Breaking News

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి వినూత్న పథకాలు

-ఇతర గురుకులాల్లో లేని విధంగా ఎస్సీ గురుకులాల్లో ప్రత్యేక కార్యక్రమాలు
-ఆధునిక పద్ధతుల్లో విద్యాబోధనలు
-ఆరోగ్యాల పరిరక్షణకు సునిశిత పరీక్షలు
-ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో శిక్షణలు
-మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ఇతర గురుకులాల్లో లేనివిధంగా ఎస్సీ గురుకులాల్లో విద్యార్థులకు విద్య, వైద్యం, ఆరోగ్యాల మెరుగుదల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. విద్యార్థులతో పాటుగా అధ్యాపకుల వికాసానికి అవసరమైన ప్రత్యేకమైన చర్యలు కూడా చేపట్టామని తెలిపారు.
ఎస్సీ గురుకులాల్లో ప్రత్యేకంగా చేపడుతున్న కార్యక్రమాలను గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నాగార్జున వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు అన్ని విధాలుగా విద్యార్థులను అభివృద్ది చేయడానికి అవసరమైన కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతోందన్నారు. అజీం ప్రేమ్ జీ యూనివర్సిటీ, టీసీఎస్, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, టీసీఎస్, ఈ విద్యాలోక్, వాయిస్ ఫర్ గర్ల్స్ లాంటి ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే విద్యాభివృద్ధిలో భాగంగా సూక్ష్మస్థాయి పరిశీలన కోసం వారాంతపు పరీక్షలను నిర్వహించే ప్రక్రియను గత నెలలో ప్రారంభించామని చెప్పారు. 5 నుంచి 10వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు మ్యాథ్య్, సైన్స్, ఇంగ్లీష్ లలో వాలంటీర్ల ద్వారా వీడియో క్లాసులు, లైవ్ క్లాసులను నిర్వహిస్తున్నామని, గత ఆగష్టు నుంచి ఇప్పటి వరకూ 395 లైవ్ క్లాస్ లను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఎస్సీ గురుకులానికి చెందిన పూర్వ విద్యార్థులలో ఐఐటి, మెడికల్ విద్యలను అభ్యసించిన వారితో స్వచ్ఛందంగా జేఇఇ, నీట్ పరీక్షలకు సంబంధించిన అంశాల బోధన చేయిస్తున్నామన్నారు. విద్యార్థులలో దాగిన ప్రతిభను వెలికి తీయడానికి ‘విద్యార్థి విద్యాన్ మంతన్’ అనే కార్యక్రమాన్ని ఎన్.సి.ఆర్.టి సహకారంతో అమలు చేస్తున్నామని నాగార్జున వెల్లడించారు. నేషనల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్(ఎన్ఎస్ఐసి) పథకం ద్వారా 8వ తరగతి విద్యార్థులతో సమాజంలోని సమస్యల పరిష్కారాన్ని సూచించే ప్రయోగాలను చేయించడం జరుగుతోందన్నారు. కెన్నడీ-లూగర్ యూత్ ఎక్స్చేంజ్ (కేఎల్ వైఈస్) ప్రోగ్రాంలో భాగంగా ప్రతిభ కలిగిన విద్యార్థులు ఒక ఏడాది పాటు ఉచితంగా అమెరికా లో విద్యాభ్యాసం చేసి తమ ప్రతిభను మెరుగుపర్చుకొనే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ పథకంలో ఎంపిక కావడానికి విద్యార్థులకు అవసరమైన తర్ఫీదును ఇవ్వడం జరుగుతుందన్నారు. 2022-23 విద్యాసంవత్సరంలో ఈ పథకం ద్వారా 3 విద్యార్థులు ఈ పథకానికి ఎంపిక కాగా, 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఇప్పటి వరకూ 100 మంది విద్యార్థులు తొలిదశలో ఎంపిక కావడం జరిగిందని వివరించారు. టీసీఎస్ సహకారంతో 5 నుంచి 8వ తరగతి విద్యార్థులలో సామర్థ్యాల పెంపుదల (కెపాసిటీ బిల్డింగ్) కార్యక్రమాలను 50 గురుకులాల్లో చేపట్టడం జరిగిందని తెలిపారు. దృష్టి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించి అవసరమైన చికిత్సలు చేయడానికి నేత్ర పరీక్షలను చేయడం జరుగుతోందని ఇప్పటి వరకూ 71 గురుకులాల్లో ఈ పరీక్షల నిర్వహణను పూర్తి చేసామని నాగార్జున వెల్లడించారు. వైయస్సార్ కంటి వెలుగు, ఎన్పీసీబీ బృందాల ద్వారా మిగిలిన గురుకులాల్లోనూ నేత్ర పరీక్షలు కొనసాగుతున్నాయని చెప్పారు.
అనీమియాతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించి అవసరమైన చికిత్సలను అందించడంలో భాగంగా ఇప్పటి వరకూ 185 గురుకులాలకు చెందిన 91,548 మంది విద్యార్థులకు పరీక్షలను పూర్తి చేసామని తెలిపారు. వాయిస్ ఫర్ గర్ల్స్ సంస్థ ఆధ్వర్యంలో కౌమార దశలోని బాలికలకు సమాజంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలపై శిక్షణ ఇస్తున్నామని ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాలకు చెందిన 800 మంది బాలికలకు ఇప్పటికే ఈ శిక్షణను పూర్తి చేసామని వెల్లడించారు.
పోషకాహార లోపంతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించే కార్యక్రమాన్ని కూడా గురుకులాల్లో చేపట్టడం జరిగిందని
ఇప్పటి వరకూ 96,771 మంది విద్యార్థులకు ఈ పరీక్షలు పూర్తి చేసామన్నారు. విద్యార్థులలో పోషకాహార లోపం తలెత్తకుండా పోషక విలువతో కూడిన రుచికరమైన ప్రత్యేకమైన మెనూ ను గురుకులాల్లో అమలు చేస్తున్నామని చెప్పారు.
విద్యార్థులలో పంటి సమస్యలను గుర్తించడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామని, ఇప్పటి వరకూ 48 గురుకులాల్లో ఈ కార్యక్రమం పూర్తయిందని తెలిపారు. విద్యార్థులలో మానసిక ఆరోగ్య సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి వీలుగా బోధన, బోధనేతర సిబ్బందికి ముంబాయికి చెందిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషియల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నామని ఇప్పటి వరకూ 7 జిల్లాలకు చెందిన సిబ్బందికి ఈ శిక్షణను ఇచ్చామని, రాబోయే డిసెంబర్ 15 నాటికి మిగిలిన సిబ్ది అందరికీ ఈ శిక్షణను పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. అలాగే గురుకులాల్లోని తెలుగు,హిందీ టీచర్లకు ఇంగ్లీష్ బోలో యాప్ ద్వారా వంద రోజుల పాటు ఇంగ్లీష్ లో ప్రావీణ్యం సంపాదించే శిక్షణను ఇస్తున్నామని నాగార్జున చెప్పారు. అజీం ప్రేమ్ జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రస్తుతం గురుకులాల్లో అమలు చేస్తున్న సీబీఎస్ఇ విద్యా విధానంపై 8వ తరగతికి చెందిన టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *