–నేటి నుంచి 26 జిల్లాల్లో పార్టీ సర్వసభ్య సమావేశాలు
-డిసెంబరు 5న జగనన్న ఇళ్లపై రాష్ట్ర వ్యాప్త ధర్నాలు
-9 నుంచి కడపలో స్టీలు ప్లాంట్ కోసం పాదయాత్ర
-12న రైతాంగ సమస్యలపై నిరసనలు
-పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం నిర్ణయం
-మోదీ, జగన్ రాష్ట్రానికి అన్యాయం
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రానికి, ప్రజలకు అడుగడుగునా నిర్లక్ష్యం, ప్రత్యేక హోదా, విభజన అంశాలు అమలు చేయకుండా మోదీ చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈనెల 26న దిల్లీలో ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరగనున్న ధర్నాకు సీపీఐ తరపున సంపూర్ణ మద్దతిస్తున్నామనీ, ప్రత్యక్షంగా పాల్గొంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడిరచారు. ఈ ధర్నాకు సీపీఐ జాతీయ నేతలనూ ఆహ్వానిస్తామన్నారు. రాష్ట్రానికి పదేపదే మోదీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, దీనిని వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీలు, మేధావులు, విద్యార్థి, ప్రజాసంఘాల నేతలు అందరూ స్పందించి దిల్లీకి తరలిరావాలని కోరారు. విజయవాడ దాసరిభవన్లో బుధవారం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులతో కలిసి ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చించామన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ, ఈనెల 17వ తేదీ నుంచి పార్టీ సర్వసభ్య సమావేశాల్ని నిర్వహించనున్నామన్నారు. దేశంలోను, రాష్ట్రంలోను నెలకొన్న రాజకీయ పరిణామాలను క్రింది స్థాయి వరకు తీసుకెళ్లేందుకుగాను ఈ సమావేశాలను ఏర్పాటు చేశామన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే, వాటిపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. ఇటీవల ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చారనీ, విశాఖలో ఆయన రాక సందర్భంగా దాదాపు మూడు లక్షల మందితో భారీ బహిరంగసభను సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ఏర్పాటు చేశారన్నారు. అంత విధిగా మోదీకి జగన్ ప్రభుత్వం రెడ్కార్పేట్ వేసినప్పటికీ, ఆ సభలో రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క అంశంపైనా మోదీ స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. చివరికి రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి అవమానం జరిగేలా మోదీ వ్యవహరించారనీ, కనీసం సీఎం జగన్ పేరునూ ప్రస్తావించలేదని దుయ్యబట్టారు. విశాఖ రైల్వేజోన్, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ తదితర అంశాలపైన ప్రస్తావించడం లేదన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అంశంపై పెద్దఎత్తున ఆందోళన జరుగుతుంటే, దానిపై సీఎం జగన్ గానీ, మోదీ గాని ఆ సభా వేదికగా ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. అదే ప్రధాని మోదీ…తెలంగాణ రాష్ట్రానికి వెళ్లినప్పుడు సింగరేణిని ప్రైవేటీకరించబోమని, దానిపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ వివరించారు. విభజన హామీల్లో భాగంగా కడప స్టీలు ఫ్యాక్టరీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు. ఆ ఫ్యాక్టరీకి సీఎం జగన్ ముచ్చటగా మూడోసారి భూమి పూజ చేశారని, ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేదన్నారు. దీనిని నిరసిస్తూ డిసెంబరు 9వ తేదీ నుంచి ఐదు రోజులపాటు స్టీలు ప్లాంట్ భూమి పూజ చేసిన ప్రాంతం నుంచి కడప కలెక్టరేట్ వరకు పాదయాత్ర జరుగుతుందని, అందులో తనతోపాటు సీపీఐ రాష్ట్ర, స్థానిక నాయకత్వం పాల్గొంటుందని వివరించారు.
ప్రభుత్వం ఆర్భాటంగా పెద్దఎత్తున ప్రచారం చేస్తూ, వేలాది కోట్ల రూపాయల వెచ్చించి జగనన్న కాలనీలు నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చిందన్నారు. ఇళ్లకు స్థలాలు ఇచ్చేటప్పుడు తాము రెండు సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశామని గుర్తుచేశారు. ఆ ఇళ్లను ప్రభుత్వమే కట్టిస్తుందని ప్రకటించి, ఇవాళ లబ్ధిదారులే కట్టుకోవాలన్న నిబంధన విధించడంతో…జగనన్న కాలనీలన్నీ పునాదులకే పరిమితమయ్యాయి. వాటి పరిశీలనకు జనసేన నేతలు వెళ్తే రాజకీయమంటూ వైసీపీ విమర్శించడం అర్థరహితమన్నారు. అనంతపురములో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి సమీక్ష సమయంలో సాక్ష్యాత్తూ అధికారపార్టీ ఎమ్మెల్యేలు, అధికారులు సైతం ఇసుక కొరత ఉందనీ, కట్టుకున్న వారికి బిల్లుల జాప్యం జరుగుతుందంటూ వాపోయారని చెప్పారు. ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలని సీపీఐ సమావేశంలో చర్చించామన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30లక్షల మంది అర్హులైన పేదలున్నారని, వారందరికీ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకుగాను…డిసెంబరు 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా పంట నష్టానికి గురయ్యారని, ఆర్థికంగా చితికిపోయి అప్పులపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు పంటల బీమా సౌకర్యం కల్పిస్తామని సీఎం జగన్ గతంలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. దీంతో లక్షలాది మంది రైతులు దరఖాస్తు చేసుకుంటే, వాటన్నిట్నీ నిలిపివేశారన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల విషయంపై జగన్ వ్యతిరేక ధోరణితో వెళ్లడం తగదని సూచించారు. రైతాంగ సమస్యలపై రైతు సంఘం, సీపీఐ కలిసి డిసెంబరు 12వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చామని, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
21న విశాఖ స్టీలు ప్లాంట్లో సమావేశం: ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు
విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 21వ తేదీన విశాఖ స్టీలు ప్లాంట్లో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ భవిష్యత్తు కార్యాచరణ ఏర్పాటు చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక చైర్మన్ ఓబులేసు చెప్పారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన సందర్భంగా స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేస్తారని రాష్ట్ర ప్రజలంతా ఆశించారన్నారు. ప్రభుత్వ రంగంలోనే విశాఖ స్టీలు ఫ్యాక్టరీ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ…విశాఖ స్టీలు ప్లాంట్ ఉద్యోగులు, కార్మికవర్గం ఏకోన్ముకంగా ఆందోళనకు పిలుపిచ్చాయని గుర్తుచేశారు. దానికి సంఫీుభావంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 11, 12 తేదీల్లో కార్మిక, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు ఆందోళన చేశాయని వివరించారు. మోదీ, జగన్ ఇద్దరూ ప్రభుత్వ రంగ సంస్థలను ఆదానీకి అప్పజెప్పి, తద్వారా వారిద్దరూ ఆర్థిక ప్రయోజనం పొందాలనే దురుద్దేశంతో ఉన్నారనేదీ స్పష్టంగా అర్థమైందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్, జి.ఈశ్వరయ్య, కేవీవీ ప్రసాద్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News