-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు మొక్కలు నాటడాన్ని ప్రతీ పౌరుడు తన సామాజిక బాధ్యతగా భావించాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మధురానగర్ U.V నరసరాజు రోడ్డు కృష్ణుడు గుడి వద్ద మొక్కలు నాటు కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొన్నారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మానవాళి మనగడ పచ్చదనం పరిఢవిల్లితేనే సాధ్యమవుతుందన్న విషయాన్ని బాధ్యతగల పౌరులందరూ గ్రహించాలని కోరారు. ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించడం ద్వారానే మనిషి మనుగడ సరైన మార్గంలో ముందుకు సాగుతుందని తెలియజేశారు. మొక్కలు నాటడంతో భారీ ఉష్ణోగ్రతలను నియంత్రించవచ్చని చెప్పారు. రాష్ట్రాన్ని ఆకుపచ్చని ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పమని.. కనుక ప్రతిఒక్కరూ ఉద్యమ స్ఫూర్తిని చాటి జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడంతో సరిపెట్టకుండా ట్రీ గార్డులతో ప్రతి ఒక్క మొక్కను సంరక్షించి జీవావరణాన్ని కాపాడాలని కోరారు. కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ ఆవశ్యకత ప్రతిఒక్కరికీ తెలిసి వచ్చిందని మల్లాది విష్ణు అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో 10 వేల మొక్కలను నాటేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటుతుండటంతో క్రమంగా నియోజకవర్గంలో పచ్చదనం పెరుగుతోందన్నారు. మన పెద్దలు మనకు అందించిన స్వచ్ఛమైన పర్యావరణాన్ని, యధావిధిగా మన ముందు తరాలకు అందించేందుకు ప్రతిఒక్కరూ ప్రతిన బూనాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలను నాటారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, కార్పొరేటర్లు కొంగితల లక్ష్మీపతి, పెనుమత్స శిరీష సత్యం, వైసీపీ నగర మహిళ అధ్యక్షురాలు పిల్లి కృష్ణవేణి, నాయకులు కంభం కొండలరావు, చీమల గోవింద్, ఆర్.కృష్ణ, ఎస్.కె.బాబు, అక్బర్, నాగూర్ వలి, సుధాకర్, చినబాబు, తదితరులు పాల్గొన్నారు.