-గుర్తించిన 14 ప్రాజెక్టులతో.. దేశంలోనే అగ్రగామి ఆంధ్ర ప్రదేశ్ – వెల్లడించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఈఈ
-దేశంలో 73 ఇంధన సామర్ధ్య ప్రాజెక్టులకు గాను రూ 2500 కోట్లు పెట్టుబడుల అంచనా
-ఆంధ్ర ప్రదేశ్ లో 14 ప్రాజెక్టులకు అంచనా వ్యయం రూ 400 కోట్లు
-ఇన్వెస్ట్మెంట్ బజార్ నిర్వహణ కు విశాఖ కు విశిష్ట గుర్తింపు
-బీఈఈ నిర్వహించిన గ్లోబల్ వెబినార్ లో ప్రశంసలు – బీఈఈ డైరెక్టర్
-దేశంలో తొలిసారిగా ఇంధన సామర్ధ్య పెట్టుబడుల సదస్సు నిర్వహించిన ఘనత ఆంధ్ర ప్రదేశ్ — బీఈఈ డీడీజీ
-దేశంలో ఇంధన సామర్ధ్య పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రత్యేకంగా ఒక ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన బీఈఈ
-పరిశ్రమలు, బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల మధ్య బీఈఈ ఫెసిలిటేషన్ సెంటర్ సమన్వయ కర్త గా పనిచేస్తుంది
-పరిశ్రమలు ప్రతిపాదించిన ప్రాజెక్టులకు ఆర్థిక సంస్థల నుంచి రుణాల లభ్యతను సులభతరం చేసేందుకు ఒక ఐటీ పోర్టల్ “అదితి” ని ప్రారంభించిన బీఈఈ
-పరిశ్రమల్లో ఇంధన సామర్ధ్య ప్రాజెక్టులు అమలు చేయటం వల్ల వాటి ఉత్పాదకత, ఆదాయాల మెరుగుదలకు అవకాశం
-ఇంధనం ఆదా , విద్యుత్ , ఇతర ఇంధన వనరుల పై చేసే వ్యయం తగ్గుదల , పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం కొంత మేర అరికట్టబడుతుంది.
-భవిష్యత్ అంతా ఇంధన సామర్ధ్య రంగానిదే
-పరిశ్రమల్లో ఇంధన సామర్ధ్య సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది — బీఈఈ డైరెక్టర్, వినీత కాన్వాల్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశ్రమల్లోఇంధన సామర్ధ్య ప్రాజెక్టులను గుర్తించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రభాగాన నిలిచింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఈఈ విడుదలు చేసిన జాబితా ప్రకారం దేశ వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన పెట్టుబడుల సదస్సుల్లో 73 పారిశ్రామిక ఇంధన పొదుపు ప్రాజెక్టులను గుర్తించగా ,అందులో 14 ప్రాజెక్టులతో ఆంధ్ర ప్రదేశ్ ప్రధమ స్థానం లో నిలించింది. పరిశ్రమల్లో ఈ ప్రాజెక్టులు మున్ముందు అమలు చేయటం వల్ల వాటి ఉత్పాదకత, ఆదాయాలు మెరుగుపడటంతో పాటు ఇంధనం ఆదా అవుతుంది, విద్యుత్ , ఇతర ఇంధన వనరుల పై చేసే వ్యయం తగ్గుతుంది, అలాగే పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం కొంత మేర అరికట్టబడుతుంది. ఇందు కోసం సంపూర్ణంగా సహకరిస్తామని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ ఆంధ్ర ప్రదేశ్ కు హామీ ఇచ్చింది.
దేశంలో తొలిసారిగా పరిశ్రమల్లో ఇంధన సామర్థ్య ప్రాజెక్టులు అమలు చేసే లక్ష్యం తో పెట్టుబడుల సదస్సులు నిర్వహించేందుకు ఆంధ్ర ప్రదేశ్ అంకురార్పణ చేసింది. వరుసగా రెండేళ్లుగా విశాఖపట్నంలో రాష్ట్ర ఇంధన శాఖ కు చెందిన ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసిఎం) ఈ పెట్టుబడుల సదస్సులు నిర్వహించింది. రాష్ట్రంలో విశాఖపట్నం లో గత ఏడాది తొలి సదస్సు నిర్వహించిన అనంతరం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ (బీఈఈ) మరి కొన్ని రాష్ట్రాల్లో ఈ తరహా సదస్సులు నిర్వహించింది.
పారిశ్రామిక రంగంలో విద్యుత్ , ఇతర ఇంధన వనరుల వినియోగాన్ని తగ్గించేందుకు అమలు చేసే ఇంధన సామర్ధ్య ప్రాజెక్టులకు అవసరమైన పెట్టుబడులను సులభంగా అందుబాటులోకి తెచ్చే లక్ష్యంగా పరిశ్రమలు, ఆర్థిక సంస్థలను ఒకే వేదిక పైకి తీసుకు వచ్చే కృషిలో భాగంగా ఈ పెట్టుబడుల సదస్సు నిర్వహించటం జరిగింది.
దేశంలో ఈ తరహా సదస్సు నిర్వహించటం గత ఏడాది నుంచి ప్రారంభం కావడంతో ఇంధన సామర్ధ్య ప్రాజెక్టులు అమలు చేసేందుకు పరిశ్రమలు క్రమంగా ముందుకొస్తున్నాయి . పరిశ్రమలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల మధ్య సమన్వయము కోసం బీఈఈ కొద్ది రోజుల క్రితం ఒక ఫెసిలిటేషన్ సెంటర్ ప్రారంభించింది.
ఇంధన సామర్ధ్య పెట్టుబడుల ప్రక్రియను సులభతరం చేయడానికి ఫెసిలిటేషన్ సెంటర్ ప్రత్యేక వెబ్ పోర్టల్ “అదితి”ని అభివృద్ధి చేసింది. ఈ ఆన్లైన్ పోర్టల్ పరిశ్రమలు ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడానికి బ్యాంక్ ఫైనాన్సింగ్ కోసం ఆన్లైన్ ద్వారా అంగీకార పాత్రలను సమర్పించడానికి వీలు కల్పిస్తుంది. సోమవారం నాడు ఈ పోర్టల్ ను ఇండియన్ హాబీటాట్ సెంటర్ , న్యూ ఢిల్లీ లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసీఎంసీ(బీఈఈ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ మాట్లాడుతూ పెట్టుబడుల సదస్సు ద్వారా దేశ వ్యాప్తంగా గుర్తించిన ఇంధన పొదుపు ప్రాజెక్టులకు రూ 2,500 కోట్లు పెట్టుబడి వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. అత్యధికంగా ఆంధ్ర ప్రదేశ్ లో 14 ప్రాజెక్టులు గుర్తించగా , వీటికి రూ 400 కోట్లు పెట్టుబడి వ్యయం అంచనా వేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులు సిమెంట్, స్టీల్ , పవర్ ప్లాంట్లు , ఫర్టిలైజర్లు , కెమికల్స్ , టెక్స్టైల్స్ రంగాలకు చెందినవని తెలిపారు. రాష్ట్రం నుంచి వచ్చిన మరిన్ని ప్రాజెక్టులు ఇంకా పరిశీలన దశలో ఉన్నాయన్నారు.
అభివృద్ధి చేందుతున్న ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని పరిశ్రమల్లో ఇంధన పొదుపు, ఇంధన సామర్ధ్య సాంకేతిక ప్రాజెక్టులు అమలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు . ఈ ప్రాజెక్టులు అమలు చేయడం వల్ల పరిశ్రమల్లో విద్యుత్, ఇతర వనరులను మెరుగుగా వినియోగించుకునే సామర్థ్యం అభివృద్ధి చెందుతుందన్నారు. దీనివల్ల విద్యుత్ ఆదా అవడం తో పాటు పరిశ్రమల నిర్వహణ వ్యయం కూడా కొంత మేర తగ్గుతుందన్నారు . అలాగే నాణ్యమైన ఉత్పత్తి సాధించడం, ఉత్పాదకత మెరుగుపడటం జరుగుతుందన్నారు. విద్యుత్, ఇతర ఇంధన వనరుల వినియోగం కొంత మేర తగ్గడం వల్ల పరిశ్రమల కాలుష్యం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు.
ఇంధన సామర్ధ్య సాంకేతికత ను వినియోగించుకోవటం వల్ల పరిశ్రమలు దీర్ఘ కాలంలో పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతాయన్నారు. అంతిమంగా ఇది పారిశ్రామిక విస్తరణకు, ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనకు కూడా దోహద పడుతుందని పేర్కొన్నారు. ఇంధన సామర్ధ్య ప్రాజెక్టుల అమలులో చురుకుగా వ్యవహరిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ను అభినందిస్తునట్లు ఆయన తెలిపారు.
భవిష్యత్ అంతా ఇంధన సామర్ధ్య రంగందేనని పరిశ్రమల్లో ఇంధన సామర్ధ్య సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని డైరెక్టర్ తెలిపారు. ఇందుకోసమే పరిశ్రమలో ఇంధన సామార్ధ్యాన్ని పెంపొందించేందుకు పెధ్ద ఎత్తున చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు . దీనిలో భాగంగా ఇంధన సామర్థ్య ప్రాజెక్టులు చేపట్టే పరిశ్రమలకు 5 శాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని ఆంధ్ర ప్రదేశ్ చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.
ఐటీ పోర్టల్‌ను ప్రారంభించిన అనంతరం, దేశ వ్యాప్తంగా గుర్తించపడిన ఇంధన సామర్థ్య ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్‌లు , వాటి పెట్టుబడులు/ప్రాజెక్ట్ ఖర్చులను సంబంధించి ఒక నివేదికను ఏపీఎస్ఈసిఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ చంద్ర శేఖర రెడ్డి తో డీడీజీ బీఈఈ అశోక్ కుమార్ పంచుకున్నారు .
