-పూలే జీవితం స్ఫూర్తిదాయకం: కలెక్టర్
-బడుగు బలహీనర్గాలకు మార్గదర్శకుడు పూలే: ఎమ్మెల్యే భూమన
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జ్యోతి రావు పూలే సేవలు చిరస్మరనీయమని వారి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి మరియు స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం స్థానిక బాలాజీ కాలనీలోని విగ్రహానికి జ్యోతి రావు పూలే వర్దంతి సందర్భంగా పూల మాలలు సమర్పించి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్, స్థానిక శాసన సభ్యులు మరియు ప్రజాప్రతినిధులు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే జయంతి, వర్దంతులను రాష్ట్ర పండుగగా మనం ఎందుకు జరుపుకుంటున్నాము అంటే వారు సమాజంలోని అసమానతలను, కుల వివక్షతను నిర్మూలించి అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారని అందుకే మనం వీరిని స్పూర్తిగా తీసుకుని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో వీరి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాము అన్నారు. కష్ట పడకుండా మనం హక్కులను సాధించుకోలేమని ఉద్యమం చేసి పోరాడితేనే హక్కులు సాదించుకోగలమని వారి జీవితం నుండి మనం గుణపాఠo నేర్చుకోవాలని అన్నారు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చి బాలికల విద్యకు పెద్దపీట వేసిన మహనీయులని కొనియాడారు.
స్థానిక ఎం.ఎల్.ఎ మాట్లాడుతూ సమాజంలో దోపిడీకి, అణచివేతకు, అరాచకానికి గురి అయిన బడుగు బలహీన వర్గాలకు వెన్నెముకగా అండగా నిలిచిన వ్యక్తి పూలే అని అన్నారు. గొప్ప ఉద్యమ రూపకర్తగా వందల సంవత్సరాలుగా అసమానతలు, అసహనం ఈ దేశంలో ఉన్నపటికీ జ్యోతి రావు పూలే రూపంలో ఒక అగ్నిజ్వాల బడుగు బలహీనవర్గాలలో సృజనాత్మక శక్తిని తట్టిలేపి అట్టడుగు వర్గాల కరదీపికగా మార్గదర్శకులు అయ్యారని, శ్రమ దోపిడీని అరికట్టి శ్రామికులకు అండగా నిలిచిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని వారి జయంతి, వర్దంతిని పండుగగా జరుపుకోవడం మన విధి అని పిలుపునిచ్చారు.
అనంతరం స్థానిక జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ డి.కె. బాలాజీ , డి.ఆర్.ఓ. శ్రీనివాసరావు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి యుగంధర్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాలకొండయ్య, జిల్లా అధికారులు పుష్పాంజలి ఘటించిన వారిలో ఉన్నారు.