– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. తెలుగు కళారంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. నటశేఖరుడి మరణంతో సుదీర్ఘ నటనా ప్రస్థానంలో ఓ శకం ముగిసిందని తెలిపారు. ఐదున్నర దశాబ్దాల పాటు 350 కి పైగా చిత్రాలలో నటించి.. చిత్రసీమలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారన్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా.. కౌబాయ్, జేమ్స్ బాండ్ వంటి ప్రయోగాత్మక చిత్రాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన గొప్ప నటుడిగా కీర్తించారు. ఆయన స్వీయదర్శకత్వంలో నటించి తెరకెక్కించిన అల్లూరి సీతారామరాజు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసిందన్నారు. పాత్ర ఏదైనా తన అద్భుత నటనతో వెండి తెరకు ప్రాణం పోసి ఎన్నో కీర్తి కిరీటాలు అందుకున్నారన్నారు. సినీ రంగంలో క్రమశిక్షణతో కూడిన జీవితానికి సూపర్ స్టార్ కృష్ణ ఒక ఉదాహరణ అని.. ఆయన జీవితం భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. నటశేఖరుని అకాల మరణానికి చింతిస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.