి కల్పించి వారిని బలోపేతం చేసేలా జగనన్న పాల వెల్లువ పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. కేడీసీసీ బ్యాంకు ద్వారా కోటి 68 లక్షల రూపాయలను 540 మంది లబ్ధిదారులకు వర్కింగ్ క్యాపిటల్ గా మంజూరు చేశామన్నారు. జిల్లాలో అత్యధికంగా లీటరుకు రూ.79.20పైసల వరకు చెల్లించామన్నారు. పాల సేకరణను మరింత పెంచే విధంగా పశుసంవర్ధక, సహకార, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. మండల, గ్రామస్థాయి టీమ్ లు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. చెల్లింపులు విషయంలో పాడి రైతుకు నష్టం జరగకుండా చూడాలన్నారు. ప్రతీ పాడి రైతునుండి పాలను సేకరించేలా వాలంటీర్లు పర్యవేక్షించాలని జాయింట్ కలెక్టర్ అన్నారు.
శిక్షణ,అవగాహన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అదితి సింగ్, తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రసన్న లక్ష్మి, జిల్లాపశుసంవర్ధక శాఖ అధికారి డా. కే విద్యాసాగర్,, జిల్లా పంచాయతీఅధికారి జె సునీత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం. విజయభారతి, జిల్లా కో పరేటివ్ అధికారి సిహెచ్. శైలజ, వ్యవసాయ, పశుసంవర్ధక ,జిల్లా గ్రామీణాభివృద్ధి, సహకార శాఖ అధికారులు పాల్గొన్నారు.