-ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య విధానం అద్భుతం
-జగనన్న ఆలోచనకు క్షేత్రస్థాయిలో అనూహ్య స్పందన
-మూడు వారాల్లోనే 4733 వైఎస్సార్ హెల్త్‌క్లినిక్‌ల రెండు విడతల సందర్శన
-4267 హెల్త్ క్లినిక్‌లు ఒకసారి సందర్శన
-ఇప్పటివరకు 97,011 బీపీ, 66,046 షుగర్ రోగులకు పరీక్షలు
-ఫ్యామిలీ ఫిజిషియన్ విధానంలో 67 రకాల మందులు, 14 రకాల వైద్యపరీక్షలు
-ఖాళీల భర్తీ విషయంలో చొరవగా ఉండాలి
-రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
-ఫ్యామిలీ ఫిజిషియన్ ట్రయల్ రన్‌పై సమీక్ష సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య విధానానికి సంబంధించిన ట్రయల్ రన్ విజయవంతంగా సాగుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. మంగళగిరి, ఏపీఐఐసీ టవర్స్ లోని వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయం, కాన్ఫరెన్స్ హాలులో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఫ్యామిలీ ఫిజిషియన్ ట్రయల్ రన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆలోచనల్లోంచి వచ్చిన గొప్ప కార్యక్రమాల్లో ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య విధానం కూడా ఒకటని తెలిపారు. గత నెల 21వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ట్రయల్ రన్ ప్రారంభమైందన్నారు. ఈ వైద్య విధానం సాగుతున్న తీరు, క్షేత్రస్థాయిలో ఎదరవుతున్న ఇబ్బందులు, ప్రజల నుంచి వస్తున్న స్పందన, వైద్యుల నుంచి వస్తున్న సూచనలు తదితర వివరాలను అధికారుల ద్వారా మంత్రి అడిగి తెలుసుకున్నారు. కేవలం మూడు వారాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 4733 వైఎస్సార్ హెల్త్‌క్లినిక్‌లకు రెండుసార్లు 104 ఎంఎంయూ వాహనాలు వెళ్లాయని, సిబ్బంది రెండు విడతలుగా ఆయా గ్రామాలకే వెళ్లి వైద్య పరీక్షలు అందించారని తెలిపారు. మరో 4267 విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు 104 ఎంఎంయూ వాహనాలు ఒకసారి వెళ్లాయని వివరించారు. ఆయా వాహనాల ద్వారా వైద్య సిబ్బంది ప్రజలకు సంతృప్తి కరమైన వైద్య సేవలు అందించాయని చెప్పారు.
పేదల్లో ఆనందం
ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానానికి సంబంధించి తాను స్వయంగా ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నానని, వారి నుంచి అద్భుతమైన స్పందన కనిపిస్తోందని తెలిపారు. ఎంబీబీఎస్ డాక్టర్ సహా ఆరుగురు సిబ్బంది నేరుగా ఆయా గ్రామాలకే వెళ్లి వైద్య సేవలు అందించడం చాలా గొప్ప విషయమని చెప్పారు. జగనన్న ఆలోచనల వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ఈ వైద్య విధానం ద్వారా ప్రజలకు 67 రకాల మందులు ఉచితంగా అందుతున్నాయని తెలిపారు. 14 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారని చెప్పారు. ఈ వైద్య విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 97,011 మంది బీపీ రోగులు, 66,046 మంది షుగర్ రోగులకు పరీక్షలు చేసి, ఉచితంగా మందులు అందజేశారని తెలిపారు. వీరి ఆరోగ్యంపై ఇక నుంచి ఫ్యామిలీ వైద్య విధానం ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఈ వైద్య విధానానికి ప్రారంభించే నాటికి మెడికల్ ఆఫీసర్లు 86 శాతం మంది అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం 96.5 శాతం మంది అందుబాటులో ఉన్నారని, నిరంతరం నియామకాలు చేపడుతూనే ఉన్నామని, దీనివల్లనే ఇది సాధ్యమైందని వివరించారు.
అతి త్వరలో నూతన ఎంఎంయూలు
నెలలో రెండుసార్లు ప్రతి వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌ను సందర్శించేలా చేయడంలో భాగంగా మరికొన్ని నూతన ఎంఎంయూ వాహనాలను అతి త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి విడదల రజిని ఇతెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు ఎఫ్‌పీసీ యాప్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేసిందని తెలిపారు. రాష్ట్ర, జిల్లా స్థాయి కార్యాలయాల కోసం డ్యాష్ బోర్డును కూడా అభివృద్ధి చేశామన్నారు. మెడికల్ ఆఫీసర్లందరికీ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు అందజేశామన్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్ ట్రయల్ రన్‌లో భాగంగా కొన్ని అంశాలు తన దృష్టికి వచ్చాయన్నారు. ఈ విధానం ద్వారా వైద్య సేవలు అందజేస్తున్న సీహెచ్‌సీల్లోని వైద్యులకు రూరల్ సర్వీసు వెసులుబాటువచ్చేలా చూడాలని చెప్పారు. హెల్త్ క్లినిక్ పరిధిలోని అన్ని గ్రామాలకు 104 ఎంఎంయూ వాహనం వెళ్లేలా, వైద్యసిబ్బంది సేవలు అందించేలా చూడాలన్నారు. ఈ వైద్యవిధానంలో ప్రతిభ చూపుతున్న వైద్యులకు ప్రోత్సాహకాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
నియామకాల విషయంలో చొరవ చూపండి
నియామకాలు నిరంతరం జరిగేలా చూడాలని మంత్రి విడదల రజిని ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే ఈ మేరకు ప్రత్యేక జీవో కూడా జారీ చేశామని తెలిపారు. అనస్తీషియా వైద్యులు ఎక్కడ లేరో చూసి, వెంటనే నియామకాలు చేపట్టాలన్నారు. ప్రతి ఆస్పత్రిలో ఆనస్తీషియా వైద్యులు ఉండేలా సర్దుబాటుచేయాలని ఆదేశించారు. వ్యవధి ఆధారిత సేవలకు గాను వైద్యులను నియమించుకునే విషయమై జిల్లాల కలెక్టర్లకు విధివిధానాలను పంపాలని చెప్పారు. ఆ వైద్యులకు వెనువెంటనే పారితోషికం అందేలా చూడాలని ఆదేశించారు. డిప్యూటీ సివిల్ సర్జన్లను సివిల్ సర్జన్లుగా, సీఏఎస్‌లను డీసీఏఎస్‌లుగా వెంటనే ప్రమోషన్లు చేపట్టాలని చెప్పారు. 2020 విధుల్లో చేరిన సీఏఎస్ స్పెషలిస్టు డాక్టర్లకు పేస్కేల్ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీహెచ్‌సీల్లో ఖాళీగా ఉన్న 572 స్టాఫ్ నర్సు పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలిపారు.