-విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ
-ఘనంగా కళా ఉత్సవ్ రాష్ట్ర స్థాయి పోటీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యా రంగం మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రాష్ట్ర అభివృద్దికి పెట్టుబడిగా పరిగణిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ అన్నారు. విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, కళల పట్ల అభిలాష, అభినివేశం పెంచే ఉద్దేశ్యంతో రెండ్రోజుల పాటు విజయవాడలో ఓ హోటల్లో విద్యాశాఖా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్-2022’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు లలిత కళల పట్ల ప్రోత్సాహం ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని అంశాల్లో ప్రతిభాపాటవాలు ఉంటాయని, వాటిని ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కోరారు. విద్యారంగంలో ప్రభుత్వ పథకాలు విజయవంతం కావాలంటే ఉపాధ్యాయుల అంకితభావం, కృషి ముఖ్యమని గుర్తు చేశారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో 10 అంశాల్లో 260 మంది విద్యార్థులు తమ కళా నైపుణ్యాలను ప్రదర్శించారు. ప్రదర్శినలు ఇచ్చిన చిన్నారులను ఆయన అభినందించారు.
జాతీయ స్థాయిపోటీల్లో మన సత్తా చాటాలి
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్. సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అనేక పథకాలు విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిందని అన్నారు. జనవరి 2 నుంచి 7వరకు ఒడిశా భువనేశ్వర్ లో జరగబోయే జాతీయస్థాయి కళా ఉత్సవ్ పోటీల్లో కూడా మన రాష్ట్ర విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచి వివిధ అంశాల్లో బహుమతులు తీసుకురావాలని కోరారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి డైరెక్టర్ డా. బి. ప్రతాప రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా విద్యా శాఖాధికారిణి సీవీ రేణుక, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రార్ధన గీతాన్ని ఖాసిం (ప్రకాశం జిల్లా) ఆలపించగా నమ్రత (విజయవాడ) స్వాగత నృత్యం ప్రదర్శించింది. పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థినులు బంజార జానపద నృత్యం, వయోలిన్ (శ్రీకర్, నెల్లూరు), తదితర విద్యార్థులు తమ ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నారు.