-జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రారంభించిన మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియం నందు ‘అయ్యప్ప మహా సంగమం’ భక్తజన సందోహం నడుమ కన్నులపండువగా జరిగింది. ఈ సందర్భంగా శబరిమల సన్నిధానాన్ని తలపించే రీతిలో ఏర్పాటు చేసిన సభాప్రాంగణం ఆకట్టుకుంది. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచారసభ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. అయ్యప్ప మహా సంగమం నిర్వహణకు విజయవాడ నగరం వేదిక కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ వేడుకలతో నగరం కొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందన్నారు. సుమారు 60 గంటల పాటు నిర్విఘ్నంగా హరిహరపుత్ర అయ్యప్ప స్వామికి విశిష్ట పూజలు నిర్వహించడం ఎంతో మహాభాగ్యమని పేర్కొన్నారు. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఆ శబరిగిరీశుని దివ్య ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. అనంతరం అయ్యప్ప స్వామి దివ్యచరిత్రపై రచించిన పుస్తకాన్ని ఎమ్మెల్యే చేతులమీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, అయ్యప్ప ధర్మ ప్రచారసభ నేషనల్ ప్రెసిడెంట్ అయ్యప్ప దాస్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ లంక బాబు, నేషనల్ జనరల్ సెక్రటరీ బాలాంజనేయులు, స్టేట్ ప్రెసిడెంట్ బెల్లపు హరిప్రసాద్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ చల్లా సుధాకర్, ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ పసుమర్తి సీతారాం, అయ్యప్పలు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.