– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
-01వ డివిజన్ 003 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న నవరత్నాల పథకాల పట్ల ప్రజలు పూర్తిస్థాయి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. శనివారం 01 వ డివిజన్ – 003 వ వార్డు సచివాలయం పరిధిలో స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీతతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. మధ్యకట్టలో విస్తృతంగా పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. 307 గడపలను సందర్శించి.. ఏ ఇంట్లో ఏఏ పథకాల ద్వారా ఎంత మేర లబ్దిచేకూరిందో వివరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన కరపత్రాలను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని పరామర్శించి ధైర్యం చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా జగనన్న ప్రభుత్వం చేస్తున్న విప్లవాత్మకమైన సేవలకు దేశం మొత్తం అభినందిస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. ఏ సంక్షేమ పథకమైనా, సమస్య ఎటువంటిదైనా వాలంటీర్లను అడిగితే పరిష్కారం లభిస్తుందనే నమ్మకం ఈ మూడేళ్లలో ప్రజలలో బలంగా ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. అలాగే బుడమేరు కాలువలో పేరుకున్న చెత్త, తూటికాడను తొలగించవలసిందిగా సిబ్బందిని ఆదేశించారు.
గుణదల సర్వతోముఖాభివృద్ధికి విశేష కృషి
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు తెలిపారు. ఒకటవ డివిజన్లో దాదాపు రూ. 4 కోట్ల నిధులతో అంతర్గత రహదారులను నిర్మించినట్లు వెల్లడించారు. ఎంప్లాయిస్ కాలనీలో రూ. 1.50 కోట్లతో వాటర్ లైన్ పనులు జరుగుతున్నట్లు వివరించారు. అలాగే ఈ ప్రాంతంలో ప్రజల తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రూ. 4 కోట్లతో ఓవర్ హెడ్ ట్యాంక్, రూ. 3.30 కోట్లతో పంపింగ్ మెయిన్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే టెండర్లను పిలవడం జరిగిందని.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. పప్పుల మిల్లు వద్ద రూ. 6 కోట్ల నిధులతో డబుల్ లేన్ వంతెన నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయగా.. త్వరలో టెండర్లు పిలుస్తామని తెలిపారు. మరోవైపు గుణదల ఆర్వోబీ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలనే కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వ అలసత్వం, చేతగానితనం వల్ల అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. కానీ గుణదల ఆర్వోబీపై ప్రత్యేక శ్రద్ధతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.23 కోట్ల నిధులను మంజూరు చేశారని వెల్లడించారు. స్టేజ్ -2 పనులకు సంబంధించి నాబార్డు ద్వారా సుమారు రూ. 90 కోట్ల నిధులు మంజూరు అయినట్లు వివరించారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ కు ఎక్కడా అంతరాయం ఏర్పడకుండా.. రామకృష్ణాపురం నుంచి దేవీనగర్, దావుబుచ్చయ్య కాలనీ, ఉలవచారు కంపెనీ మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు ప్రధాని రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఉలవచారు కంపెనీ నుంచి ఇన్నర్ రింగ్ వరకు రోడ్లను అనుసంధానం చేయడం జరిగిందన్నారు.
ప్రతిపక్షాలకు పొత్తులపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదు
తెలుగుదేశం గత ఐదేళ్ల పాలనలో ప్రజలకు చేసింది శూన్యమని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు పేర్కొన్నారు. చంద్రబాబు పాలన అంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికే సరిపోయిందని.. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆయన జపమే చేస్తున్నారని దుయ్యబట్టారు. చివరకు పార్టీ లేదు, బొ.. లేదు అని చెప్పిన అచ్చెన్నాయుడు కూడా వైఎస్సార్ సీపీపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని మల్లాది విష్ణు అన్నారు. ముగ్గురు కలిసి పోటీచేస్తే స్వల్ప తేడాతో ఆనాడు చంద్రబాబు గెలిచారని.. అదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లతో చరిత్ర సృష్టించారన్నారు. కనుక ఫేక్ ముఖ్యమంత్రి ఎవరో అచ్చెన్నాయుడు విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఇకనైనా ప్రజలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రిపైన దిగజారుడు విమర్శలు మానుకోవాలని.. లేనిపక్షాన ప్రజలంతా ఏకమై తరిమితరిమి కొడతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలకు పొత్తులపై ఉన్న శ్రద్ధ.. ప్రజలపై లేదని మల్లాది విష్ణు విమర్శించారు. ప్రశాంత విశాఖలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా.. ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అటువంటి దుష్టశక్తులపై ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, నాయకులు కొండా మహేశ్వర్ రెడ్డి, ఆళ్ల ప్రసాద్ రెడ్డి, ఉద్ధంటి సురేష్, ఆర్టీసీ శ్రీను, సత్యవతి, నాగరాజు, ఎల్ఐసి శివ, యలమంద, తుంగం ఝాన్సీ, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.