ఈ సందర్భంగా రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ సిఈఓ మాట్లాడుతూ ఇంతమంది భాగస్వాములు ఇంధన సామర్ధ్య ప్రాజెక్టుల అమలుకు , రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడానికి ప్రభుత్వ ప్రతిష్టే కారణమని అన్నారు.
రాష్ట్రంలో ఇంధన సామర్ధ్య కార్యక్రమాల అమలుకు సహకారం అందిస్తునందుకు గాను డైరెక్టర్ జనరల్ ఆఫ్ బీఈఈ మరియు డీడీజీ బీఈఈకి సిఈఓ ఏపీఎస్ఈసిఎం కృతజ్ఞతలు తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఇంధన పొదుపు, ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు అమలు ద్వారా దాదాపు రూ. 3800 కోట్లు విలువైన 5600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేయటం జరిగిందన్నారు. తద్వారా 4.76 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గించగలిగామని తెలిపారు
పగటి పూటే రైతాంగానికి 9 గంటల కరెంటు సరఫరా చేస్తూనే, ముఖ్యంగా పరిశ్రమలకు , గృహాలకు దీర్ఘ కాలం పాటు 24×7 నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటు లో ఉండేలా ప్రస్తుతం ఉన్న వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నొక్కిచెప్పారని ఆయన అన్నారు. ఇందుకోసం ఇంధన సామర్థ్యం ప్రధాన పాత్ర పోషిస్తుందని, పరిశ్రమల్లో ఇంధన వినియోగం, ఇంధన వ్యయాన్ని తగ్గించడంలో, ఉత్పాదకతను పెంచడంలో సహాయపడుతుందని తెలిపారు
జాతీయ స్థాయిలో , రాష్ట్రంలో ఇంధన సామర్థ్య ఫైనాన్సింగ్ ప్రాజెక్టులు గుర్తించబడిన రంగాల గురించి సీఈఓ ఏపీఎస్ఈసిఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌కు వివరించారు.
రాష్ట్రంలో ఇంధన సామర్థ్య ప్రాజెక్టులు మరియు పాట్ పథకం అమలుకు మద్దతు ఇచ్చినందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
బీ ఈ ఈ డైరెక్టర్ వినీత కన్వాల్ మాట్లాడుతూ ప్రస్తుతం వచ్చిన 73 ప్రజెక్టుల ప్రతిపాదనలలో 45 ప్రాజెక్టులను బీఈఈ ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద నమోదైన 22 ఫైనాన్సియల్ ఇంస్టిట్యూట్స్ కి సిఫార్సు చేసింది . వీటిని అమలులోకి తీసుకురావడం వల్ల ఆయా పరిశ్రమల్లో సుమారు 125 ఇంధన సామర్ధ్య సాంకేతిక మార్పులను చేపట్టవచ్చన్నారు. ఇందుకు రూ 2218 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు . దీని వల్ల ఏడాదికి 67.06 లక్షల MWH (మెగా వాట్ అవర్) విద్యుత్ ఆదా అవుతుందని , 49078 మెట్రిక్ టన్నుల బొగ్గు , 2. 56 కోట్ల ఎస్సిఎం సహజ వాయువు, 95000 లీటర్ల హై స్పీడ్ డీజిల్ ఆదా అవుతుందన్నారు. అలాగే 6.2 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయన్నారు.
దేశంలో ఎనర్జీ ఎఫిషియెన్సీ ఫైనాన్సింగ్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో బీఈఈ ప్రత్యేకంగా ఒక ఫెసిలిటేషన్ సెంటర్ (FC)ని ఏర్పాటు చేసిందని డైరెక్టర్ చెప్పారు. పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య బీఈఈ ఫెసిలిటేషన్ సెంటర్ సమన్వయకర్త గా పనిచేస్తుంది. వారు పెద్ద పరిశ్రమలు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, వాణిజ్య, సంస్థాగత భవనాలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు నుండి ఇంధన సామర్ధ్య ప్రాజెక్టు వివరాలు మరియు వాటికీ కావాల్సిన రుణాలు వివరాలతో కూడిన అంగీకార పాత్రలను స్వీకరిస్తారు.
ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనలను మూల్యాంకనం చేసి వాటి సాంకేతిక విశ్లేషణ నివేదికలను రుణాల కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సమర్పిస్తుంది. అలాగే ఎనర్జీ ఎఫిషియెన్సీ ఫైనాన్సింగ్‌ను సమీకరించడానికి ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ను కూడా అభివృద్ధి చేసారు. ఇంధన సామర్ధ్య ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ స్థితిని ట్రాక్ చేయడానికి పోర్టల్ లో డాష్‌బోర్డ్ అందించబడింది.
“అదితి” ఐటీ పోర్టల్ ఆవిష్కరణలో పీఎఫ్సి, సిడ్బీ , ఇండియన్ బ్యాంక్, ఎస్బీఐ మరియు రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ అధికారులు , ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.